రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం

ABN , First Publish Date - 2022-01-18T05:37:46+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగామారింది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న తరుణంలో కొద్ది వారాలుగా భారీ సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు.

రాజన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
స్వామివారి దర్శనం కోసం బారులుదీరిన భక్తులు

వేములవాడ, జనవరి 17 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగామారింది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న తరుణంలో  కొద్ది వారాలుగా భారీ సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు.  సోమవారం వివిధ ప్రాంతాల నుంచి సుమారు 25 వేల మందికి పైగా భక్తులు  తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వేలాది మంది భక్తులు  స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు  స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. సోమవారం సందర్భంగా గర్భాలయంలోకి ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు.  దేవస్థానానికి అనుబంధంగా ఉన్న  బద్దిపోచమ్మ ఆలయం, భీమేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారాయి.  భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం మొక్కు చెల్లించుకున్నారు.  భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-01-18T05:37:46+05:30 IST