అతనికి బంగారం అంటే పిచ్చి.. రూ.20 లక్షల విలువైన నగలు ధరించి అతను చేసే పనేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-02T19:59:41+05:30 IST

అతని పేరు ఫూల్‌చంద్ సేవగ్.. వయసు 62 సంవత్సరాలు.. పశ్చిమ రాజస్థాన్‌లోని బికనీర్‌లో అతని నివాసం..

అతనికి బంగారం అంటే పిచ్చి.. రూ.20 లక్షల విలువైన నగలు ధరించి అతను చేసే పనేంటో తెలిస్తే..

అతని పేరు ఫూల్‌చంద్ సేవగ్.. వయసు 62 సంవత్సరాలు.. పశ్చిమ రాజస్థాన్‌లోని బికనీర్‌లో అతని నివాసం.. ఫూల్‌చంద్‌కు చిన్నప్పటి నుంచి బంగారు ఆభరణాలు ధరించడం అంటే చాలా ఇష్టం. పేద కుటుంబంలో పుట్టిన ఫూల్‌చంద్ ఓ పాన్ వాలా. పాన్‌షాప్ నడుపుతూ అతను తన అభిరుచులను నెరవేర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఏడాదంతా సంపాదించిన డబ్బుతో బంగారు నగలు కొనేవాడు. ఆ బంగారు నగలను ఇంట్లో దాచుకోకుండా శరీరంపై ధరించేవాడు. 


ప్రస్తుతం అతని శరీరంపై రూ.20 లక్షల విలువైన బంగారు నగలు ఉన్నాయి. ఆ నగలను ధరించి ఫూల్‌చంద్ పాన్ అమ్ముతుంటాడు. అతని ఆహార్యం స్థానికంగా చాలా ప్రాచుర్యం పొందింది. మెడలో బంగారు హారం, చెవులకు కమ్మీలు, చేతికి పెద్ద కడియం, అన్ని వేళ్లకూ ఉంగారాలు ధరించి అతను తన పాన్ షాప్‌నకు వెళ్తుంటాడు. ఆ పాన్ షాప్‌ను బికనీర్‌లో సుమారు 72 సంవత్సరాల క్రితం పూల్‌చంద్ తాత ఏర్పాటు చేశాడట. మధ్యప్రదేశ్ మాజీ మంత్రి జుదేవ్ బికనీర్ వచ్చినప్పుడల్లా ఇక్కడ పాన్ తినేవారట. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్ కూడా ఫూల్‌చంద్ పాన్‌ను రుచి చూశారట. 


ఫూల్‌చంద్ పాన్‌కు ఎంత డిమాండ్ అంటే అక్కడ చేసిన పాన్‌ను బికనీర్ వాసులు తమ బంధువులు ఇళ్లకు వెళ్లేటపుడు ప్రత్యేకంగా తీసుకెళ్తారట. ఫూల్‌చంద్‌ను చూడాలనే కారణంతో కూడా చాలా మంది పాన్ తినడానికి అక్కడకు వెళ్తారట. పాన్ తింటూ ఫూల్‌చంద్‌తో సెల్ఫీలు తీసుకుంటారు. బంగారం తనకు శుభపరిణామం అని, ఆ నగలను ధరించి ఏ పని చేసినా మంచి జరుగుతుందని ‌ఫూల్‌చంద్ చెప్పాడు.  

Updated Date - 2022-05-02T19:59:41+05:30 IST