ఇంటర్నెట్‌డెస్క్: మధ్యాహ్న భోజనానికి సమయం కావడంతో బడిగంట మోగింది. పిల్లలందరూ భోజనానికని బయటకు వెళ్లారు. తరువాతి తరగతి కోసం ప్రిపేర్ అవుతూ.. ఉపాధ్యాయురాలు అక్కడే కూర్చొని చదువుకుంటోంది. ఆమె ఒంటరిగా ఉండడం గమనించిన ఓ ఉపాధ్యాయుడు ఆ తరగతి గదిలోకి దూరాడు. అతను రాక గమనించిన ఉపాధ్యాయురాలు లేచి నిలబడింది. కానీ కాసేపయ్యాక అతడు చేసిన పనికి ఆమె ఖంగుతింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
నగరానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు చేరింది. ఆమె చేరినప్పటినుంచి అదే పాఠశాలలో పనిచేస్తున్న పప్పూరామ్ అనే సీనియర్ ఉపాధ్యాయుడు ఆమెపై కన్నేశాడు. అక్టోబర్ 4వ తేదీ మధ్యాహ్నం 12గంటల సమయంలో.. ఆమె తరగతి గదిలో ఒంటరిగా ఉండడం గమనించాడు. ఇదే అదునుగా భావించి లోపలికి వెళ్లాడు. పప్పూరామ్ రావడం గమనించిన ఆ ఉపాధ్యాయురాలు ఏంటి సార్ అని అడిగింది. నీతో మాట్లాడాలి అని అతను మాటలు కలిపాడు. కాసేపయ్యాక ఆమె చేయి పట్టుకొని అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతడి చేష్టలకు ఉపాధ్యాయురాలు షాక్‌కు గురైంది.
వెంటనే అతడినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ పప్పూరామ్ ఆమెను వదలలేదు. ఆమె అతడిని తీవ్రంగా కొట్టి.. పక్కకు తోసేసింది. వెంటనే బయటికి వెళ్లి.. జరిగిందంతా ప్రధానోపాధ్యాయుడికి చెప్పింది. ఈ సంఘటన పట్ల మిగతా ఉపాధ్యాయులు మౌనం వహించారు. విషయం బయటకు తెలిస్తే పాఠశాల మర్యాద పోతుందని భయపడ్డారు. కానీ బాధితురాలు పప్పూరామ్పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. శనివారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.