కేజ్రీవాల్ ‘జాతీయ’ చాణక్యం!

ABN , First Publish Date - 2022-01-28T06:27:50+05:30 IST

సరైన నాయకత్వం లేని, సంస్థాగతంగా బలహీనపడిన కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లపై దృష్టిని కేంద్రీకరించింది...

కేజ్రీవాల్ ‘జాతీయ’ చాణక్యం!

సరైన నాయకత్వం లేని, సంస్థాగతంగా బలహీనపడిన కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లపై దృష్టిని కేంద్రీకరించింది. కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకుని ఆ పార్టీని బలహీనపరచడం ద్వారా భవిష్యత్తులో బీజేపీకి జాతీయస్థాయి సవాల్‌దారుగా ఆవిర్భవించవచ్చని కేజ్రీవాల్ గట్టిగా భావిస్తున్నారు. ఆప్ అధినేత జాతీయ ఆకాంక్షల విషయమై ప్రధాన జాతీయపక్షాలు రెండూ ఇప్పటికే మేల్కొన్నాయి.


అధికార ఫలాలను పొందడంలో సఫలమయిన రాజకీయ అంకురాలకు అవార్డు ఉంటే, అది, గత దశాబ్దికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కే తప్పకుండా దక్కుతుంది (ఆంధ్రప్రదేశ్ పాలక పార్టీ వైఎస్‌ఆర్‌సిపి కూడా ఈ పురస్కారానికి ప్రధాన పోటీదారే. అయితే ఆ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ అనే మహావృక్షం నుంచి విరిగి పడి మోసులెత్తిన కొమ్మే కదా). ఐఐటి పట్టభద్రుడు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ వలే, అతి స్వల్ప కాలంలో నాటకీయ ప్రభావాన్ని నెరపిన రాజకీయ పక్షం మరేదీ లేదు. జాతీయ రాజధానే ఉనికిపట్టు కావడంతో అపారంగా లభించిన మీడియా ప్రచారం ఆప్ విజయాలకు విశేషంగా తోడ్పడిందనడంలో సందేహమేమీ లేదు. మరి అఖిల భారత రాజకీయ పక్షంగా ఆప్ ఎదుగుతుందా? ఎదగగలదా? కొంతమందిని వేధిస్తున్న, మరికొంత మందిని చికాకు పరుస్తున్న ప్రశ్నలివి. కనుకనే 2022 అసెంబ్లీ ఎన్నికలు ఆప్ రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక దశ, నిర్ణయాత్మక సందర్భం కానున్నాయి. 


మరి కొద్ది రోజులలో ఎన్నికలకు వెళ్ళనున్న ఐదు రాష్ట్రాలలో, ఆప్ ఒక పోటీదారుగా ఉన్నది. పంజాబ్‌లో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా పోటీపడుతోంది. గోవాలో అధికారాన్ని సాధించుకోలేకపోయినా కొత్త ముఖ్యమంత్రి ఎంపికను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయనున్నది. ఉత్తరాఖండ్‌లో ప్రత్యర్థి పార్టీల జయాపజయాలను నిర్ణయించనున్నది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ మూడు రాష్ట్రాలలోనూ స్వీయ విజయానికి విభిన్న వ్యూహాలను ఆప్ అనుసరిస్తోంది. పంజాబ్‌లో ఉన్నత వర్గాల వారి పట్ల పెచ్చరిల్లుతున్న వ్యతిరేకత, గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్-, అకాలీదళ్ ద్వంద్వాధిపత్యానికి ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రయోజనం పొందడమే లక్ష్యంగా ఆప్ వ్యూహం రూపుదిద్దుకుంది. గోవాలో తనను తాను మధ్యతరగతి ప్రజల పార్టీగా చెప్పుకుంటున్నది. తాను భిన్నమైన పార్టీనని, గోవా రాజకీయాలను అప్రతిష్ఠాకర ఫిరాయింపులు, ధనబలం దుష్ప్రభావాల నుంచి కాపాడతానని హామీ ఇస్తోంది. ఇప్పటికే తాను అధికారంలో ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో స్థానిక పాలనను ప్రభావశీలంగా పటిష్ఠపరిచిన ‘విద్య, ఆరోగ్యభద్రత’ అభివృద్ధి నమూనాను అమలుపరుస్తానని ఉత్తరాఖండ్ ఓటర్లకు ఆప్ హామీ ఇస్తోంది.


మూడు రాష్ట్రాలలోనూ మూడు ప్రత్యేక వ్యూహాలను అనుసరించేందుకు ఆప్‌ను పురిగొల్పినదేమిటి? సువ్యవస్థిత జాతీయ రాజకీయ పక్షాలకు ‘ఆచరణీయ’ ప్రత్యామ్నాయంగా దేశ ప్రజల మనస్సులో సుప్రతిష్ఠితమవ్వాలనే ఆరాటమే ఆమ్ ఆద్మీ పార్టీని భిన్న రాజకీయ బాటలో ముందుకు తీసుకువెళుతోంది. ‘సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నమైన రాజకీయ పక్షం’ అన్న ప్రతిష్ఠకు తగిన విధంగానే ఆప్ ఆ మూడు రాష్ట్రాలలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎంపిక చేసింది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి మాజీ హాస్యనటుడు భగవంత్ మాన్. శక్తిమంతమైన భూపాలుడిపై గ్రామీణ జానపద ధీరోదాత్తుడి పోరాట గాథలను తలపించే ఎంపిక ఇది. గోవాలో భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాది అమిత్ పాలేకర్ ఆప్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి కాగా ఉత్తరాఖండ్‌లో మాజీ సైనికాధికారి కల్నల్ అజయ్ కొథియాల్‌ను భావి ముఖ్యమంత్రిగా ఆప్ ప్రచారం చేస్తోంది. 2013 కేదార్‌నాథ్ మెరుపు దాడుల విధ్వంసం అనంతరం పునర్నిర్మాణ కార్యక్రమాలను ప్రశస్తంగా అమలుపరిచిన ప్రజాహితుడుగా కల్నల్ అజయ్ ఆ హిమాలయ ప్రాంతాల ప్రజలకు సుపరిచితుడు.


సంప్రదాయ రాజకీయ పక్షాలకు భిన్నమైన పార్టీగా 2013లో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఆప్ నిస్సందేహంగా ఒక ‘కొత్త’ పార్టీ. ఎందుకని? ఇప్పుడు ఆప్ ఎంత మాత్రం ఒక స్వచ్ఛంద పోరాట దళం కాదు. పైపెచ్చు సంప్రదాయ రాజకీయ పార్టీని తలదన్నే రాజకీయ పక్షం. అరవింద్ కేజ్రీవాల్ ఈ ‘కొత్త’ ఆప్‌కు తిరుగులేని, ఎదురులేని సర్వాధినేత. కేజ్రీవాల్ ప్రభుత్వం ఇటీవల ఢిల్లీలో ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎక్సైజ్ విధానాన్నే తీసుకోండి. దాని ఫలితంగా ఢిల్లీలో ప్రైవేట్ లిక్కర్ విక్రేతలు పెరిగిపోయారు! ఆర్థిక వనరుల సమీకరణకు గాను పాలనలో నైతిక కట్టుబాట్లను విడనాడేందుకు కేజ్రీవాల్ సందేహించలేదు. మరి ఈ ఆచరణశీలి తొలినాటి ఆదర్శవాదికి పూర్తిగా భిన్నమైనవాడు. నిజానికి కేజ్రీవాల్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, ఎన్నికల అనంతరం వాటిని అమలుపరుస్తున్న తీరుతెన్నులకు మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతోంది. ఢిల్లీని ఆవహించిన వాయుకాలుష్యమే ఇందుకొక తార్కాణం. 


సునిశ్చిత లౌకికవాద పార్టీగా ఆప్ రంగంలోకి వచ్చింది. ఆ నిబద్ధత క్రమంగా కరిగిపోతున్నట్టు విమర్శకులు పేర్కొంటున్నారు. 2020 ఢిల్లీ అల్లర్లను అదుపు చేయడంలో ఆప్ సర్కార్ సమర్థంగా వ్యవహరించలేకపోయింది. ఆ మాటకొస్తే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్ బాగ్‌లో చరిత్రాత్మక పోరాటం చేసిన మహిళల విషయంలో ఆప్ ప్రభుత్వం ఉదాసీనంగానే వ్యవహరించడం లౌకికవాదులను కలవరపరిచింది. ‘మైనారిటీ’ వర్గాల శ్రేయస్సు విషయంలో ఆప్ తన బాధ్యతలను విస్మరించిందనడానికి ఇంకా పలు నిదర్శనాలు ఉన్నాయి. కనుకనే కాబోలు కాంగ్రెస్ పార్టీ ఆప్‌ను ‘బీజేపీ బి టీమ్’ అని దుయ్యబట్టింది. హిందూ జాతీయవాద ప్రభంజనంతో రాజీపడిన పార్టీగా ఆప్‌ను కాంగ్రెస్ తరచు విమర్శిస్తోంది. కశ్మీర్‌లో అధికరణ 370 రద్దును ఆప్ బలపరిచింది. ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ బహిరంగంగా ‘హనుమాన్ చాలిసా’ను పఠించారు. సీనియర్ పౌరుల అయోధ్యా యాత్రకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయాలను కల్పించింది. తన రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ‘హిందూ’ మెజారిటీ వాదాన్ని ఉద్దేశపూర్వకంగా కేజ్రీవాల్ సమర్థిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


విలువల ఆధారిత నైతిక రాజకీయాల నుంచి స్వార్థ ప్రయోజనాలను కృత నిశ్చయంతో సాధించుకునే రాజకీయ పార్టీగా పరివర్తన చెందిన తీరుతెన్నుల్లో ఆప్ భావి పెరుగుదల ప్రణాళికలకు పునాదులు పడ్డాయి. భారతదేశంలో రాజకీయాలు నైతిక నిష్ఠతో కూడిన వ్యవహారాలు కానే కావు. అవి, మన సమాజంలోని సంక్లిష్టతలు, కాపట్యాలకు మాత్రమే అద్దం పడుతున్నాయి. ప్రతి రాజకీయ పక్షమూ తాను విశ్వసిస్తున్న భావజాలం విషయంలో ఏదో ఒక విధంగా రాజీపడ్డాయి. ఇప్పటికీ పడుతూనే ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఆప్ మాత్రమే సమున్నత విలువలకు ఎందుకు కట్టుబడి ఉండాలి? ‘లౌకికవాదం’పై కాంగ్రెస్ పార్టీకి మాత్రమే గుత్తాధిపత్యం ఉందా? తన ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నప్పుడు లౌకికవాదాన్ని ఉపయోగించుకుని, రాజకీయ లబ్ధి లేదనుకున్నప్నుడు దాన్ని విడనాడిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదూ? లౌకికవాదం విషయంలో ఏ ఎండకాగొడుగు పట్టిన చందంగా వ్యవహరించని రాజకీయ పక్షమేదైనా ఉందా? సమకాలీన రాజకీయాలలో ‘హిందూ-వ్యతిరేకత’ ముద్రను ఒక ప్రధాన అవరోధంగా చూస్తున్నారు. ఈ వాస్తవాల దృష్ట్యానే ఆప్ సున్నిత, సమతౌల్య నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలను ఎటువంటి ఘర్షణలకు తావులేకుండా అమలుపరుస్తోంది. 


మధ్యతరగతి ప్రజల్లో ప్రగతిశీలురు విశ్వసించే ఆదర్శ నాయకుడు అనే పేరు ప్రతిష్ఠలను కాపాడుకోవడానికి బదులు తన రాజకీయ నిర్బంధాలు, ఆవశ్యకతలకే కేజ్రీవాల్ ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. అవినీతి వ్యతిరేక జన్ లోక్‌పాల్ బిల్లును తీసుకురాలేకపోయిన కారణంగా తొలిసారి అధికారానికి వచ్చిన 44 రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర కేజ్రీవాల్‌కు ఉంది. అంతేకాదు రాజకీయాల్లోకి ప్రవేశించిన కొద్ది నెలల్లోనే 2014లో వారణాసిలో నరేంద్ర మోదీని సవాల్ చేసే తెగువను నిర్భయంగా ప్రదర్శించిన నేత కేజ్రీవాల్. ఎంతటి శక్తిమంతులతోనూ ఢీ కొనడానికి ఆయన వెనుకాడని కాలం ఒకటి ఉండేది. ఆ రోజుల్లోనే ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘పిరికివాడు’ అనీ, ‘సైకోపాథ్ ’ (వికలోద్వేగరోగి) అని కేజ్రీవాల్ విమర్శించారు. ఇప్పుడు ఆ కేజ్రీవాల్ ఎక్కడ? మధ్యతరగతి ప్రజల క్రియాశీల ధీరోదాత్తుడికి బదులు ఒక పక్కా రాజకీయవేత్త మాత్రమే ఇప్పుడు ఆయనలో కనిపిస్తున్నాడు. రాజకీయాలలో ఓర్పును మించిన సుగుణం లేదన్న వాస్తవాన్ని ఆయన ఎట్టకేలకు గుర్తించారు మరి.


కేజ్రీవాల్‌కు ఒకప్పుడు నరేంద్ర మోదీ, బీజేపీలే ప్రథమ శత్రువులు. 2022 సంవత్సరంలో ప్రత్యర్థులు, విరోధులకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యం మారిపోయింది. సరైన నాయకత్వం లేని సంస్థాగతంగా బలహీనపడిన కాంగ్రెస్సే. బీజేపీ కంటే బాగా దుర్బలమైన పార్టీ అని ఆయన గుర్తించారు. కనుకనే కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఆప్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలలో మైనారిటీ వర్గాల వారు ఆధిక్యత ఉన్న ప్రాంతాలను ఆప్ విజయవంతంగా కైవసం చేసుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఒక ప్రధాన శక్తిగా ఉన్న పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లపై తన దృష్టిని కేంద్రీకరించింది. ప్రస్తుత దశలో బీజేపీతో తలపడితే కేజ్రీవాల్ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. మోదీ వ్యతిరేక విపక్ష నాయకులలో ఒకడుగా మాత్రమే ఆయన మిగిలిపోతారు. కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లను ఆకట్టుకుని ఆ పార్టీని బలహీనపరచడం ద్వారా భవిష్యత్తులో బీజేపీకి జాతీయస్థాయి సవాల్‌దారుగా ఆవిర్భవించవచ్చని కేజ్రీవాల్ గట్టిగా భావిస్తున్నారు. ఆప్ అధినేత ఆలోచనలను కాంగ్రెస్, బీజేపీ రెండూ పసిగట్టకపోలేదు. కనుకనే కేజ్రీవాల్ జాతీయ ఆకాంక్షల విషయమై ఆ రెండు పార్టీలూ ఇప్పటికే మేల్కొన్నాయి.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

Updated Date - 2022-01-28T06:27:50+05:30 IST