రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

ABN , First Publish Date - 2022-08-16T06:24:15+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శ్రావణ సోమవారం సందర్భంగా భక్తజనంతో పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
స్వామివారి దర్శనం కోసం బారులుదీరిన భక్తులు

వేములవాడ, ఆగస్టు 15 :  వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శ్రావణ సోమవారం సందర్భంగా భక్తజనంతో పోటెత్తింది.  వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు తమ ఇష్టదైవమైన  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.  స్వామివారికి  ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు.  స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో నిలువెత్తు బెల్లం పంచిపెట్టారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో కోడెమొక్కుల క్యూలైన్‌ ఆలయ గుడి చెరువు పార్కింగ్‌ స్థలం వరకు సాగింది. కోడెమొక్కు చెల్లింపు కోసం కనీసం మూడు గంటల సమయం పట్టింది. స్వామివారి దర్శనం కోసం రెండు నుంచి మూడు గంటలకు పైగా సమయం అవసరమైంది. ఆకాశం మేఘావృత్తమై రోజంతా ముసురు కొనసాగడంతో భక్తులు  ఇబ్బంది పడ్డారు.  ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు 35 వేల మంది భక్తులు సోమవారం రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారని, ఆలయ ఖజానాకు సుమారు 30 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. 

గర్భాలయంలో అభిషేక పూజలు ప్రారంభం

వేములవాడ  రాజరాజేశ్వర క్షేత్రంలో గర్భాలయంలో నిర్వహించే రుద్రాభిషేకం ఆర్జిత సేవకు సామాన్య భక్తులను సుమారు నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అనుమతించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న కారణంగా  నాలుగేళ్లుగా సోమ, శుక్ర, ఆదివారాలు గర్భాలయంలో రుద్రాభిషేకం పూజకు సామాన్య భక్తులను అనుమతించడం లేదు. వరంగల్‌కు చెందిన ఓ విద్యా సంస్థ అధినేతను మాత్రం క్రమం తప్పకుండా ప్రతీ సోమవారం సకల లాంఛనాలతో గర్భాలయంలో రుద్రాభిషేక పూజకు అనుమతిస్తూ, సామాన్య భక్తులను అనుమతించని వైనంపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించడంతో స్పందించిన ఆలయ అధికారులు ఇకపై ప్రతీ సోమ, శుక్ర, ఆదివారాల్లో గర్భాలయంలో అభిషేక పూజకు సామాన్య భక్తులను అనుమతిస్తామని ప్రకటించిన విషయం తెలిసింది. దీంతో తొలిసారిగా సోమవారం ఉదయం రుద్రాభిషేకం టిక్కెట్లు జారీ చేశారు. సోమవారం 121 టిక్కెట్లు జారీ చేశామని, భక్తులు రుద్రాభిషేకం పూజలో పాల్గొన్నారనిఅధికారులు తెలిపారు. 

Updated Date - 2022-08-16T06:24:15+05:30 IST