రాజేంద్ర బాలాజీపై మరో మోసం కేసు

ABN , First Publish Date - 2021-12-25T16:02:07+05:30 IST

అరెస్టుకు భయపడి వారం రోజులకు పైగా పరారీలో ఉన్న అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్రబాలాజీపై తాజాగా మరో మోసం కేసు నమోదైంది. అదే సమయంలో సుప్రీంకోర్టులో ఆయన పెట్టుకున్న బెయిలు పిటిషన్‌పై తీర్పు

రాజేంద్ర బాలాజీపై మరో మోసం కేసు

                   - సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కెవియట్‌


చెన్నై: అరెస్టుకు భయపడి వారం రోజులకు పైగా పరారీలో ఉన్న అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్రబాలాజీపై తాజాగా మరో మోసం కేసు నమోదైంది. అదే సమయంలో సుప్రీంకోర్టులో ఆయన పెట్టుకున్న బెయిలు పిటిషన్‌పై తీర్పు వెలువరించే ముందు తమ తరఫు వాదనలను పరిగణనలోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కెవియట్‌ ను శుక్రవారం సమర్పించింది. ఆవిన్‌ సంస్థ సహా ప్రభుత్వ శాఖల్లో ఉద్యో గాలు వేయిస్తానంటూ రాజేంద్ర బాలాజీ మూడు కోట్లకు పైగా వసూలు చేసి మోసగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిలు కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై వచ్చే తీర్పు కోసం అజ్ఞాతంలో వుంటూ ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విరుదునగర్‌ జిల్లాలో రాజేంద్ర బాలాజీపై తాజాగా మరో మోసం కేసు నమోదైంది.  విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ యజమాని సెలవ్రాజన్‌ ఎస్పీ కార్యాలయంలో ఓ ఫిర్యాదు సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలలో తన స్నేహితులకు ఉద్యోగాలు వేయిస్తానంటూ రాజేంద్రబాలాజీ రూ.11 లక్షలు వసూలు చేసి మోసగించారని ఆరోపించారు. తన స్నేహితులు పరమగురు, ముత్తుసామి సహా పలువురి వద్ద ఉద్యోగాలు తీసిస్తానంటూ రూ.27లక్షలను అడిగారని, అడ్వాన్స్‌గా తాము రూ.11లక్షలను అందించామన్నారు. ఈ ఫిర్యాదుపై విరుద్‌నగర్‌ జిల్లా క్రైంవిభాగం పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-12-25T16:02:07+05:30 IST