అమరావతిని కాపాడుకుంటాం

ABN , First Publish Date - 2021-07-25T05:20:32+05:30 IST

అమరావతిని కాపాడుకోవటానికి ఐదు కోట్ల మంది ప్రజలు నడుంబిగించాలని, భూములు త్యాగంచేసిన రైతులు విజ్ఞప్తి చేశారు.

అమరావతిని కాపాడుకుంటాం
తుళ్లూరులో దీపాలు వెలిగించి నినాదాలు చేస్తున్న మహిళలు

అన్నదాత రోడ్డునపడేసిన ఘనత సీఎం జగన్‌దే

మూడు రాజధానుల ప్రతిపాదన రాజకీయాల కోసమే

585వ రోజుకు చేరుకున్న రైతులు, మహిళల ఆందోళనలు 


తుళ్లూరు, జూలై 24: అమరావతిని కాపాడుకోవటానికి ఐదు కోట్ల మంది ప్రజలు నడుంబిగించాలని,  భూములు త్యాగంచేసిన రైతులు విజ్ఞప్తి చేశారు. లేదంటే భారీగా నష్టపోతామని  వారు స్పష్టంచేశారు. రాష్ట్ర ఏకైక రాజఽధానిగా అమరావతి కొనసాగాలని రైతులు  చేస్తున్న ఉద్యమం శనివారంతో 585వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా శిబిరాల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలు, దళిత జేఏసీ నాయకులు మాట్లాడుతూ,  రైతులను రోడ్డున పడేసిన ఽఘనత సీఎం జగన్‌రెడ్డిదేనన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి అని గొప్పగా చెప్పుకుంటున్న  మనం,  సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి మోసపూరిత  చర్యలతో కేరాఫ్‌ అడ్రస్సు లేకుండా పోయామన్నారు. ఒక రాజధాని అంటే గొప్పగా ఉంటుందా.. లేక పలు రాజధానులు అంటే ఎలా గుంటుందని  ప్రశ్నించారు.  దేశంలో అన్నీ రాష్ట్రాలకు ఒక్కటే రాజధాని ఉందని స్పష్టంచేశారు. రెండు మూడు రాష్ట్రాలకు కలిపి ఒక రాజధానిని కూడా మన దేశంలో చూస్తున్నామన్నారు.  ఏపీ చిన్న రాష్ట్రం,  రాజధాని అమరావతి సాగతిస్తున్నామని చెప్పిన జగన్‌రెడ్డి,  స్వార్థ ప్రయోజనాల కోసం మూడు అంటూ ముడేశారన్నారు. అందుకే రాష్ట్ర భవిషత్తు అంధకారంలోకి వెళ్లిందన్నారు. అమరావతిని కాదని మూడు రాజధానుల ప్రకటనతో  అందరికీ చులకనయ్యామని స్పష్టం చేశారు.  కులం, మతం, వర్గం అనే కుమ్ములాటలో ప్రస్తుత పాలకులు ఉన్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే రాజధాని అమరావతిని కాదని మూడు రాజధానులంటున్నారని వారు పేర్కొన్నారు. మూడు రాజధానులతో ప్రయోజనం ఏమిటో ఎవరూ చెప్పలేని  పరిస్థితి నెలకొందన్నారు. అదే అమరావతి ఏకైక రాజధానిగా ఉంటే  ఎన్ని ప్రయోజనాలో గత ప్రభుత్వంలో చూశామన్నారు. ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసి కొనసాగించాలన్నారు. పెదపరిమి, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, వెలగపూడి, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, మందడం, బోరుపాలెం, ఐనవోలు, దొండపాడు, తదిర రాజధాని గ్రామాల్లో అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు ఆందోళనలు కొనసాగించారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. 

Updated Date - 2021-07-25T05:20:32+05:30 IST