చెలరేగిన పంజాబ్.. రాజస్థాన్ ఎదుట కొండంత లక్ష్యం

ABN , First Publish Date - 2020-09-28T02:47:41+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విశ్వరూపం

చెలరేగిన పంజాబ్.. రాజస్థాన్ ఎదుట కొండంత లక్ష్యం

షార్జా: ఐపీఎల్‌లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విశ్వరూపం ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగులు చేసి ప్రత్యర్థి ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. 


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఆది నుంచే దూకుడు మొదలుపెట్టింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌ ఇద్దరూ పోటీలుపడి ఆడారు. సిక్సర్లు, ఫోర్లతో జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో అగర్వాల్ అర్ధ సెంచరీ తర్వాత మరింతగా చెలరేగాడు. మరోవైపు, రాహుల్ అతడికి అండగా ఉంటూ సంపూర్ణ సహకారం అందించాడు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు రాజస్థాన్ బౌలర్లు చెమటోడ్చినా ఫలితం లేకపోయింది. 


చివరికి 183 పరుగులు వద్ద మయాంక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తం 50 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే లోకేశ్ రాహుల్‌ను రాజ్‌పూత్ పెవిలియన్‌కు పంపాడు. 54 బంతులు ఆడిన రాహుల్ 7 ఫోర్లు, సిక్సర్‌తో 69 పరుగులు చేశాడు.


చివర్లో నికోలస్ పూరన్ మెరుపులు మెరిపించి జట్టు స్కోరును 200 దాటించాడు. 8 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌ సాయంతో 25 పరుగులు చేయగా, మ్యాక్స్‌వెల్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేయడంతో పంజాబ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగుల చేసింది. రాజస్థాన్ బౌలర్లలో కరన్, రాజ్‌పూత్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2020-09-28T02:47:41+05:30 IST