20 వరకు కస్టడీకి రాజేంద్ర బాలాజీ

ABN , First Publish Date - 2022-01-07T14:14:09+05:30 IST

ఆవిన్‌ సహా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వేయిస్తానంటూ పలువురి నుంచి రూ.3 కోట్ల మేర వసూలు చేసి మోసం చేసిన కేసులో అరెస్టయిన అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్రబాలాజీని ఈనెల 20 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ శ్రీవిల్లి

20 వరకు కస్టడీకి రాజేంద్ర బాలాజీ

- అరెస్టుపై అంతతొందరెందుకు? : సుప్రీంకోర్టు 

- బెయిలుపై విచారణ వాయిదా


చెన్నై: ఆవిన్‌ సహా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వేయిస్తానంటూ పలువురి నుంచి రూ.3 కోట్ల మేర వసూలు చేసి మోసం చేసిన కేసులో అరెస్టయిన అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్రబాలాజీని ఈనెల 20 వరకూ జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ శ్రీవిల్లి పుత్తూరు కోర్టు మేజిస్ర్టేట్‌ పరమ్‌వీర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో రాజేంద్ర బాలాజీ బెయిలు పిటిషన్‌పై విచారణ జరిగింది. బెయిలుపిటీషన్‌పై విచారణ ప్రారంభం కాకమునుపే రాజేంద్ర బాలాజీని అరెస్టు చేయడానికి ఎందుకంత తొందర పడ్డారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్‌ 17 నుంచి పరారీలో ఉన్న రాజేంద్ర బాలాజీ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు దళాలు గాలించాయి. బుధవారం కర్ణాటకలోని హసన్‌ వద్ద ఆయన ఉన్నట్లు సమాచారం అందటంతో ప్రత్యేక దళం నిఘా వేసి కారులో వెళ్తున్న రాజేంద్రబాలాజీని బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. పరారీలో ఉన్నప్పుడు ఆయనకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై అన్నాడీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి రాజపాండ్యన్‌, మాజీ మంత్రి సహాయకుడు గణేశన్‌, కృష్ణగిరి జిల్లా బీజేపీ నేత రామకృష్ణన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రాజేంద్ర బాలాజీ వద్ద మదురై సర్కిల్‌ పోలీసు అధికారి కామినీ, విరుదునగర్‌ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ మనోహర్‌ వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. తరవాఆత ఆయనకు విరుదునగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, ఆర్టీపీసీఆర్‌ టెస్టు నిర్వహించారు. గురువారం ఉదయం 8 గంటలకు శ్రీవిల్లిపుత్తూరు కోర్టులో మేజిస్ట్రేట్‌ పరమ్‌వీర్‌ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసుపై విచారణ జరిపిన మేజిస్ర్టేట్‌ పరమ్‌వీర్‌ రాజేంద్రబాలాజీకి ఈ నెల 20 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. ఆ తర్వాత ఆయనను వ్యాన్‌లో తిరుచ్చి సెంట్రల్‌ జైలుకు తరలించారు.


ఎందుకంత తొందర? : సుప్రీం

రాజేంద్రబాలాజీ పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. గురువారం ఉదయం ప్రధాన న్యాయ మూర్తితో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం బెయిలు పిటిషన్‌పై విచారణ ప్రారంభించింది. రాజేంద్ర బాలాజీని రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు చేశారా? అని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని న్యాయమూర్తులు ప్రశ్నించారు. మోసపోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల్లో వాస్తవాలు ఉన్నట్టు నిర్ధారించిన మీదటే పోలీసులు కేసు నమోదు చేశారని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వా నికి ఎలాంటి దురుద్దేశం కానీ, రాజకీయ కక్షసాధింపు కానీ లేవని ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. రాజేంద్రబాలాజీ ముందస్తు బెయిలు పిటిషన్‌పై గురువారం ఉదయం విచారణ జరపాలని అనుకున్నామని, ఆలోగా అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు ఎందుకు తొందరపడ్డారని న్యాయమూర్తులు ప్రశ్నించారు. రాజేంద్రబాలాజీ తరఫు న్యాయవాదులందరినీ ఎందుకు ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఈ కేసులో రాజేంద్ర బాలాజీతో పాటు నిందితులుగా ఉన్న బాబురాయ్‌, బలరామన్‌, ముత్తుపాండిని పోలీసులు అరెస్టు చేయకుండా న్యాయమూర్తులు స్టే విధించారు. రాజేంద్రబాలాజీ బెయిలు పిటిషన్‌పై కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభు త్వానికి ఆదేశాలు జారీ చేసి కేసు తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - 2022-01-07T14:14:09+05:30 IST