Abn logo
May 29 2020 @ 04:42AM

మొక్కుబడి మాటలు

 ముందుకు సాగని ‘నాడు-నేడు’ పనులు 

జిల్లాలో తొలివిడతలో 1,271 స్కూళ్లలో పనులు

రూ.51 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్స్‌ జమ

పనులు ఆగమేఘాల మీద చేయాలంటూ ఒత్తిళ్లు

నేటికీ సిమెంట్‌, ఇతర మెటీరియల్‌ సరఫరా శూన్యం

సెలవుల్లో పనిచేయాలంటూ మౌఖిక ఆదేశాలు

ఉత్తర్వులు ఇవ్వని విద్యాశాఖ అధికారులు 

బేల్దార్లకు ఆన్‌లెన్‌ పేమెంట్స్‌ ఎలా..?

తలలు పట్టుకుంటున్న ప్రధానోపాధ్యాయులు


‘నగరంలోని రాజేంద్ర మున్సిపల్‌ హై స్కూల్‌లో సుమారు రూ. 63 లక్షల నాడు-నేడు పనులు చేయాలి. అ యితే అరకొరగా ఇసుక సరఫరా చేశారు. ఒక్క బస్తా సిమెంట్‌ ఇవ్వలేదు. దీంతో పనులు ప్రారంభంపై  సందేహాలు వ్యక్తమవుతున్నాయి’.


‘జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న కేఎస్‌ఆర్‌ హైస్కూల్‌లో ఎలక్ర్టికల్‌ పనులు భారీగా చేయనున్నారు. ఈ స్కూల్‌లో  సుమారు రూ. 54 లక్షల నాడు-నేడు పనుల్లో ఎలక్ర్టికల్‌ పనులదే సింహభాగం. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి  మెటీరియల్‌ స్కూల్‌కు చేర్చలేదు.’’


అనంతపురం విద్య, మే 28 : పాఠశాల విద్యను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం తలపెట్టిన  నాడు- నేడు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఆగస్టు నాటికి అన్నీ పూర్తి చేయాలంటూ ప్రభుత్వం ఒత్తిడి పెడుతోంది. అయితే క్షేత్రస్థాయికి సిమెంట్‌, ఇసుక, ఇతర సామగ్రిని సరఫరా చేయడం లేదు. సెలవుల్లో పని చేయాలంటూ చెప్పడం మినహా ఎలాంటి ఉత్తర్వులు అధికారులు ఇవ్వడం లేదు. పైగా ఒక్క రూపాయి చెల్లించాలన్నా ఆన్‌లైన్‌లోనేనని చెబుతున్నారు. కూలీలు, బేల్దార్లు దొరకడమే గగనం అంటుంటే...వారికి  ఆన్‌లైన్‌ చెల్లింపులు ఎలాగంటూ ప్రధానోపాధ్యాయులు జుట్టు పీక్కుంటున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 1,271 స్కూళ్లలో నాడు-నేడు పనులు ఒక్క అడుగు ముందుకు....నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారయ్యాయి. 


ఏడాది కావస్తున్నా... ముందుకు అడుగేది....?

పునఃప్రారంభం నాటికి స్కూళ్ల స్వరూపం మార్చే స్తామంటూ ప్రభుత్వం గొప్పలు పోతోంది. అయితే ఆచర ణలో అది అగుపడటం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,279 స్కూళ్లలో తొలి విడత నాడు-నేడు పనులు చేయాలనుకు న్నారు. అయితే 8 స్కూళ్లతో స్థల సమస్య కారణంగా వా టిని జాబితా నుంచి తొలగించి 1,271 స్కూళ్లలో పనులు చేయనున్నారు. వీటికితోడు తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, కదిరి తదితర మున్సిపాలిటీల్లో మరో 25 స్కూళ్లను సైతం ఈ పనుల కింద చేర్చారు. అయితే వాటికి సంబంధించి రివైజ్డ్‌ ఉత్తర్వులు రావాల్సి ఉంది.


వీటిలో పనులు నిర్వహణకు ఆ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు 15 శాతం రివాల్వింగ్‌ ఫండ్‌ కింద రూ.51 కోట్లు జమ చేశారు. గత ఏడాది నుంచి స్కూళ్ల ఎంపిక, ఖాతాల ప్రారంభం, పనుల శంకు స్థాపనలకే ఏకంగా ఏడాది కావస్తోంది. ఎక్కడా పనులు ముందుకు సాగడం లేదు. వందలాది స్కూళ్లకు నేటికీ సిమెంట్‌ బస్తాలు చేరలేదు. ఇసుక సైతం అరకొరగానే దించుతున్నారు. పనులు సాగని పరిస్థితి. సిమెంటు ఒకరు, ఇసుక మరొకరు, ఇతర ఎలక్ర్టికల్‌ మెటీరియల్‌ మరొకరు అన్నట్లు వాటి సరఫరా బాధ్యతలు ఏ జెన్సీలకు ప్రభుత్వం అప్పజెప్పింది. ఫలితంగా మెటీరియల్‌ రావడమే గగనంగా మారింది.


ఊకదంపుడు ఉత్తర్వులు !

ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే ప్రధానోపాధ్యాయులను నాడు-నేడు పనులకు వెళ్లాలంటున్నారు. అయితే వారు మాత్రం తమకు ఆర్జిత సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే కమిషనరేట్‌ నుంచి కానీ, ఇటు డీఈఓ నుంచి కానీ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా  వెళ్లాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. సిమెంటు, ఇసుక తరలింపునకు ఇచ్చిన ఉత్తర్వులకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికి పొంతన లేదు. ఇసుక, సిమెంటును ఏజెన్సీలు సరఫరా చేస్తాయి. వారికి ఆన్‌లైన్‌లోనే ముందుగానే ఆటోమెటిక్‌గా పేమెంట్స్‌ అవుతాయి. అయితే కొన్ని చోట్ల ఇసుక తరలింపులో టోల్‌ గేట్ల వద్ద టోల్‌ ఫీజులు కింద ట్రిప్పుకు రూ. 700 చొప్పున చెల్లించామంటూ ఏజెన్సీల వాళ్లు చెబుతున్నారు.


కొన్ని స్కూళ్లకు 10, 20 ట్రిప్పుల ఇసుకకు టోల్‌ చార్జీలు కింద రూ. 7000, రూ.14 వేలు అదనంగా ప్రధానోపాధ్యాయుల నుంచి వసూలు చేస్తున్నారు. అయితే ఏజెన్సీలే స్కూళ్లకు నేరుగా ఇసుకను సరఫరా చేయాలి. సిమెంట్‌ బస్తాల అన్‌లోడ్‌లో సైతం బస్తాకు రూ. 5 వరకూ వసూలు చేస్తున్నారు. పైగా చెల్లింపు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చేయాలని అధికారులు చెబుతుంటే ఆన్‌లైన్‌ లావాదేవీలు తెలియని కూలీలు, బేల్దార్లకు తాము ఎలా చెల్లించగలమని వాపోతున్నారు. అస్పష్టమైన మార్గదర్శకాల వల్ల పనులు ముందు కుసాగడం లేదు.


స్పష్టమైన ఉత్తర్వులివ్వాలి : శ్రీధర్‌రెడ్డి, పీఆర్టీయూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నాడు-నేడు పనులు చేయడం మంచిదే. అయితే ప్రధానోపాధ్యాయులకు సరైన ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు. టోల్‌ చార్జీల కింద కొన్ని స్కూళ్ల నుంచి ట్రిప్పుకు రూ.700 చొప్పున వసూలు చేస్తున్నారు. పైగా లాక్‌డౌన్‌, కొవిడ్‌- 19, సెలవుల నేపథ్యంలో పనులు చేయాలంటున్నారు. అయితే అందు కు తగిన ఉత్తర్వులు ఇవ్వకుండా పనులు మాత్రం చేయమని చెప్పడం శోచనీయం. 


ఇది సబబు కాదు : మహమ్మద్‌ రఫీ, ఏపీటీఎఫ్‌, జిల్లా ప్రధానకార్యదర్శి

భవనాల నిర్మాణం ఇంజనీర్ల పని. బోధనేతర పనులకు ఉపాధ్యాయులను ఉపయోగించరాదు. రవాణా సమస్యలు, కరోనా నేపథ్యంలో, ఎలాంటి అనుమతి పత్రాలు ఇవ్వకుండా పనులు చేయాలనడం సబబుకాదు. ప్రధానోపోధ్యాయులపై అదనపు భారం మోపడం భావ్యం కాదు.

Advertisement
Advertisement
Advertisement