Petrol and Diesel Price : కేంద్రం పిలుపుతో వ్యాట్ తగ్గించిన కేరళ, రాజస్థాన్

ABN , First Publish Date - 2022-05-22T20:57:19+05:30 IST

పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రజలకు

Petrol and Diesel Price : కేంద్రం పిలుపుతో వ్యాట్ తగ్గించిన కేరళ, రాజస్థాన్

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రజలకు దాదాపు ఆరు వారాల తర్వాత కాస్త ఉపశమనం లభించింది. కేంద్రం ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించి, వ్యాట్‌ను తగ్గించాలని రాష్ట్రాలకు పిలుపునివ్వడంతో కేరళ, రాజస్థాన్ ప్రభుత్వాలు స్పందించాయి. వీటిపై వ్యాట్‌ను కొంత మేరకు  తగ్గించి ప్రజలకు ప్రయోజనం అందజేశాయి. 


పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గిస్తున్నామని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి సామాన్యులకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) శనివారం చెప్పిన సంగతి తెలిసిందే. పెట్రోలుపై ఎక్సయిజ్ సుంకాన్ని లీటరుకు రూ.8 చొప్పున, డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని లీటరుకు రూ.6 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు., రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం వల్ల ఇంధనం ధరలు పెరుగుతున్నాయని, ఆ ధరలకు కళ్ళెం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించాలని నిర్ణయించిందని చెప్పారు.  పెట్రోలియం ఉత్పత్తులపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT)ని తగ్గించి, సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 2021 నవంబరులో కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినప్పటికీ సామాన్య ప్రజలకు ఆ మేరకు ఉపశమనం కల్పించని రాష్ట్రాలు కూడా ఈసారి ఈ ప్రయోజనాన్ని ప్రజలకు అందజేయాలని కోరారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఒక్కొక్క వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.200 రాయితీని ప్రకటించారు. సంవత్సరంలో గరిష్ఠంగా 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ పథకం లబ్ధిదారులు దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మంది ఉన్నారు. 


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, పెట్రోలు, డీజిల్‌లపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT)ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. లీటరు పెట్రోలుపై వ్యాట్‌ను రూ.2.48 చొప్పున, లీటరు డీజిల్‌పై వ్యాట్‌ను రూ.1.16 చొప్పున తగ్గించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వీటిపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.10.48 తగ్గుతుందని, లీటరు డీజిల్‌ ధర రూ.7.16 చొప్పున తగ్గుతుందని తెలిపారు. 


అదేవిధంగా కేరళ ప్రభుత్వం కూడా పెట్రోలు, డీజిల్‌లపై వ్యాట్‌ను తగ్గించింది. లీటరు పెట్రోలుపై వ్యాట్‌ను రూ.2.41 చొప్పున, లీటరు డీజిల్‌పై వ్యాట్‌ను రూ.1.36 చొప్పున తగ్గించినట్లు తెలిపింది. 


ప్రధాన నగరాల్లో ఆదివారం లీటరు పెట్రోలు, లీటరు డీజిల్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి. 


లీటరు పెట్రోలు  ధర ముంబైలో రూ.111.33; కోల్‌కతాలో రూ.106.01; చెన్నైలో రూ.102.62; బెంగళూరులో రూ.101.92 కాగా, లీటరు డీజిల్ ధర ముంబైలో రూ.97.26; కోల్‌కతాలో రూ.92.74; చెన్నైలో రూ.94.22; బెంగళూరులో రూ.90.03.


లీటరు పెట్రోలు ధర శనివారం కన్నా ఆదివారం న్యూఢిల్లీలో సుమారు రూ.8 తగ్గింది. కోల్‌కతాలో సుమారు రూ.9 తగ్గింది. ముంబైలో సుమారు రూ.9 తగ్గింది. చెన్నైలో సుమారు రూ.8 తగ్గింది. హైదరాబాద్‌లో సుమారు రూ.10 తగ్గింది. 


లీటరు డీజిల్ ధర శనివారం కన్నా ఆదివారం న్యూఢిల్లీలో దాదాపు రూ.7 తగ్గింది. కోల్‌కతాలో దాదాపు రూ.7 తగ్గింది. ముంబైలో సుమారు రూ.7 తగ్గింది. చెన్నైలో దాదాపు రూ.6 తగ్గింది. హైదరాబాద్‌లో సుమారు రూ.7 తగ్గింది. 


Updated Date - 2022-05-22T20:57:19+05:30 IST