రాజస్థాన్ అనూహ్య విజయం!

ABN , First Publish Date - 2021-04-16T04:58:43+05:30 IST

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అనూహ్య విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీని రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేశారు.

రాజస్థాన్ అనూహ్య విజయం!

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అనూహ్య విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీని రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా ఉనద్కత్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. కష్టాల్లో ఉన్న ఢిల్లీకి కెప్టెన్ రిషభ్ పంత్ (32 బంతుల్లో 51) అండగా నిలబడ్డాడు. పంత్‌తోపాటు లలిత్ యాదవ్ (20), టామ్ కర్రాన్ (21), క్రిస్ వోక్స్ (15) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ 3, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2, క్రిస్ మోరిస్ ఒక వికెట్ తీసుకున్నారు.




148 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్‌ను ఢిల్లీ బౌలర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. వీరి ధాటికి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ అందరూ వచ్చినట్లే వచ్చి పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెన్లరు జోస్ బట్లర్ (2), మనన్ వోహ్రా(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ అయిపోయారు. వీరిద్దరి వికెట్లనూ క్రిస్ వోక్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (4), శివమ్ దూబే (2), రియాన్ పరాగ్ (2) కూడా నిరాశ పరిచారు. దీంతో జట్టు 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (43 బంతుల్లో 62) జట్టును ఆదుకున్నాడు. అడపాదడపా షాట్లు కొడుతూ స్కోరుబోర్డును నెమ్మదిగా ముందుకు నడిపించాడు. అతనికి రాహుల్ తెవాటియా (19) సహకారం అందించాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత రాజస్థాన్ గెలుపు ప్రశ్నార్థకంగా మారింది. అయితే చివర్లో క్రిస్ మోరిస్ 18 బంతుల్లో 4 సిక్సర్లతో 36 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. మోరిస్ విధ్వంసంతో రాజస్థాన్ జట్టు మరో రెండు బంతులు మిగిలుండగానే విజయాన్ని కైవశం చేసుకుంది.

Updated Date - 2021-04-16T04:58:43+05:30 IST