Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 30 Nov 2021 22:08:49 IST

అది గొప్ప జ్ఞాపకంగా ఉండేది: ఉద్వేగభరితమైన ఎస్. ఎస్. రాజమౌళి

twitter-iconwatsapp-iconfb-icon
అది గొప్ప జ్ఞాపకంగా ఉండేది: ఉద్వేగభరితమైన ఎస్. ఎస్. రాజమౌళి

‘‘1996లో మేము అర్థాంగి అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్ను తట్టి ముందుకు నడిపించినవి ‘‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులు కోవద్దురా ఓరిమి’’ అన్న సీతారామశాస్త్రిగారి పదాలు.. భయం వేసినప్పుడల్లా గుర్తు తెచ్చుకుని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. 


అప్పటికి నాకు శాస్త్రిగారితో పరిచయం చాలా తక్కువ. మద్రాసులో డిసెంబర్ 31వ తారీకు రాత్రి 10 గంటలకి ఆయన ఇంటికి వెళ్లాను. ‘ఏం కావాలి నందీ’ అని అడిగారు. ఒక కొత్త నోట్ బుక్ ఆయన చేతుల్లో పెట్టి మీ చేతుల్తో ఆ పాట రాసివ్వమని అడిగాను. రాసి, ఆయన సంతకం చేసి ఇచ్చారు. జనవరి 1న మా నాన్నిగారికి గిఫ్ట్‌గా ఇచ్చాను. నాన్నగారి కళ్ళల్లో ఆనందం, మాటల్లో కొత్తగా ఎగదన్నుకొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మరిచిపోలేను.


సింహాద్రిలో ‘అమ్మయినా నాన్నయినా, లేకుంటే ఎవరైనా’ పాట.. మర్యాద రామన్నలో ‘పరుగుల్ తియ్’ పాట, ఆయనకి చాలా ఇష్టం. అమ్మనాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవటం చాలా గొప్ప అని కానీ ఎలా రాస్తాము నంది అని తిట్టి, మళ్లీ ఆయనే.. ‘‘ఐ లైక్ దీజ్ ఛాలెంజెస్’’ అంటూ మొదలు పెట్టారు. కలిసినప్పుడల్లా ప్రతీ లైన్ నెమరువేసుకుంటూ, అర్థాన్ని మళ్లీ విపులీకరించి చెప్తూ, ఆయన స్టైల్‌లో గది దద్ధరిల్లేలా నవ్వుతూ, పక్కనే ఉంటే వీపుని గట్టిగా చరుస్తూ ఆనందించేవారు. 


ఆర్ఆర్ఆర్‌లో దోస్తీ మ్యూజిక్ వీడియోకి లిరిక్ పేపర్‌లో ఆయన సంతకం చేసే షాట్ తీద్ధామని చాలా ప్రయత్నించాము. కానీ అప్పటికే ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. అది గొప్ప జ్ఞాపకంగా ఉండేది. 


నా జీవన గమనానికి దిశా నిర్ధేశం చేసిన సీతారామశాస్త్రిగారి కలానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. -రాజమౌళి’’ అంటూ ట్విట్టర్ వేదికగా రాజమౌళి ఉద్వేగభరితమయ్యారు.

‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం నివాళి

‘‘మిత్రమా’’ అని నోరారా పిలిచే కంఠం మూగబోయింది. 

‘‘దోస్తీ’’ పాటను మాకిచ్చిన చేయి ఇక కలం పట్టనంది

ఊహించని చేదు నిజం గుండెను పిండేసినా

ఆ కవనాలతో ఊపిరి పోసుకున్న

పాటల తోడులోని తీపిని హృదయాలలో

ధరిస్తూ, స్మరిస్తూ, తరిస్తూ.. 

ఈ అశ్రునివాళి- ఆర్ఆర్ఆర్ చిత్రబృందం


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement