రాజస్థాన్, రాజ్యాంగ నైతికత

ABN , First Publish Date - 2020-07-29T09:18:51+05:30 IST

భారత దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం పతనం అవుతుందో, అధికారం ఎలా ఏవిధంగా చేతులు మారుతుందో చెప్పలేని పరిస్థితి...

రాజస్థాన్, రాజ్యాంగ నైతికత

రాజస్థాన్‌లో మొత్తం పరిణామాలను ఎవరు నడిపిస్తున్నారనేది ప్రధానం. ఆ నడిపించేవారికి సొంత లక్ష్యాలే ముఖ్యం. రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థల గురించి వారికి అంత పట్టింపు ఉన్నదా లేదా అన్నది చర్చనీయాంశం. మరి న్యాయస్థానాలు ఒక సవ్యమైన పద్ధతిలో తీర్పులు ఇచ్చి రాజ్యాంగానికి సరైన వ్యాఖ్యానాలు చేసి గవర్నర్లు, స్పీకర్లు, ప్రభుత్వాలు సక్రమంగా వ్యవహరించేందుకు మార్గదర్శకత్వం అందిస్తున్నాయా అన్నదీ చర్చనీయాంశమే.


భారత దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం పతనం అవుతుందో, అధికారం ఎలా ఏవిధంగా చేతులు మారుతుందో చెప్పలేని పరిస్థితి. ఫలానా రాష్ట్రంలో ఫలానా పార్టీకి ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చినందువల్ల ఆ పార్టీ అయిదేళ్లు స్థిరంగా అధికారంలో ఉంటుందని చెప్పడానికి వీలు లేదు. కళ్లు మూసి తెరిచే లోపే ఊహించని పరిణామాలు జరిగి ప్రభుత్వాలు పతనమై, కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. 2017లో నితీశ్ కుమార్ ఉన్నట్లుండి ఆర్‌జెడిని వదుల్చుకుని ఎన్డీఏతో చేతులు కలిపిన నాటి నుంచీ ఈ పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్ణాటకలో కూడా జనతాదళ్ (ఎస్), కాంగ్రెస్ ప్రభుత్వ పతనం అదే విధంగా జరిగి బిజెపి అధికారంలోకి రాగలిగింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లుండి కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయి శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్లీ సారథ్యం వహించారు. ఇప్పుడు తాజాగా రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో పడడం అనూహ్య పరిణామాలకు దారితీస్తోంది. 

ఈ పరిణామాలు ఆ నాలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. జయలలిత మరణం, శశికళ జైలుపాలైన అనంతరం తమిళనాడులో ఒక దుర్బల ప్రభుత్వం అధికారంలో ఉండడం; కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో రాత్రికి రాత్రి ప్రభుత్వాలు మారడం కూడా విస్మరించదగిన విషయం కాదు. ఒక్కో రాష్ట్రంలో ఒకో విధమైన వ్యూహం. బిహార్‌లో ప్రత్యర్థి శిబిరంలో ఉన్న ముఖ్యమంత్రినే తమకు అనుకూలంగా మార్చుకుని అక్కడ లాలూ ప్రసాద్ అధికారానికి చరమగీతం పలికితే, కర్ణాటకలో ఎమ్మెల్యేలకు ఎరవేయడం, వారిని రాజీనామా చేయించడం ముందెన్నడూ జరగని పరిణామం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జ్యోతిరాదిత్య సింధియా, ఆయన అనుయాయుల్ని తమ వైపు తిప్పుకోవడం ద్వారా కమల్ నాథ్ ప్రభుత్వాన్ని గద్దె దించారు. తాజాగా రాజస్థాన్‌లో ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌తో పాటు మరో 19 మంది ఎమ్మెల్యేలు చేసిన తిరుగుబాటు వెనుక బిజెపి హస్తం లేదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ద్వారా బిజెపి పావులు కదుపుతున్న తీరు రాజస్థాన్‌లో కొత్త రీతిలో సంక్షోభాన్ని సృష్టించేందుకు సిద్ధమైందన్న విషయం స్పష్టమవుతోంది. 

నిజానికి రాజస్థాన్‌లో ప్రభుత్వం పడిపోయే అవకాశాలే లేవని నిన్న మొన్నటి వరకూ చాలా మంది భావించారు. అక్కడ 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో బిజెపికి కేవలం 73 సీట్లు మాత్రమే ఉన్నందువల్ల ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వారు భావించారు. అయితే ఒక ప్రభుత్వం సంక్షోభంలో పడడానికి కానీ, లేదా అధికారం చేతులు మారడానికి కానీ మెజారిటీ, మైనారిటీ అనే అంశాలతో సంబంధం లేకపోవడం 2014 తర్వాత జరిగిన కీలక పరిణామం అని చెప్పక తప్పదు. గతంలో ప్రజాస్వామ్యమంటే సంఖ్యాబలమే అని భావించేవారు, ఇవాళ ప్రజాస్వామ్యానికి సంఖ్యాబలంతో సంబంధం లేదు. సంఖ్యాబలం ఉన్నవారు ప్రజాస్వామికంగా వ్యవహరించనవసరం లేదు. అదే విధంగా సంఖ్యాబలం లేని వారు ప్రజాస్వామ్యబద్ధంగా అధికారాన్ని స్వాధీనపరుచుకోవాలన్న నిబంధన కూడా లేదు. గతంలో అసెంబ్లీలను రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించి అధికారాన్ని చేజిక్కించుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. కనుక దేశంలో ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వమూ తమ జోలికి ఎవరూ రారని, తాము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని భావించడానికి వీలు లేదు.

విచిత్రమేమంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి శాసనసభను సమావేశపరచాలని భావిస్తారు. కాని రాజస్థాన్ గవర్నర్ అందుకు వెంటనే సిద్ధపడరు. అసలు మీ ఎజెండా ఏమిటి? ఎందుకోసం సభ నిర్వహించాలనుకుంటున్నారు? సభ నిర్వహించేందుకు 21 రోజుల నోటీసు అవసరం లేదా? మీరు సభలో విశ్వాస పరీక్ష నిర్వహించాలనుకున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. గవర్నర్‌కు ఈ ప్రశ్నలు వేసే అధికారం లేదని, రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి సలహా ప్రకారం వ్యవహరించడం తప్ప ఆయనకు వేరే మార్గం లేదని ముఖ్యమంత్రి వాదిస్తారు. అసెంబ్లీ ఎజెండా ఏమిటో ప్రభుత్వం, సభా వ్యవహారాల కమిటీ నిర్ణయించాలని కాని గవర్నర్‌కు ఏమిటి పని? అని కాంగ్రెస్ హయాంలో న్యాయమంత్రులుగా పనిచేసిన వారు ప్రశ్నిస్తున్నారు. కాని ఈ అభిప్రాయం పూర్తిగా తిరుగులేనిది కాదని వాదించేవారు కూడా లేకపోలేదు. గవర్నర్‌లు ఉన్నది దేనికి? వారు కేవలం ఉత్సవ విగ్రహాలుగా జరుగుతున్నది చూస్తూ ఊరుకోవాలా? ఉన్నట్లుండి సభను ప్రోరోగ్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయిస్తే గవర్నర్ మారు మాట్లాడకుండా ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేయాలా? మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా స్వతంత్రంగా పరిస్థితులను గమనించి ఒక రాజ్యాంగ సంస్థగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌పై లేదా? ఒక వైపు స్పీకర్ వద్ద సభ్యుల అనర్హత పిటిషన్ పరిశీలనలో ఉన్నది. 19 మంది ఎమ్మెల్యేలు అసమ్మతిని ప్రకటించి ఒక రిసార్ట్‌లో తలదాచుకున్నారు. ఈ రెండు పరిణామాల ప్రకారం ప్రభుత్వం మైనారిటీలో పడిందని, ఈ పరిస్థితులను విస్మరించి గవర్నర్ డూడూ బసవన్నలా ఎలా వ్యవహరిస్తారు అని వాదించే న్యాయనిపుణులూ ఉన్నారు. 

బొమ్మై తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నట్టు గవర్నర్ ప్రభుత్వ స్థిరత్వం గురించి ఆలోచించాల్సి ఉంటుందని అందువల్ల ఆయనకు ఆచితూచి నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నదని చెప్పేవారు కూడా లేకపోలేదు. కాని ఇక్కడ కాంగ్రెస్ వాదన సరైనదా, స్పీకర్‌ను సమర్థిస్తున్న వారి వాదన సరైనదా అన్నది ప్రధానం కాదు. రాజ్యాంగం గవర్నర్‌కు విచక్షణాధికారాలను ఇచ్చిందా, సభను సమావేశపరచడంలో ఆయన అధికారాలేమిటి? ఆర్టికల్ 174 ప్రకారం శాసన సభను సమావేశపరిచే అధికారం గవర్నర్‌దే కావచ్చు. కాని ఆర్టికల్ 163 మంత్రిమండలి సలహా ప్రకారం నడుచుకోవాలని చెబుతోంది. ఆర్టికల్ 163 (1) గవర్నర్‌కు కొన్ని పరిమిత అధికారాలను మాత్రమే ఇచ్చింది. అయితే రాజ్యాంగం కూడా ఇక్కడ ప్రధానం కాదు. రాజ్యాంగ నిబంధనలను అన్వయించడంలో తేడాలు ఉండడాన్ని కూడా పెద్దగా పట్టించుకోనక్కరలేదు. మొత్తం పరిణామాలను ఎవరు నడిపిస్తున్నారనేది ప్రధానం. ఆ నడిపించేవారికి సొంత లక్ష్యాలే ముఖ్యం కాని రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థల గురించి అంత పట్టింపు ఉన్నదా లేదా అన్నది చర్చనీయాంశం.  మరి న్యాయస్థానాలు ఒక సవ్యమైన పద్ధతిలో తీర్పులు ఇచ్చి రాజ్యాంగానికి సరైన వ్యాఖ్యానాలు చేసి గవర్నర్లు, స్పీకర్లు, ప్రభుత్వాలు సక్రమంగా వ్యవహరించేందుకు మార్గదర్శకత్వం అందిస్తున్నాయా అన్నది కూడా చర్చనీయాంశం. 

గవర్నర్ సభను సమావేశపరచడంలో మంత్రివర్గ అభ్యర్థనను తిరస్కరించకూడదని సుప్రీంకోర్టు 2016లో ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీల కేసుల్లో స్పష్టంగా చెప్పింది. కాని రాజస్థాన్‌లో గవర్నర్ అసెంబ్లీ సమావేశపరచడాన్ని తిరస్కరించకుండానే ప్రశ్నలు లేవనెత్తారు. మరో వైపు స్పీకర్ విషయంలో కూడా గతంలో కోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. 1992లో సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన ఒక తీర్పులో పదవ షెడ్యూలుకు రాజ్యాంగబద్ధత ఉన్నదని, స్పీకర్ రూలింగ్‌కు ముందు కోర్టులు జోక్యం చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేసింది. కాని విచిత్రమేమంటే రాజస్థాన్ హైకోర్టు స్పీకర్ రూలింగ్ ప్రకటించకముందే దానిపై స్టే విధించారు. పైగా సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా పదవ షెడ్యూలు రాజ్యాంగబద్ధతను ప్రశ్నించడంతో పాటు 13 ప్రశ్నల్ని సంధించింది. ఇది ఒక ఎత్తు అయితే తన తీర్పును ప్రశ్నించిన హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించడం మరో ఎత్తు. ‘ప్రజాస్వామ్యంలో అసమ్మతి స్వరాన్ని తొక్కిపెట్టలేం.. అసలు ఈ విధంగా అసమ్మతి క్రమం ఆమోదయోగ్యమా కాదా అని మేము పరిశీలిస్తున్నాం.. ఒక సభ్యుడిని అనర్హుడుగా ప్రకటిస్తే కోర్టులు జోక్యం చేసుకోకూడదా?’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించేసరికి కాంగ్రెస్ న్యాయవాదులు ఖంగుతిన్నారు. ‘ఇదేమిటి స్పీకర్ రూలింగ్‌పై స్టే విధించడంపై రాజ్యాంగబద్ధతను ప్రశ్నించాలని వస్తే డామిట్ కథ అడ్డం తిరిగినట్లుంది..’ అని భావించి మళ్లీ కోర్టు విచారణ వచ్చే నాటికి కేసునే ఉపసంహరించుకున్నారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు, స్పీకర్ అధికారాలు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఇప్పుడేవీ ప్రధానం కాదని కోర్టులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని విశ్లేషించగలవని కాంగ్రెస్ న్యాయనిపుణులకు ఆలస్యంగా అర్థమైంది.

అయినా, రాజ్యాంగబద్ధత, వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, రాజ్యాంగ సంస్థల అధికారాలు, న్యాయస్థానాల స్వతంత్రత గురించి ఎంత తక్కువ చర్చిస్తే అంత మంచిది. సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైన తమ పాత్ర పోషించడం లేదని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించినందుకు సుప్రీంకోర్టు ఆయనపై కోర్టు ధిక్కారం క్రింద నోటీసులు జారీ చేసింది. దీన్ని మాజీ న్యాయమూర్తులు జస్టిస్ లోకూర్, జస్టిస్ ఏపి షాతో పాటు దేశంలోని 131 మంది ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు. న్యాయ వ్యవస్థ ప్రయోజనాల రీత్యా సుప్రీంకోర్టు ప్రతిష్టను కాపాడేందుకు ఈ ధిక్కార నోటీసుపై పునఃపరిశీలన జరపాలని వారు కోరారు. అంతేకాదు గత కొద్ది రోజులుగా సుప్రీంకోర్టు ప్రభుత్వ అత్యాచారాలపై, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలపై రాజ్యాంగపరంగా తమకు సంక్రమించిన పాత్రను కూడా విస్మరించిందని వారు విమర్శించారు. వలసకూలీల సంక్షోభం విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం ప్రదర్శించిన విముఖతకూడా తీవ్రంగా ప్రజల్లో చర్చనీయాంశమైందని వారు స్పష్టం చేశారు.

నిజానికి ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యల్నే ఈ ప్రముఖులు కూడా చేశారు. ప్రజాస్వామ్య విధ్వంసంలో సుప్రీంకోర్టు పాత్రను, ప్రధానంగా గత నలుగురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పాత్రను పరిశీలించాలని ఆయన చేసిన వ్యాఖ్యల సారాన్ని వారు తమ లేఖలో వ్యక్తీకరించారు. సుప్రీంకోర్టును లాక్‌డౌన్‌లో ఉంచి తాను మాత్రం బిజెపి ఎమ్మెల్యేకు చెందిన ఒక ఖరీదైన బైక్‌పై మాస్క్, హెల్మెట్ లేకుండా విహరించడమేమిటని ప్రశాంత్ భూషణ్ ప్రధాన న్యాయమూర్తిని ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు యథాప్రకారం భౌతికంగా కోర్టు సమావేశాలను నిర్వహించకపోవడం పట్ల ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ దేశంలో పోలీసులు, వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, మునిసిపాలిటీ సిబ్బందితో పాటు లక్షలాది మంది ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాత్రం కేవలం కొన్ని ఎంపిక చేసిన కేసుల్నే విచారించడం పట్ల విమర్శలు తలెత్తడంలో ఆశ్చర్యం లేదు. కానీ ప్రశ్నలకు, ఆందోళనలకు ప్రతిస్పందించకపోవడం నేటి వ్యవస్థల ప్రత్యేకత.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-07-29T09:18:51+05:30 IST