రాజస్థాన్ చారిత్రక విజయం

ABN , First Publish Date - 2020-09-28T05:02:30+05:30 IST

పంజాబ్‌పై రాజస్థాన్ గెలిచింది. అసాధ్యమనుకున్న టార్గెట్‌ను ఛేదించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. దీంతో టీ20ల్లో అత్యధిక టార్కెట్‌ను ఛేజ్ చేసిన జట్టుగా...

రాజస్థాన్ చారిత్రక విజయం

షార్జా: పంజాబ్‌పై రాజస్థాన్ గెలిచింది. అసాధ్యమనుకున్న టార్గెట్‌ను ఛేదించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. దీంతో టీ20ల్లో అత్యధిక టార్కెట్‌ను ఛేజ్ చేసిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ చరిత్ర సృష్టించింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి బంతి నుంచే పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో బౌండరీల మోత మోగించారు. మయాంక్(50 బంతుల్లో 106) సెంచరీతో మెరవగా.. రాహుల్(54 బంతుల్లో 69) అర్థ సెంచరీతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 224 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ప్రారంభంలోనే భారీ దెబ్బ తగిలింది. ఇంగ్లండ్ హిట్టర్ జాస్ బట్లర్ 4 పరుగులకే వెనుతిరగడంతో జట్టు ఒత్తిడికి గురైంది. అయితే కెప్టెన్ స్టీవ్ స్మిత్, సంజు శాంసన్ మళ్లీ జట్టును ఆదుకున్నారు. రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గకుండా.. వికెట్ కాపాడుకుంటూ అద్భుతంగా ఆడారు. అయితే అర్థ సెంచరీ తరువాత స్మిత్ అవుటైనా శాంసన్ పోరాటం కొనసాగించాడు. కానీ రిక్వైర్డ్ రన్ రేట్ భారీగా పెరిగిపోయింది.


ఆ ఒత్తిడిలోనే శాంసన్ 85 పరుగుల వద్ద వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో రాజస్థాన్ ఓటమి ఖాయంగా కనపడింది. కానీ చివర్లో తెవాటియా కళ్లు చెదిరే ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను మలుపు తిప్పేశాడు. 18వ ఓవర్లో ఏకంగా 5 సిక్సర్లు కొట్టి మ్యాచ్ గతినే మార్చేశాడు. ఆ తరువాత షమి ఓవర్లో ఊతప్ప అవుట్ కాగా క్రీజ్‌లోకి వచ్చిన ఆర్చర్ మునుపటి మ్యాచ్‌లోలానే బ్యాట్ ఝుళిపించాడు. రావడంతోనే రెండు సిక్సులు బాదేశాడు. తెవాటియా కూడా ఓ సిక్స్ కొట్టడంతో టార్కెట్ 6 బంతులకు 2 పరుగులకు చేరింది. చివరి ఓవర్లో అశ్విన్ ఓ వికెట్ తీసినా టామ్ కుర్రన్ తొలి బంతినే బౌండరీగా మలచి లాంఛనం పూర్తి చేశాడు. దీంతో 19.3 ఓవర్లలోనే రాజస్థాన్ టార్గెట్‌ను ఛేదించింది.


ఇదిలా ఉంటే ఈ గెలుపుతో ఐపీఎల్ చరిత్రలోనే భారీ స్కోరు ఛేజ్ చేసిన జట్టుగా రాజస్థాన్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు అంతర్జాతీయ టీ20 చరిత్రలో కూడా ఇదే అత్యధిక ఛేజింగ్.

Updated Date - 2020-09-28T05:02:30+05:30 IST