ప్రాణాలొడ్డి శిశువును కాపాడిన కానిస్టేబుల్‌కు పదోన్నతి

ABN , First Publish Date - 2022-04-05T23:34:12+05:30 IST

కరౌలీ హింసాకాండ ఘటనలో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఒక శిశువును కాపాడిన రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్‌కు..

ప్రాణాలొడ్డి శిశువును కాపాడిన కానిస్టేబుల్‌కు పదోన్నతి

జైపూర్: కరౌలీ హింసాకాండ ఘటనలో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఒక శిశువును కాపాడిన రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంటల్లో తగలబడుతున్న ఓ ఇంటి నుంచి శిశివును రెండు చేతులతో పొదివి పట్టుకుని ఇరుకు వీధుల గుండా బయటకు పరిగెడుతున్న కానిస్టేబుల్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లాట్ సైతం ఈ సాహస కానిస్టేబుల్‌ను  అభినందిస్తూ ఆయనకు పదోన్నతి కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.


కరౌలి కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు చెందిన సాహస కానిస్టేబుల్ నెట్రేష్ శర్మ ఫోటోను సీనియర్ ఎస్‌పీ మాధవ్ మిశ్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 31 ఏళ్ల శర్మ విధినిర్వహణలో చూపించిన సాహసాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఫోను చేసి మరీ అభినందించారు. ప్రతి ఒక్కరూ విధులు నిర్వహిస్తారని, అయితే విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకపోవడం ప్రశంసార్హమని అన్నారు. జైపూర్ వచ్చినప్పుడు తనను కలవాలని కూడా శర్మను సీఎం కోరారు. "ఇది నా డ్యూటీ సార్'' (పౌరులను కాపాడటం) అంటూ ఫోనులోనే ముఖ్యమంత్రికి శర్మ కృతజ్ఞతలు తెలియజేశారు.  ఆ వెనువెంటనే అతనికి హెడ్‌ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ ఇవ్వాలంటూ పోలీసు ఉన్నతాధికారులను గెహ్లాట్ ఆదేశించారు.


ఈనెల 2వ తేదీన కరౌలీలో గృహదహనాలు, విధ్వంస ఘటనలు చేటుచేసుకున్నారు. ముస్లింలు అత్యధికంగా ఉన్న ఒక ప్రాంతం గుండా శోభాయాత్ర ర్యాలీ జరుగుతుండగా కొందరు రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. ఈ హింసాకాండలో 35 మంది గాయపడ్డారు. ఇంతవరకూ 46 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హింసాకాండ సమయంలో దుకాణాలు, భవంతులకు అగంతకులు నిప్పుపెట్టడంలో ఒక ఇంట్లోని ముగ్గురు మహిళలు, ఒక శిశివు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు ఎగసిపడుతుండగా కానిస్టేబుల్ శర్మ అత్యంత సాహసంగా లోపలకు దూసుకెళ్లి, ఆ నలుగురుని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

Updated Date - 2022-04-05T23:34:12+05:30 IST