తుళ్లూరు శిబిరంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు
యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
దానిని నిర్వీర్యం చేస్తారా?
767వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు
తుళ్లూరు, జనవరి22: ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నిలయంగా మారే రాజధాని అమరావతిని సీఎం జగన్‌రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 217 చదరపు కిలోమీటర్లతో, రాష్ట్ర ఆర్థికవనరుగా ఉండే అమరావతి నగర నిర్మాణం జరుగుతుంటే పాలకులు జీర్ణించుకో లేకపోతున్నారని అన్నారు. అందుకే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం శనివారం 767వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ రాజధాని రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టటమే పాలకుల అజెండాగా కనిపిస్తుందన్నారు. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం రాజధాని అమరావతి నగరం అభివృద్ధి చెందాలన్నారు. ప్రజారాజధాని అమరావతి కోసం ఓ పక్క ప్రజా పోరాటం చేస్తూ, మరోవైపు న్యాయం పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై.. అమరావతి అంటూ నినాదాలు చేశారు.