గుడ్‌మార్నింగా! శుభోదయమా!!

ABN , First Publish Date - 2020-09-28T11:34:41+05:30 IST

వైసీపీలో వర్గ పోరు మళ్లీ ముదిరింది..

గుడ్‌మార్నింగా! శుభోదయమా!!

రాజమహేంద్రవరం వైసీపీలో ఆధిపత్య పోరు

ఎంపీ భరత్‌ వర్సెస్‌ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం, జక్కంపూడి రాజా

మరోసారి బయటపడ్డ భేదాభిప్రాయాలు


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): వైసీపీలో వర్గ పోరు మళ్లీ ముదిరింది. రాజమహేంద్రవరంలో గుడ్‌ మార్నింగ్‌ పేరుతో ఒకరు శుభోదయం పేరుతో మరొకరు జనం మధ్యకు వెళ్తున్నారు. ఆధిపత్యం కోసం  వర్గాలుగా చీలిపోయి ప్రతీ కార్యక్రమాన్నీ రచ్చకీడుస్తున్నారు. రాజమహేంద్రవరంలో సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఒక వర్గంగా ఉండగా... ఎంపీ మార్గాని భరత్‌ మరో వర్గం నడుపుతున్నారు. శ్రీఘాకోళ్లకు శివరామసుబ్రహ్మణ్యం ‘గుడ్‌ మార్నింగ్‌ రాజమహేంద్రవరం’ పేరిట డివిజన్ల వారీగా ప్రజల వద్దకు వెళుతున్నారు. దీనికి పోటీగా ఎంపీ భరత్‌ వర్గం ‘శుభోదయం-ప్రజల వద్దకు వైసీపీ’ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు 13వ డివిజన్‌లోని షెల్టాన్‌ హోటల్‌ సమీపంలోని దానవాయిబాబు గుడి వద్ద ‘గుడ్‌ మార్నింగ్‌ రాజమహేంద్రవరం’ నిర్వహించతలపెట్టారు.


దీనికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణులను ఆహ్వానించారు. అదే సమయంలో 31వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం, మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో  ఉదయం ఆరు గంటలకు ‘శుభోదయం ప్రజల వద్దకు వైసీపీ’ ఏర్పాటుచేసి డిప్యూటీ సీఎంను, మంత్రిని ఆహ్వానించారు. ఎవరు ముందు మంత్రులను ఆహ్వానించారో గానీ వారు హాజరవుతున్నట్టు మీడియాకు వాట్సాప్‌ ద్వారా సమాచారం పంపారు. వాస్తవానికి మంత్రులిద్దరూ ఇందులో పాల్గొనవలసి ఉంది. అయితే రెండు కార్యక్రమాలూ ఇంచుమించు ఒకే సమయంలో కావడంతో పాటు వారికి ఇక్కడి వర్గ విబేధాలు అర్థమైనట్టు ఉన్నాయి. డిప్యూటీ సీఎం అంతర్వేది నుంచి ఇలా రాకుండానే వెళ్లిపోయారు.


మంత్రి చెల్లుబోయిన వేణు ఆదివారం సాయంత్రం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శ్రీఘాకోళపు సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. అక్కడ ఏమి జరిగిందో కానీ, అనంతరం సుబ్రహ్మణ్యం వర్గం 13వ డివిజన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రకటించింది. మంత్రి వేణు కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని, రెండు కార్యక్రమాలకూ రాలేనని చెప్పినట్టు సమాచారం. దీంతో 31వ డివిజన్‌లో ఎంపీ మార్గాని భరత్‌ తలపెట్టిన ‘శుభోదయం’ కూడా వాయిదా వేసినట్టు ఆ వర్గం ప్రకటించింది. దీంతో రెండు గ్రూపుల మధ్య భేదాభిప్రాయాలు మరోసారి బయటపడ్డాయి. 


రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యాన్ని సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడంతో పెత్తనం మొదలెట్టారు. ఆయనకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మద్దతు ఉంది. రాజాకు సిటీలో ఓ వర్గం ఉండడమే కాకుండా ఆయన నివాసం కూడా ఇక్కడే. కానీ ఇక్కడ ఎమ్మెల్యే లేకపోవడంతో ఎంపీ మార్గాని భరత్‌ కూడా పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో రెండు వర్గాల పొత్తు కుదరట్లేదు. ఎవరి కార్యక్రమాలు వారివయ్యాయి. అధిష్ఠానం గతంలో ఒకసారి బుజ్జగించి పంపింది. కానీ ఇంతవరకూ గుట్టుగానే ఉన్న విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. అంతేగాక అభివృద్ధి పనులు, అధికారిక కార్యక్రమాల్లో ఇరువర్గాల నుంచి ఒత్తిడి రావడంతో అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. 

Updated Date - 2020-09-28T11:34:41+05:30 IST