దుష్ట పాలన నుంచి విముక్తి కలగాలి

ABN , First Publish Date - 2021-10-18T05:14:59+05:30 IST

దుష్ట పరిపాలన నుంచి రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి కలగాలని దేవుడ్ని వేడుకున్నామని రాజధాని రైతులు, మహిళలు తెలిపారు.

దుష్ట పాలన నుంచి విముక్తి కలగాలి
నెక్కల్లులో పోలేరమ్మకు పొంగళ్ళు తీసుకొస్తున్న రైతులు,మహిళలు

670వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు

తుళ్లూరు, అక్టోబరు 17: దుష్ట పరిపాలన నుంచి  రాష్ట్రానికి, ప్రజలకు విముక్తి కలగాలని దేవుడ్ని వేడుకున్నామని రాజధాని రైతులు, మహిళలు తెలిపారు. ఆదివారం నెక్కల్లు గ్రామంలో పోలేరమ్మ తల్లికి పొంగళ్లు సమర్పించి, అమరావతిని కాపాడాలని వేడుకున్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం ఆదివారంతో 670వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ మూడు ముక్కల ఆట వైసీపీ నాయకుల సొంత ప్రయోజనాల కోసమేనని తెలిపారు. ఐదేళ్ల నుంచి అమరావతి రాజధానిగా పాలన జరుగుతుంటే కాదని ప్రస్తుత పాలకులు మూడు ముక్కలు చేయడానికి అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడి పాలన చేయకపోవటం వల్లే సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానాలు పలు మార్లు మొట్టికాయలు వేశాయన్నారు.    రాజ్యాంగం పరిధిలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పని చేస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవన్నారు. నియంత పాలన సాగుతుండటంతో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటున్నాయన్నారు. మూడు రాజధానులు అనేది రాజ్యాంగంలోనే లేదన్నారు. తుళ్లూరు పెదపరిమి, రాయపూడి, దొండపాడు, బోరుపాలెం, అనంతవరం, నెక్కల్లు, మందడం, వెలగపూడి, ఐనవోలు, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో రైతులు, ఇళ్ల వద్ద మహిళలు దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. 



  

Updated Date - 2021-10-18T05:14:59+05:30 IST