పెదపరిమి రైతు ధర్నా శిబిరంలో సేవ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేస్తున్న రైతులు
764వ రోజు దీక్షల్లో అమరావతి రైతులు
తుళ్లూరు, జనవరి 19: ఒక్క రూపాయి తీసుకోకుండా రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు భూములు ఇచ్చి ప్రస్తుత పాలకుల వైఖరితో మనోవేదనకు గురయ్యామని అమరావతి రైతులు వాపోయారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు చేస్తోన్న దీక్షలు బుధవారంతో 764వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ఆంధ్రుల రాజధాని ప్రపంచ స్థాయిలో ఉంటుందంటే గర్వపడ్డామని కాని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానులని అమరావతిని నిర్వీర్యం చేశారని తెలిపారు. నవ నగరాల నిర్మాణంతో ఎంతో అభివృద్ధి చెంది రాష్ట్ర ఆదాయ వనరుగా అమరావతి మారుతున్న సమయంలో సీఎం జగన్‌రెడ్డి అమరావతిని మూడు ముక్కలు చేశారన్నారు. దీంతో భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలు 200 మందికి పైగా మనోవేదనతో మరణించారన్నారు. అభివృద్ధి కోసం కాకుండా పక్కరాష్ట్రాలు నవ్వుకోవడానికి మూడు రాజధానుల ప్రతిపాదన పనికొస్తుందన్నారు. రాజధాని పరిధిలోని పెదపరిమి తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, అనంతవరం నెక్కల్లు, దొండపాడు, అబ్బరాజుపాలెం, ఐనవోలు, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి తదితర గ్రామాలలో జై అమరావతి అంటూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగించారు.