అబ్బురమన్పించే.. క్రీడాప్రస్థానం

ABN , First Publish Date - 2021-08-15T05:29:28+05:30 IST

ఒలింపిక్‌ పతకం కోసం..

అబ్బురమన్పించే.. క్రీడాప్రస్థానం
గోల్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రజని

కుగ్రామం నుంచి టోక్యో దాకా.....

భారత మహిళా హాకీ జట్టు గోల్‌కీపర్‌ రజని క్రీడాప్రస్థానం అబ్బురం


పీలేరు(చిత్తూరు): ‘‘ఒలింపిక్స్‌లో ‘కాంస్య’ పతకం సాధించి ఉంటే కొంతకాలం గుర్తుపెట్టుకునే వాళ్లేమో. కానీ ఆ పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో మా జట్టు సభ్యులందరూ ప్రాణాలొడ్డి పోరాడిన తీరుకు ప్రపంచవ్యాప్తంగా అశేష ఆదరణ లభించింది. ప్రధాని మోదీ కూడా అభినందించారు. ఈ ఆదరణ భవిష్యత్తులో మహిళల హాకీ పురోగమనానికి తోడ్పడుతుందని విశ్వసిస్తున్నా’’ అని అంటున్నారు భారత మహిళా హాకీ జట్టు సభ్యురాలు రజని. జట్టులో ఏకైక తెలుగు అమ్మాయి అయిన రజని ఒలింపిక్స్‌లో ఆడలేకపోయినప్పటికీ సభ్యులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించేందుకు తోడ్పడింది. కుగ్రామంలో పుట్టి పెరిగిన అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆమె క్రీడా ప్రస్థానం గురించి ఆమె మాటల్లోనే ..


పాఠశాలలోనే క్రీడా జీవితానికి బీజం...

ఎర్రావారిపాళెం మండలంలోని నెరబైలు పంచాయతీ పరిధిలో వున్న యనమలవారిపల్లెకు చెందిన వడ్రంగి యతిమరుపు రమణాచారి ముగ్గురు పిల్లల్లో నేను పెద్దదాన్ని. ఊరికి దగ్గర్లో ఉన్న పచ్చార్ల గ్రామంలో ప్రాథమిక విద్య తరువాత నెరబైలు హైస్కూల్లో చేరా. మొదట్నించీ క్రీడలంటే చాలా ఆసక్తి. దాన్ని నెరబైలు హైస్కూలు ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించారు. హాకీ పట్ల ఆకర్షితురాలై సీరియస్‌గా తీసుకుని ప్రాక్టీస్‌ చేశా. మా హైస్కూలు తరపున జోనల్‌ పోటీల్లో పాల్గొనే హాకీ జట్టుకు మా పీఈటీ వెంకటరాజ నన్ను ఎంపిక చేశారు. ఆ పోటీల్లో రాణించడంతో రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ(శాప్‌) 2005లో తిరుపతిలో నిర్వహించిన కోచింగ్‌ క్యాంప్‌కు పంపించారు.


అకాడమీలో మూడున్నరేళ్ల శిక్షణ సమయంలో కోచ్‌లు ప్రసన్నకుమార్‌రెడ్డి, ఇస్మాయిల్‌, మురళి, షంషాద్‌బేగం ఎంతగానో ప్రోత్సహించారు. రాష్ట్ర, అంతర్రాష్ట్ర , జాతీయ క్రీడా పోటీల్లో సత్తా చూపించా. 2009లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరచడంతో సీనియర్స్‌ జట్టులో చోటు లభించింది. అంచెలంచెల విజయాలతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దొరికింది. అయితే దీని వెనుక నేను, నా కుటుంబం పడిన ఇబ్బందులెన్నో. హాకీకి పెద్దగా జనాదరణ లేదు. తగిన ప్రోత్సాహంకానీ, క్రీడాకారుల నైపుణ్యాన్ని పెంచే సౌకర్యాలుకానీ లేవు. అదంతా ఒక ఎత్తయితే, ఈ ఆట ఆడడానికి ధరించే కురచ దుస్తుల గురించి మా బంధువులూ, గ్రామస్తులూ విడ్డూరంగా మాట్లాడుకునేవారు.


‘అమ్మాయిలకు అనుకూలంగా ఉండే తేలికపాటి ఆటలు ఆడుకోకుండా మగరాయుడిలా హాకీ ఎందుకు?’ అని ప్రశ్నించేవాళ్లు. శిక్షణకూ, టోర్నమెంట్లకూ వెళుతుండడంతో తరగతులకు తరచూ గైర్హాజరయ్యేదాన్ని. దీంతో చదువులో వెనకబడ్డా. అయినా గుండె దిటవు చేసుకుని భరించా. మా అమ్మానాన్న ఈ పరిస్థితుల్ని నిబ్బరంతో ఎదుర్కొన్నారు. నాకు అండగా నిలబడ్డారు. తాహతుకు మించి అప్పులు చేసి మరీ శిక్షణ కోసం క్యాంపులకు పంపించేవారు. నేను జాతీయ, అంతర్జాతీయ జట్లకు ఎంపికైన తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అలా విజయవంతంగా సాగిపోతున్న నా కెరీర్‌కు 2014వ సంవత్సరంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా జాతీయ జట్టులో చోటు దక్కలేదు.


వరుసగా ఐదు టోర్నమెంట్లకు నేను సెలెక్ట్‌ కాలేదు. ఆటకూ, జట్టుకూ దూరమైపోయా. గాయాల నుంచి కోలుకుంటున్న దశలో అనేకసార్లు భావోద్వేగాలతో సతమతమయ్యా. మరో వైపు జట్టులో చోటు కోసం పోటీ విపరీతంగా ఉంది. ఫిట్‌నెస్‌ సాధించాలి. జట్టులో మళ్లీ స్థానం సంపాదించాలి. అదే సంకల్పంతో ఏడాదికి పైగా కృషి చేశా. 36యేళ్ల తరువాత 2016లో ఒలింపిక్స్‌కు భారతజట్టు క్వాలిఫై అయింది. ఆ జట్టుకు నేను ఎంపికయ్యా. 30ఏళ్ల నా జీవితంలో ఇలాంటి అగ్ని పరీక్షలు చాలానే ఉన్నాయి. 


ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించాలన్నదే లక్ష్యం !

2016 రియో ఒలింపిక్స్‌లోనూ, ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లోనూ మెడల్‌ సాధించాలన్నదే మా జట్టు లక్ష్యం. 2016లో అనుభవం లేకపోవడంతో గొప్పగా ఆడలేకపోయాం. ఈ నాలుగు సంవత్సరాల్లో ఆటతీరు మెరుగుపరుచుకున్నాం. దాని వలన టోక్యో ఒలింపిక్స్‌లో మంచి పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాం కానీ మెడల్స్‌ సాధించలేకపోయాం.అయినప్పటికీ ఒలింపిక్స్‌లో మొదటిసారిగా మహిళా హాకీ జట్టు నాల్గవస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించడం గర్వంగా ఉంది. టోక్యో అనుభవాలతో దృష్టంతా ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌ పైనే పెడుతున్నాం. కామన్వెల్త్‌ ఏషియన్‌ గేమ్స్‌లో సత్తా చాటేందుకు ఫిట్‌నెస్‌ లెవల్స్‌ మరింత మెరుగుపరుచుకుంటాం. వరల్డ్‌కప్‌ టోర్నమెంటులో విజయం సాధించడమే మా ముందున్న లక్ష్యం. 


కెరీర్‌ ముగిశాక అకాడమీ.. 

నా క్రీడాజీవితం ముగిశాక అకాడమీ ప్రారంభించి అమ్మాయిలను క్రీడలవైపు ప్రోత్సహిస్తా. రాష్ట్రవ్యాప్తంగా హాకీని అభివృద్ధి చేసేందుకు దోహదపడతా. ఇటీవల క్రీడాకారుల ఎదుగుదలకు ప్రభుత్వపరంగా మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఆర్థికంగా క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తే ఇంకా విశ్వాసం పెరుగుతుంది. 

Updated Date - 2021-08-15T05:29:28+05:30 IST