Jul 7 2021 @ 16:07PM

కుమార్తె దర్శకత్వంలో రజినీకాంత్‌?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన తదుపరి చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో చేయనున్నారనే చర్చ ఇపుడు కోలీవుడ్‌లో సాగుతోంది. ప్రస్తుతం ఆయన నటించిన ‘అణ్ణాత్త’ చిత్రం ఈ ఏడాది నవంబరు 4వ తేదీన దీపావళికి విడుదల కానుంది. పైగా ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా మిగిలిపోయిన ప్యాచ్‌ వర్క్‌ సాగుతోంది. అదేసమయంలో రజినీకాంత్‌ వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్ళివున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలన్నీ పూర్తి రావడంతో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకుని నగరానికి రానున్నారు. వాస్తవానికి పలువురు దర్శకులతో పాటు యువ దర్శకులు కూడా ఆయనకు కథలు వినిపించారు. ఇలాంటి వారిలో ఆయన కుమార్తె సౌందర్య కూడా ఒకరు. అయితే, రజినీకాంత్‌ మాత్రం తన తదుపరి ప్రాజెక్టును కుమార్తె దర్శకత్వంలోనే నటించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అధికారపూర్వక ప్రకటన అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాత వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Otherwoodsమరిన్ని...