రాజంపేట ఎమ్మెల్యే ఇంటి సమీపంలో అనుమానితులు

ABN , First Publish Date - 2020-09-25T11:16:33+05:30 IST

రాజంపేట ఎమ్మెల్యే అతిథిగృహం సమీపంలో బైపాసు రోడ్డు వద్ద పలువురు అనుమానిత వ్యక్తులు పెట్రోలింగ్‌ పోలీసులకు

రాజంపేట ఎమ్మెల్యే ఇంటి సమీపంలో అనుమానితులు

అనుమతి లేని రివాల్వర్‌తో పాటు బుల్లెట్లు దొరికాయని ప్రచారం 

కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


రాజంపేట, సెప్టెంబరు 24 : రాజంపేట ఎమ్మెల్యే అతిథిగృహం సమీపంలో బైపాసు రోడ్డు వద్ద పలువురు అనుమానిత వ్యక్తులు పెట్రోలింగ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద రివాల్వర్‌తో పాటు బుల్లెట్లు దొరికాయని ప్రచారం జరగడంతో రాజంపేటలో కలకలం రేగింది. వివరాలు ఇలా..


రాజంపేట పట్ణణంలోని బోయనపల్లె వద్ద బైపాస్‌రోడ్డుకు ఆనుకుని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అతిథి గృహం ఉంది. దీనికి సమీపంలో బుధవారం అర్ధరాత్రి 8 మంది అనుమానిత వ్యక్తులు కూర్చొని ఉండగా పెట్రోలింగ్‌ పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ముగ్గురు పరారుకాగా ఐదుగురు పట్టుబడ్డారు. వారిలో ఓ వ్యక్తి వద్ద అనుమతి లేని రివాల్వర్‌, ఐదు బుల్లెట్లు ఉన్నట్లు తెలిసింది. వీరిని విచారించిన పోలీసులు గురువారం తెల్లవారుజామున స్థానికంగా ఎర్రబల్లిలోని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తి గతంలో ఢిల్లీలో కొంతకాలం ఉన్నాడని, ఆ సమయంలో పలువురు నాయకులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయని తెలిసింది. అతను పలువురు నాయకులతో కలిసి ఉన్న ఫొటోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


దీనిపై రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి మాట్లాడుతూ పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులకు, ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. బైపాసు రోడ్డులో ఎమ్మెల్యే అతిథి గృహం సమీపంలో వీరున్నందున ఆ విషయం కలకలం రేగిందన్నారు. పూర్తిస్థాయి విచారణ చేసిన తరువాత విషయాలు వెల్లడిస్తామని తెలిపారు.


అయితే పట్టణంలో ఈ అనుమానితులపై అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఎమ్మెల్యే కోసం వచ్చారని ఒకసారి, లేదు.. లేదు.. ఉస్మాన్‌నగర్‌లో ఓ బిల్డర్‌కోసం వచ్చారని ఒకసారి, వీరికి ఎర్రచందనం నిందితులతో సంబంధం ఉందని ఒకసారి... ఇలా రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి.

Updated Date - 2020-09-25T11:16:33+05:30 IST