వెంకటపాలెం శిబిరంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు
రాజధాని లేని రాష్ట్రంగా ఎన్నేళ్లు ఉంచుతారు..?
886 వరోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు
తుళ్లూరు, మే 21: అమరావతి అభివృద్ధి లేకపోతే ఏ ఒక్క కంపెనీ రాష్ట్రంలో అడుగు పెట్టదని రాజధాని అమరావతికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలని, బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారం 886వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ, మూడు రాజధానులని గందరగోళంలో పడేసి అసలు రాజధాని లేని రాష్ట్రంగా చేశారన్నారు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరిగి ఉంటే కంపెనీలు పెట్టుబడులు పెట్టటానికి ముందుకు వచ్చేవని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి ముడిపడి ఉందన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును ఏ ప్రభుత్వం అయినా గౌరవించి అమలు చేయాల్సిందేనన్నారు. కుట్రలు ఆపేసి అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహిచారు. వెలగపూడి, దొండపాడు, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం, మందడం తదితర గ్రామాలలో రైతుల ఆందోళనలు కొనసాగాయి.