తలైవా అరంగేట్రం

ABN , First Publish Date - 2020-12-04T07:44:56+05:30 IST

రాజకీయాల్లోకి వస్తానంటూ రెండు దశాబ్దాలకుపైగా అభిమానులను ఊరిస్తున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎట్టకేలకు రాజకీయ అరంగేట్రానికి నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని, డిసెంబరు 31న ఆ పార్టీ వివరాలను వెల్లడిస్తానని గురువారం ఆయన ప్రకటించారు

తలైవా అరంగేట్రం

ఎట్టకేలకు రాజకీయాల్లోకి రజనీకాంత్‌

జనవరిలో పార్టీ పెడతానని ప్రకటన

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

మొత్తం 234 స్థానాల్లోనూ బరిలోకి

రాజకీయ మార్పు తథ్యమని ఉద్ఘాటన

తమిళనాట రాజకీయ తుఫాను

ద్రవిడ పార్టీల్లో కలకలం


తమిళనాడు తలరాత మార్చే సమయం ఆసన్నమైంది. నా పార్టీ గెలిస్తే ప్రజలు గెలిచినట్లు. నా పార్టీ ఓడినా ప్రజల ఓటమే అవుతుంది.

- రజనీకాంత్‌


చెన్నై, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లోకి వస్తానంటూ రెండు దశాబ్దాలకుపైగా అభిమానులను ఊరిస్తున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎట్టకేలకు రాజకీయ అరంగేట్రానికి  నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని, డిసెంబరు 31న ఆ పార్టీ వివరాలను వెల్లడిస్తానని గురువారం ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో వేడి పుట్టించింది. ద్రవిడ పార్టీలలో గుబులు రేపింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్న అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూటముల్లో అలజడి ఆరంభమైంది.   మరోవైపు రాష్ట్రమంతటా రజనీకాంత్‌ అభిమానులు పండుగ చేసుకున్నారు. టపాకాయలు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. కులమతాలకు అతీతంగా ఆధ్యాత్మిక రాజకీయ స్థాపనే తన ప్రధాన లక్ష్యమని రజనీకాంత్‌ గురువారం ఉదయం ట్విటర్‌లో పేర్కొన్నారు. అవినీతి రహితంగా పారదర్శకమైన ప్రజా సంక్షేమ పాలన అందిస్తానని పేర్కొన్నారు. మధ్యాహ్నం పోయె్‌సగార్డెన్‌లోని తన నివాసం వద్ద రజనీకాంత్‌ విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ మార్పు తీసుకొస్తానని శపథం చేశారు. అధికారంలో మార్పుకోసం 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్నారు.


కరోనా..లాక్‌డౌన్‌ వల్లే ఆలస్యం..

ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నానని, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలను కలుసుకోలేకపోయానని చెప్పారు. తనకు కిడ్నీ మార్పిడి జరిగినందున, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో కరోనా బారిన పడతాననే ఆందోళనతోనూ పర్యటించలేకపోయానని చెప్పారు. రాష్ట్రంలో 1967 నుంచి ద్రవిడ సిద్ధాంతాలు, పెరియార్‌ నాస్తికవాదాలు కలిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలే వరుసగా అధికారంలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవిడ పార్టీలకు ధీటుగా రజనీకాంత్‌ స్థాపించనున్న ఆధ్యాత్మిక రాజకీయం సత్ఫలితమిస్తుందో లేదో వేచి చూడాల్సిందే!


సమన్వయకర్తగా అర్జున్‌మూర్తి..

రాజకీయ పార్టీని ప్రారంభించకమునుపే రెండు నియామకాలను రజనీకాంత్‌ పూర్తి చేశారు.  గాంధీ మక్కల్‌ ఇయక్కమ్‌ నాయకుడు తమిళరువి మణియన్‌ను పార్టీ  పర్యవేక్షకుడిగాను, బీజేపీ మేధోవిభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అర్జున్‌మూర్తిని పార్టీ ముఖ్య సమన్వయకర్తగాను నియమించించారు.


1995 నుంచే...

రజనీకాంత్‌ 1995లోనే రాజకీయాల వైపు దృష్టి మళ్లించారు. ‘బాషా’ సినిమా విజయోత్సవ సభలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత సమక్షంలోనే రాష్ట్రంలో బాంబుల సంస్కృతి అధికమైందని రజనీకాంత్‌ ప్రకటించడంతో ఆయన అభిమానులపై దాడులు జరిగాయి. రజనీ కారు ధ్వంసమైంది. ఆ తర్వాత అన్నాడీఎంకే పాలనను అడ్డుకునే దిశగా డీఎంకే, టీఎంసీ కూటమికి రజనీ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడంటూ ప్రకటనకూడా చేశారు. ఆ తర్వాత డీఎంకే టీఎంసీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి రజనీకాంత్‌ పరోక్ష రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత మృతితో రాజకీయ వెలితి ఏర్పడిందని, ఆ వెలితిని భర్తీ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వస్తానని మూడేళ్ల క్రితం ఆయన ప్రకటించారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రవేశం చేయాలంటూ రజనీపై తీవ్ర ఒత్తిడులు పెరిగాయి. బీజేపీ మిత్రులు, రజనీ సన్నిహితుడైన తుగ్లక్‌ పత్రిక సంపాదకుడు, ఆడిటర్‌ గురుమూర్తి, గాంధీ మక్కల్‌ ఇయక్కమ్‌ నేత తమిళరువి మణియన్‌ తరచూ ఆయనను కలుసుకుంటూ రాజకీయ ప్రవేశానికి ఇదే అనువైన తరుణమంటూ ప్రోత్సహించారు. దీంతో గురువారం రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేశారు. 


రజనీకి మంచి జరగాలి: పవన్‌కల్యాణ్‌

తిరుపతి: రాజకీయ పార్టీ పెట్టనున్న రజనీకాంత్‌కు మంచి జరగాలని సినీనటుడు పవన్‌కల్యాణ్‌ అభిలషించారు. తిరుపతిలో పవన్‌ మాట్లాడుతూ జనబలం ఉన్న కొత్త వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు కూడా మంచి జరుగుతుందన్నారు.

Updated Date - 2020-12-04T07:44:56+05:30 IST