Jagan Sarkarకు ఎదురుదెబ్బ.. వాట్ నెక్స్ట్..!

ABN , First Publish Date - 2022-01-13T06:03:21+05:30 IST

Jagan Sarkar కు ఎదురుదెబ్బ.. వాట్ నెక్స్ట్..!

Jagan Sarkarకు ఎదురుదెబ్బ.. వాట్ నెక్స్ట్..!

  • 19 గ్రామాల్లో వ్యతిరేకంగా తీర్మానాలు
  • ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలు
  • 29 గ్రామాల అమరావతి స్మార్ట్‌ సిటీ కావాలని డిమాండ్‌ 

తుళ్లూరు, జనవరి 12: ఏసీసీఎంసీ (అమరావతి కేపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌) ఏర్పాటుకు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని 29 గ్రామాల్లో 19 గ్రామాలను కలిపి ఏసీసీఎంసీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహించింది. ఈ నెల 5న 19 గ్రామాల్లో ప్రారంభమైన గ్రామసభులు బుధవారంతో ముగిశాయి. 19 గ్రామాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశారు. ఆ మేరకు అధికారుల చేత రికార్డుల్లో కూడా నమోదు చేయించారు. రాయపూడి, తుళ్లూరు గ్రామాలలో బుధవారం గ్రామసభలను అధికారులు నిర్వహించారు. ఆయా గ్రామసభల్లో ఏకపక్షంగా ఏసీసీఎంసీని వ్యతిరేకిస్తున్నామని అధికారులకు తెలిపారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం 29 గ్రామాలలో జరుగుతుందనే భూములు ఇచ్చామని, 19 గ్రామాలతో అయితే అంగీకరించమని తెలిపారు. ప్రభుత్వం మారగానే పాలకులు అమరావతిని నాశనం చేసేందుకు వివిధ కుట్రలు చేస్తున్నారన్నారు. 29 గ్రామాలలో అమరావతి కేపిటల్‌ సీటి గా అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధానిలో ఎన్నికలు జరపాలని కోర్టుకు వెళ్లినట్లు రాయపూడి గ్రామ సభలో మాజీ ఎంపీపీ హరేందర్‌నాథ్‌చౌదరి తెలిపారు.


అమరావతి మెగా సిటీ నిర్మించాలి 

ల్యాండు పూలింగ్‌కి భూములు ఇచ్చింది 29 రాజధాని గ్రామాలు కలిపి అమరావతి మెగా సిటీ నిర్మాణం కోసం. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతి అభివృద్ధి జరిగితే రాష్ట్రానికి ప్రయోజనం. రాజధానిని ముక్కలు చేయడానికే ఏసీసీఎంసీ ప్రతిపాదన. అందుకే వ్యతిరేకిస్తున్నాం. - మూల్పూరి శ్రీనివాసరావు, రాయపూడి 


రెండున్నరేళ్లుగా అభివృద్ధి లేదు

రాజధాని అమరావతిలో రెండున్నరేళళ్లగా అభివృద్ధి లేదు. ఇప్పుడు అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ని గందరగోళం చేసి ఏసీసీఎంసీని ఏర్పాటు చేయడానకి కుట్ర చేస్తున్నారు. అమరావతిని నిర్వీర్యం చేసే ఏ నిర్ణయాన్ని అయినా వ్యతిరేకిస్తాం. అభివృద్ధి చేస్తామంటే స్వాగతిస్తాం. - కంభంపాటి శిరీష, అమరావతి దళిత జేఏసీ


కుట్రతోనే అమరావతి నిర్వీర్యం

అమరావతిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఏసీసీఎంసీ ప్రతిపాదన. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతి అభివృద్ధి కొనసాగితే రాష్ట్ర భవిష్యత్‌ బాగుంటుంది. 29 గ్రామాలతో కూడిన అమరావతి స్మార్ట్‌ సిటీని కేంద్రం గుర్తించింది. దానిని కూడా కాదని ప్రభుత్వం కుట్రతో ఏసీసీఎంసీని పెట్టడానికి చూస్తుంది.

- కాటా అప్పారావు, తుళ్లూరు 


757వ రోజుకు చేరిన ఆందోళనలు 

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఉద్యమం బుధవారంతో 557వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ రైతులను అణచి వేయాలని ప్రభుత్వం ఎందుకు చూస్తుందో అర్థం కావటంలేదన్నారు. ప్రజా వ్యతిరేకమైన మూడు రాజధానులు వద్దంటే మొండి వైఖరితో పాలకులు ముందుకెళుతున్నారన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.

Updated Date - 2022-01-13T06:03:21+05:30 IST