గెహ్లోత్‌ సర్కారుకు ముప్పు

ABN , First Publish Date - 2020-07-12T07:46:38+05:30 IST

రాజస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. బీజేపీ పెద్దల కనుసన్నల్లో అశోక్‌ గెహ్లోత్‌ సర్కారు మైనారిటీ దిశలో పయనిస్తోంది. తన సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని...

గెహ్లోత్‌ సర్కారుకు ముప్పు

  • రాజస్థాన్‌ రాజకీయాల్లో ప్రకంపనలు
  • బీజేపీ చెంతకు సచిన్‌ పైలట్‌, అనుచరులు?

న్యూఢిల్లీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. బీజేపీ పెద్దల కనుసన్నల్లో అశోక్‌ గెహ్లోత్‌ సర్కారు మైనారిటీ దిశలో పయనిస్తోంది. తన సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని, ఒక్కో ఎమ్మెల్యేను రూ. 15 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ మీడియా సమక్షంలో ఆవేదన వెలిబుచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే.. రాజస్థాన్‌ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. ఎన్నికలకు ముందు నుంచి సీఎం కుర్చీని ఆశించి.. అన్నీ తానై పార్టీని గెలిపించి.. కాంగ్రెస్‌ పెద్దల జోక్యంతో డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్న సచిన్‌ పైలట్‌ ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు! ముందు నుంచీ సీఎం గెహ్లోత్‌ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. శనివారం రాత్రికి రాత్రే ఆయన 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులతో కలిసి ఢిల్లీ చేరారు. అతని వెంట ఉన్న మరో 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉదయానికల్లా ఢిల్లీ చేరుతారని తెలిసింది. ఇక్కడి ఐటీసీ హోటల్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏ క్షణాన్నైనా సచిన్‌తో పాటు.. మిగతా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారమంతా కేంద్ర మంత్రి అమిత్‌ షా, బీజేపీ పెద్దల కనుసన్నల్లో జరుగుతోందని సమాచారం.


నిజానికి 200 సీట్లు ఉన్న రాజస్థాన్‌ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 101. కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా 119 మంది సభ్యులు, సీపీఎంకు చెందిన ఇద్దరు, బీటీపీకి చెందిన ఇద్దరు, ఆర్‌ఎల్‌డికి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 72 స్థానాలున్నాయి. ముగ్గురు సభ్యులున్న ఆర్‌ఎల్‌పీ మద్దతు కూడా ఆ పార్టీకి ఉంది.


ఇప్పుడు సచిన్‌ పైలట్‌ వెంటన 25 మంది ఎమ్మెల్యేలు వస్తారని అంచనా. అయినా.. బీజేపీకి మరో సీటు అవసరం ఉంటుంది. తాజాగా ఢిల్లీ శిబిరానికి వచ్చిన వారిలో ముగ్గురు స్వతంత్రులు ఉండటంతో.. బీజేపీకి మ్యాజిక్‌ ఫిగర్‌ను మించి సీట్లు ఉంటాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. సచిన్‌ పైలట్‌ సీఎంగా ఉంటారని తెలిసింది. కాగా.. బీజేపీ వ్యూహానికి ప్రతివ్యూహం రచించేందుకు కాంగ్రెస్‌ పెద్దలు రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే.. సచిన్‌ వారికి ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదని తెలిసింది. సీఎం గెహ్లోత్‌ కూడా తన నివాసంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. తమకు అనుకూలంగా ఉండే మిత్రపక్ష పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలను కూడా పిలిపించే అవకాశాలున్నాయి. 


Updated Date - 2020-07-12T07:46:38+05:30 IST