రాజస్థాన్‌.. కాస్కో

ABN , First Publish Date - 2022-05-26T10:34:35+05:30 IST

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. ఫైనల్‌ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బోల్తా పడింది.

రాజస్థాన్‌.. కాస్కో

ఎలిమినేటర్‌లో బెంగళూరు విజయం

పటీదార్‌ అజేయ శతకం

లఖ్‌నవూ నిష్క్రమణ


అదృష్టం కొద్దీ ప్లేఆఫ్స్‌కు చేరిన బెంగళూరు కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. రజత్‌ పటీదార్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో కెరీర్‌లో తొలి శతకం బాదగా.. ఆఖర్లో దినేశ్‌ కార్తీక్‌ సహకరించాడు. దీంతో లఖ్‌నవూకు 208 పరుగుల భారీ ఛేదన ఎదురైంది. కానీ కెప్టెన్‌ రాహుల్‌, దీపక్‌ హుడా మినహా మరెవరూ రాణించకపోవడంతో పరాజయం తప్పలేదు


కోల్‌కతా: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. ఫైనల్‌ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బోల్తా పడింది. దీంతో 14 పరుగుల తేడాతో నెగ్గిన డుప్లెసీ సేన రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు సిద్ధమైంది. శుక్రవారం అహ్మదాబాద్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో గుజరాత్‌తో తలపడుతుంది. బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. రజత్‌ పటీదార్‌ (54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 112 నాటౌట్‌) అజేయ శతకం బాదగా దినేశ్‌ కార్తీక్‌ (23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 37 నాటౌట్‌) చివర్లో వేగంగా ఆడాడు. ఆ తర్వాత ఛేదనలో లఖ్‌నవూ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసి ఓడింది. రాహుల్‌ (58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 79), హుడా (26 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 45) మాత్రమే రాణించారు. హాజెల్‌వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పటీదార్‌ నిలిచాడు.


రాహుల్‌ పోరాటం: 208 పరుగుల భారీ ఛేదన కళ్లముందుండగా లఖ్‌నవూ తొలి ఓవర్‌లోనే డికాక్‌ (6) వికెట్‌ను కోల్పోయింది. కానీ రాహుల్‌, హుడా జోడీ విజయంపై ఆశలు రేపింది. అయితే కీలక సమయాల్లో వికెట్లు తీసిన ఆర్‌సీబీ బౌలర్లదే పైచేయిగా మారింది. ఉన్న కాసేపు మనన్‌ వోహ్రా (19) కాస్త వేగం కనబర్చాడు. అటు ఆరో ఓవర్‌లో రాహుల్‌ చెలరేగి 4,6,6 బాదడంతో పవర్‌ప్లేలో 62/2 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. అయితే 7-13 ఓవర్ల మధ్య రెండు బౌండరీలు మాత్రమే రావడం జట్టు ఛేదనపై ప్రభావం చూపింది. హుడా క్యాచ్‌ను పదో ఓవర్‌లో డీప్‌ పాయింట్‌ దగ్గర హసరంగ పట్టేసినా.. శరీరం అదుపు తప్పి లైన్‌ను తాకుతుందని ముందుకు విసిరేయడంతో బతికిపోయాడు. అటు 15వ ఓవర్‌లో హుడా రెండు సిక్సర్లతో అదరగొట్టినా అదే ఓవర్‌లో హసరంగ బౌల్డ్‌ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 61 బంతుల్లోనే 96 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. 18 బంతుల్లో 41 పరుగులు రావాల్సిన దశలో ఇరు జట్లకు సమాన అవకాశం కనిపించింది. అయితే 18వ ఓవర్‌లో స్టొయినిస్‌ (9)ను అవుట్‌ చేసిన హర్షల్‌ 8 పరుగులే ఇచ్చి ఒత్తిడి పెంచాడు. తర్వాతి ఓవర్‌లో రాహుల్‌, క్రునాల్‌ (0)లను హాజెల్‌వుడ్‌ అవుట్‌ చేయడంతో లఖ్‌నవూకు చేసేదేమీ లేకపోయింది. 


పటీదార్‌ దంచుడు: బెంగళూరు ఇన్నింగ్స్‌లో రజత్‌ పటీదార్‌ కళ్లు చెదిరే ఆటతీరుతో అదరగొట్టాడు. తొలి ఓవర్‌లోనే కెప్టెన్‌ డుప్లెసీ (0) వికెట్‌ కోల్పోయి.. మధ్య ఓవర్లలో కాస్త పరుగులు తగ్గినా, అతడితో పాటు దినేశ్‌ కార్తీక్‌ చెలరేగడంతో ఆర్‌సీబీ చివరి 5 ఓవర్లలో ఏకంగా 84 పరుగులు సాధించడం విశేషం. దీనికితోడు లఖ్‌నవూ ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా వీరికి కలిసివచ్చింది. ఆరో ఓవర్‌లో రజత్‌ వరుసగా 4,4,6,4తో చెలరేగి 20 రన్స్‌ రాబట్టాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 52 పరుగులు సాధించింది. ఆ తర్వాత పరుగుల జోరు తగ్గగా, స్వల్ప వ్యవధిలో ఆర్‌సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. ఆచితూచి ఆడిన కోహ్లీని తొమ్మిదో ఓవర్‌లో అవేశ్‌ ఖాన్‌ అవుట్‌ చేయగా రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ప్రతీ బాల్‌ను బాదాలనే ప్రయత్నంలో కనిపించిన మ్యాక్స్‌వెల్‌ (9)కు 11వ ఓవర్‌లో స్పిన్నర్‌ క్రునాల్‌ షాకిచ్చాడు. ఈ వ్యవధిలో పటీదార్‌ మాత్రం 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. లొమ్రోర్‌ (14) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా.. దినేశ్‌ కార్తీక్‌ ఇచ్చిన క్యాచ్‌ను 15వ ఓవర్‌లో రాహుల్‌ పట్టలేకపోయాడు. ఇక బిష్ణోయ్‌ వేసిన 16వ ఓవర్‌లో పటీదార్‌ 6,4,6,4,6తో 27 రన్స్‌ రాబట్టడంతో అమాంతం స్కోరు 150కి చేరింది. అదే ఓవర్‌లో రజత్‌ క్యాచ్‌ను హుడా వదిలేయడం లఖ్‌నవూను తీవ్రంగా నష్టపరిచింది. అప్పటికి స్కోరు 130/5 మాత్రమే. అటు కార్తీక్‌ కూడా 17వ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదాడు. మిడ్‌ వికెట్‌లో సంధించిన సూపర్‌ సిక్సర్‌తో పటీదార్‌ 48 బంతుల్లోనే లీగ్‌లో తొలి శతకం పూర్తి చేశాడు. 19వ ఓవర్‌లో డీకే 6,4 పటీదార్‌ 6,4తో 21 రన్స్‌ వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో మరో 13 రన్స్‌ రాబట్టిన ఆర్‌సీబీ 200 స్కోరు దాటగలిగింది.

 

స్కోరుబోర్డు

బెంగళూరు: కోహ్లీ (సి) మొహిసిన్‌ (బి) అవేశ్‌ 25, డుప్లెసీ (సి) డికాక్‌ (బి) మొహిసిన్‌ 0, రజత్‌ పటీదార్‌ (నాటౌట్‌) 112, మ్యాక్స్‌వెల్‌ (సి) లూయిస్‌ (బి) క్రునాల్‌ 9, లొమ్రోర్‌ (సి) రాహుల్‌ (బి) బిష్ణోయ్‌ 14, కార్తీక్‌ (నాటౌట్‌) 37, ఎక్స్‌ట్రాలు 10, మొత్తం: 20 ఓవర్లలో 207/4;

వికెట్లపతనం: 1-4, 2-70, 3-86, 4-115; బౌలింగ్‌: మొహిసిన్‌ 4-0-25-1, చమీర 4-0-54-0, క్రునాల్‌ 4-0-39-1, అవేశ్‌ ఖాన్‌ 4-0-44-1, రవి బిష్ణోయ్‌ 4-0-45-1.


లఖ్‌నవూ: డికాక్‌ (సి) డుప్లెసీ (బి) సిరాజ్‌ 6, రాహుల్‌ (సి) షాబాజ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 79, వోహ్రా (సి) షాబాజ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 19, దీపక్‌ హూడా (బి) హసరంగ 45, స్టొయినిస్‌ (సి) పటీదార్‌ (బి) హర్షల్‌ 9, లూయిస్‌ (నాటౌట్‌) 2, క్రునాల్‌ (సి) అండ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 0, చమీర (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు 22,

మొత్తం: 20 ఓవర్లలో 193/6, వికెట్లపతనం: 1-8, 2-41, 3-137, 4-173, 5-180, 6-180; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-41-1, హాజెల్‌వుడ్‌ 4-0-43-3, షాబాజ్‌ 4-0-35-0, హసరంగ 4-0-42-1, హర్షల్‌ పటేల్‌ 4-0-25-1.

Updated Date - 2022-05-26T10:34:35+05:30 IST