తప్పుడు కేసులకు భయపడేది లేదు

ABN , First Publish Date - 2021-07-27T05:10:45+05:30 IST

శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అయినా భయపడేది లేదని రాజధాని రైతులు తేల్చిచెప్పారు.

తప్పుడు కేసులకు భయపడేది లేదు
పెదపరిమిలో దీపాలు వెలిగించి నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు

587వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, జూలై 26: శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అయినా భయపడేది లేదని రాజధాని రైతులు తేల్చిచెప్పారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం సోమవారంతో 587వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధానిలో అక్రమాలు చేస్తున్న వారిపై చర్య తీసుకోవాల్సిన పోలీసులు అమరావతి కోసం దీక్షలు చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ఎలాగైన నాశనం చేయాలనే తలంపుతో సీఎం జగన్‌రెడ్డి ఉన్నారన్నారు. వైసీపీ అక్రమార్కులు రోడ్లను తవ్వేస్తున్నారంటే ముమ్మాటికి సీఎం జగన్‌రెడ్డే కారణమని దళిత జేఏసీ సభ్యులు తెలిపారు. అధికార మదంతో పట్టపగలు గ్రావెల్‌, కంకర, ఇసుక చోరీ చేస్తుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారని దళిత జేఏసీ నాయకుడు గడ్డం మార్టిన్‌ ఆరోపించారు.  ఎంపీ, ఎమ్మెల్యేల అండతో ఇప్పటికే అనేక నిర్మాణాలలోని ఐరన్‌ను దొంగలించుకెళ్లారన్నారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానులన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తే ఐదు కోట్ల మంది ప్రజలు సంతోషిస్తారని, కాని అది జగన్‌కు ఇష్టం లేదన్నారు. ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా పంచిపెట్టడం కాదు.. ప్రజా జీవితానికి భరోసా ఇచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలని డిమాండ్‌ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు దీపాలు వెలిగించి నిరసనలు తెలిపారు. 



 

Updated Date - 2021-07-27T05:10:45+05:30 IST