చరిత్రహీనుడు రాజగోపాల్‌

ABN , First Publish Date - 2022-08-06T09:07:45+05:30 IST

మునుగోడు ఎమ్మెల్యే, త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

చరిత్రహీనుడు రాజగోపాల్‌

  • కాంగ్రెస్‌ పార్టీని మోసగించిన నయవంచకుడు
  • సోనియాను ఈడీ వేధిస్తుంటే షా పక్కన చేరాడు
  • ఆయనను మునుగోడు గడ్డపై పాతిపెట్టాలి
  • అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తే
  • కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తానని చెప్పాల్సింది
  • రూ.21 వేల కోట్ల కాంట్రాక్టు కోసం.. 
  • 90 వేల ఓటర ల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాడు
  • 2014కు ముందు నాపై ఒక్క కేసూ లేదు
  • కేసీఆర్‌పై పోరాడి నేను నెల జైల్లో ఉంటే..
  • హత్యకేసులో షా 90 రోజులు జైల్లో ఉన్నారు
  • ఆయన పెట్టే గడ్డి తీయగా ఉందా?
  • చండూరు సభలో రాజగోపాల్‌పై రేవంత్‌ ధ్వజం

నల్లగొండ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఎమ్మెల్యే, త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీచుడు, దుర్మార్గుడు, కమీనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి నయవంచన చేసిన రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డపై పాతిపెట్టాలని, వచ్చే ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభనుద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ‘‘తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మను ఈడీ అధికారులు వేధిస్తూ అవమానిస్తుంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు, దేశం మొత్తం కదం తొక్కుతుంటే కలిసిరాని నీచుడు, దుర్మార్గుడు, కాంట్రాక్టర్‌, కమీనే, కుత్తేగాడు అయిన రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షా పక్కన చేరి రూ.21 వేల కోట్ల కాంట్రాక్టులకు మునుగోడు నియోజకవర్గంలోని 90 వేల మంది ఓటర్ల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు’’ అని ధ్వజమెత్తారు. నిజాం నవాబులను ఎదిరించి రజాకార్ల ముఠాలను తరిమికొట్టిన చరిత్ర ఈ ప్రాంత ప్రజలకు ఉందని, ఇక్కడ ఎగిరితే ఎర్ర జెండా.. లేదంటే కాంగ్రెస్‌ జెండా ఎగిరిందని అన్నారు. అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటే కమ్యూనిస్టు జెండా ఎగిరి ఉండేదా? అని ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇస్తే ఆమె ఇంటింటికీ తిరిగి ఆయనను గెలిపించారని గుర్తు చేశారు.  చరిత్రహీనుడైన రాజగోపాల్‌రెడ్డి నమ్మిన నాయకత్వాన్ని నయవంచన చేసి అమిత్‌షా పక్కన చేరాడని దుయ్యబట్టారు. 


నేను 30 రోజులు జైల్లో ఉంటే.. అమిత్‌షా 90 రోజులున్నారు..

జైలుకి పోయినోడి కింద తాను పనిచేయలేక పోతున్నానని రాజగోపాల్‌రెడ్డి అంటున్నారని, కానీ.. 2014కు ముందు తనపై ఒక్క కేసు కూడా లేదని రేవంత్‌ తెలిపారు. ఆ తరువాత కేసీఆర్‌పై, ఆయన కుటుంబ పాలనపై పోరాడుతుండడంతో తనపై 120 కేసులు పెట్టారని అన్నారు. కానీ, తాను 30 రోజులు జైల్లో ఉంటే అమిత్‌షా గుజరాత్‌లో హత్యలకు పాల్పడి 90 రోజులు జైలులో ఉన్నారని అన్నారు. ‘‘అమిత్‌షా పెట్టిన గడ్డి నీకు తియ్యగుందా? కేసీఆర్‌పై పోరాటం చేసే నా పక్కన ఉంటే నీకు ఇబ్బంది కలిగిందా? నాయకులు నచ్చకపోతే మునుగోడు ఓటర్లు ఏం పాపం చేశారు?’’అని రేవంత్‌ ప్రశ్నించారు. తనను, ఉత్తమ్‌ను, భట్టి విక్రమార్కను సైతం రాజగోపాల్‌రెడ్డి తిట్టినా ఊరుకున్నానని, కానీ.. కుక్కతోక ఎంతో రాజగోపాల్‌రెడ్డి కూడా అంతేనని వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్‌రెడ్డి చెప్పడం నిజమైతే మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్పాల్సిందన్నారు. కానీ, కాంట్రాక్టుల కోసం అమిత్‌షాకు ఆయన అమ్ముడుపోయారని ఆరోపించారు. నల్లగొండ జిల్లా అభివృద్ధిపై ఆయనకు ప్రేమ ఉంటే ప్రధాని మోదీని, అమిత్‌షాను అడిగి కేంద్రం నుంచి రూ.5 వేల కోట్ల ప్యాకేజీ తీసుకొచ్చి ఉప ఎన్నికలో నామినేషన్‌ వేయాలని సవాల్‌ చేశారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీని, నాగార్జునసాగర్‌, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే ఆ నియోజకవర్గాల్లో ఏం అభివృద్ధి జరిగిందని, ఏం మార్పు వచ్చిందని ప్రశ్నించారు. తాను హైదరాబాద్‌ నుంచి వస్తుంటే తన కారుపై టమాటాలు, గుడ్లు వేయాలని రాజగోపాల్‌రెడ్డి కొందరికి డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. తనపై గుడ్లు, టమాటాలు వేస్తే రాజగోపాల్‌ ఇంటిపై పెండ పడుతుందని, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన ఇంటి దర్వాజాలు, కిటీకీలు కూడా ఊడపీకుతారని హెచ్చరించారు. ఇలా కాంట్రాక్టుల కోసం పార్టీ ఫిరాయిస్తే ప్రజాసేవకు ఇక ఎవరూ ముందుకురారని, ఈ విషయంపై కాంగ్రెస్‌, కమ్యూనిస్టు అభిమానులు ఆలోచించాలని కోరారు.


అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్‌ను గెలిపించాలి..

కాంగ్రెస్‌ అభ్యర్థిగా అధినాయకత్వం ఎవరిని నిలబెట్టినా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్టీని వీడి వెళ్లిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రజల విశ్వాసాన్ని రాజగోపాల్‌రెడ్డి వమ్ము చేశారన్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తే మునుగోడు అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ కంచుకోట అని, రాజగోపాల్‌రెడ్డి పోతే పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. మతోన్మాద పార్టీ అయిన బీజేపీ వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని, నిత్యావసర ధరలు పెరిగాయని ఆరోపించారు. కాగా, కోమటిరెడ్డి బ్రాండ్‌ కాదని, అందరికీ కాంగ్రెస్‌ పార్టీయే బ్రాండ్‌ అని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.


 ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమిత్‌ షాను ఎందుకు కలిశారని ప్రశ్నించారు. రాజగోపాల్‌రెడ్డిని ఏనాడో సస్పెండ్‌ చేయాల్సిందని, గతంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఎన్నోసార్లు నోరు పారేసుకున్నారని తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పదవులు ఎలా వచ్చాయో ఆలోచించుకోవాలన్నారు. సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి పునర్‌ వైభవం వచ్చేలా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కొంతమంది తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హామీలను తుంగలో తొక్కిన టీఆర్‌ఎ్‌సకు, ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీకి తగిన బుద్ది చెప్పాలన్నారు. కాగా, రేవంత్‌రెడ్డి చండూరు సభకు వెళ్లే క్రమంలో చౌటుప్పల్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. భారీ కాన్వాయ్‌తో వెళ్లిన రేవంత్‌.. మధ్యలో ఆందోళ్‌ మైసమ్మ ఆలయం వద్ద ఆగి పూజలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి చెరుకు సుధాకర్‌తో కలిసి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్‌కు స్థానిక కార్యకర్తలు స్వాగతం పలికారు. 


కాంగ్రెస్‌ సభకు భారీ స్పందన

మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్‌ నిర్వహించిన సభకు భారీ స్పందన లభించింది. అంచనాలకు మించి జనం, పార్టీ శ్రేణులు కదలివచ్చారు. వర్షాలు భారీగా పడుతుండడం, ప్రజలు పొలం పనుల్లో బిజీగా ఉండడంతో సభకు ఏ మేరకు వస్తారోనన్న సంశయం ఉన్నా.. సాయంత్రం 4గంటలకే సభాస్థలి నిండిపోయింది. భారీ సంఖ్యలో హాజరైన జనం.. జోరుగా వర్షం కురుస్తున్నా కదలకుండా రేవంత్‌ ప్రసంగాన్ని వింటూ నిలబడిపోయారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రేవంత్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నాయకులు రెండు రోజుల వ్యవధిలోనే సభ నిర్వహించాలని నిర్ణయించడం, సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 12 సార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. స్థానికంగా కిందిస్థాయిలో కాంగ్రె్‌సకు బలమైన క్యాడర్‌ ఉంది. దీంతో సభ విజయవంతం కాకుండా రాజగోపాల్‌రెడ్డి అనుచరులు అనేక ప్రయత్నాలు చేశారు. గురువారం రాత్రి నుంచి విందులు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల నుంచి సభకు జనం వెళ్లకుండా చూడాలని కాంగ్రెస్‌ నేతలకు సూచనలు చేశారు. కానీ, అవేవీ ఫలించలేదు. జనం పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్‌ నేతలకు ఉత్సాహాన్నిచ్చారు. ఈ సభలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌, డీసీసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, చెవిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-06T09:07:45+05:30 IST