జైపూర్: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) లోకేష్ శర్మ చిక్కుల్లో పడ్డారు. ఆయన చేసిన ట్వీట్ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం కావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గెహ్లాట్‌కు పంపారు. రాజీనామా అంగీకరించినా, తిరస్కరించినా తనకు సమ్మతేనంటూ ఆ లేఖలో తెలియజేశారు.
''బలమైన వాళ్లను నిస్సహాయులను చేసి మామాలు వ్యక్తులను ప్రముఖులను చేస్తే...కంచే చేనును మేసినట్టు అవుతుంది. అప్పుడు పంటను కాపాడేదెవరు'' అని లోకేష్ శర్మ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ బలవంతం వల్లే ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాకు దారి తీసేందనే అభిప్రాయానికి ఆయన ట్వీట్ తావిచ్చింది. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ఆయన సూటిగా ప్రశ్నించినట్టయింది. ఈ ట్వీట్ ఢిల్లీ వర్గాల్లో వైరల్ కావడంతో ఆయన తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి గెహ్లాట్‌కు పంపారు. తాను చేసిన ట్వీట్‌కు శర్మ క్షమాపణ చెప్పారు. దాదాపు ప్రతిరోజూ తాను ట్వీట్లు చేస్తుంటానని, తన ట్వీట్ పార్టీని కానీ, ప్రభుత్వాన్ని కానీ, అధిష్టానం మనోభావాలను కానీ గాయపరిచి ఉంటే క్షమాపణ చెబుతున్నానని, ఎవరినీ కించపరచే ఉద్దేశం తనకు లేదని రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.