రాజస్థాన్ బౌలర్ల ముందు మోకరిల్లిన ఢిల్లీ

ABN , First Publish Date - 2021-04-16T02:54:33+05:30 IST

ఢిల్లీ కేపిటల్స్‌తో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం లాభించింది.

రాజస్థాన్ బౌలర్ల ముందు మోకరిల్లిన ఢిల్లీ

ముంబై: ఢిల్లీ కేపిటల్స్‌తో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం లాభించింది. కెప్టెన్ సంజు శాంసన్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. ముఖ్యంగా జయదేవ్ ఉనద్కత్ బంతితో చెలరేగిపోయాడు. ఓపెనర్లు పృథ్వీషా (2), శిఖర్ ధవన్ (9), అజింక్య రహానే (8)లను పెవిలియన్ పంపి ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ వికెట్ల పడకుండా అడ్డం పడ్డాడు. ఈ క్రమంలో అడపా దడపా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు కదిలించాడు. 32 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. దీంతో జట్టు గాడిలో పడినట్టే కనిపించింది. 


అయితే, ఆ వెంటనే అనవసర పరుగుకు ప్రయత్నించి రియాన్ పరాగ్ అద్భుత త్రోకు రనౌట్ అయ్యాడు. దీంతో మళ్లీ వికెట్ల పతనం మొదలైంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి ప్రత్యర్థి ఎదుట ఓ మాదిరి విజయలక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ ఆటగాళ్లలో కొత్త కుర్రాడు లలిత్ యాదవ్ (20), టామ్ కరన్ (21), క్రిస్ వోక్స్ (15, నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ మూడు వికెట్లు పడగొట్టగా, ముస్తాఫిజుర్ రహ్మాన్ 2, క్రిస్ మోరిస్ ఒక వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2021-04-16T02:54:33+05:30 IST