రాజంపేటను జిల్లాగా ప్రకటించాలి: టీడీపీ

ABN , First Publish Date - 2022-01-27T02:18:32+05:30 IST

రాజంపేటను కొత్త జిల్లాగా ప్రకటించాలని టీడీపీ నాయకులు

రాజంపేటను జిల్లాగా ప్రకటించాలి: టీడీపీ

కడప: రాజంపేటను కొత్త జిల్లాగా ప్రకటించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాగా రాయచోటిని కేంద్రంగా ప్రకటించడంతో తాళ్ళపాకలోని అన్నమయ్య విగ్రహం దగ్గర టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుధాకర్, తెదేపా పార్లమెంట్ అధికార ప్రతినిధి ప్రతాప్ రాజు, పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించకుండా రాయచోటిని ప్రకటించడంపై రాజంపేట ప్రజలు భగ్గుమంటున్నారని వారు పేర్కొన్నారు. 


రాజంపేట మండలం కొత్త బోయినపల్లె 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు కట్టుకొని టీడీపీ నేతలు నిరసన తెలిపారు. అన్నమయ్య నడయాడిన జన్మస్థలం రాజంపేటను కాదని రాయచోటి జిల్లాగా ప్రకటించడంపై నిరసన తెలిపారు. రాజంపేట ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, ఎంపీ నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారికి తాము అండగా ఉంటామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 



కడప జిల్లాలోని రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాజంపేట, కోడూరు. రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలను ఈ జిల్లాలో కలిపారు. మదనపల్లె, రాజంపేట, రాయచోటి( కొత్త) అనే మూడు రెవెన్యూ డివిజన్లను చేర్చారు. దాదాపు 32 మండలాలు ఈ జిల్లాలో ఉన్నాయి. 

Updated Date - 2022-01-27T02:18:32+05:30 IST