Abn logo
Sep 26 2021 @ 23:56PM

గుడ్డిగా నమ్మినందుకు శిక్ష

పెదపరిమి రైతు ధర్నా శిబిరంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు

అమరావతిపై నాటి మాటలేమయ్యాయి

సీఎం జగన్‌కు రాజధాని రైతులు, కూలీల ప్రశ్నలు

నేటితో అమరావతి ఉద్యమానికి 650 రోజులు పూర్తి


 గుంటూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అమరావతి కోసం రైతులు, మహిళలు, కూలీలు రోడ్డెక్కారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. మూడు రాజ ధానులను వ్యతిరేకిస్తూ వారు చేస్తోన్న పోరు సోమవారంతో 650వ రోజుకు చేరుకోనున్నది. ఎండా.. వాన.. పిల్లా.. పెద్దా.. రైతులు.. కూలీలు.. పేద.. గొప్ప అన్న తేడా లేకుండా శిబిరాల నుంచి కొందరు.. ఇళ్లలో నుంచే మరికొందరు ఇలా అమ రావతి ఉద్యమం కొనసాగుతుంది. ఈ క్రమంలో జగన్‌ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అన్నమాటలకు.. అధికారంలోకి వచ్చిన ప్పుడు అవలంభిస్తోన్న చర్యలకు పొంతన ఉండటంలే దం టూ.. అమరావతి రైతులు, మహిళలు, కూలీలు.. ప్రశ్నల రూ పంలో ఆదివారం తమ ఆవేదనను ఇలా వ్యక్తం చేశారు.


అయ్యా జగన్‌గారు..

ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాజధాని అమరావతికి మీరు అసెంబ్లీలో మద్దతు పలకలేదా...? 30 వేల ఎకరాలు కావాలని అనలేదా...?విజయవాడ ప్రాంతంలో మధ్యస్థంగా ఉండాలని నమ్మించింది వాస్తవం కాదా...! 2019 ఎన్నికల ముందు అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని, కార్యాలయం పెట్టామని చెప్పారు కదా..? రాజధానిని చంద్రబాబు కంటే మిన్నగా నిర్మాణం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. రాజధాని పింఛన్లు రూ.2,500 నుంచి రూ.5 వేలు చేస్తామన్నారు. అసైన్డ్‌ రైతులకు పట్టా రైతులతో పాటు సమాన ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. ఇవ్వన్నీ మీ నోట పలికిన మాటలే.. వాటిని గుడ్డిగా నమ్మామా ఆనాడు అనిపిస్తుంది. మొదటి నుంచి అమరావతిపై మీ అభిప్రాయాన్ని పసిగట్టలేకపోయామని ఇప్పుడు అనిపిస్తోంది. మొదటగా అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోదీతో పాటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరైనా మీరు మాత్రం రాలేదు. కనీసం అప్పటి మంత్రులు మీకు ఆహ్వాన పత్రం అందించడానికి మీ ఇంటికి వచ్చినా అనుమతించలేదు. అమరావతిలో మొదటి శాసనసభా సమావేశాల అనంతరం ప్రేమగా మేము ఏర్పాటు చేసిన విందుకు హాజరు కాలేదు. అప్పుడే మీ మనస్సులోని ఆంతర్యాన్ని గుర్తించలేకపోయామా అనిపిస్తోంది. మీరు అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర అసెంబ్లీలో 4,700 ఎకరాల ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని ప్రకటించారు. దానిని ఇంత వరకు ఎందుకు తేల్చలేదు. అమరావతిని ఒక సామాజిక వర్గానికి అంటగట్టారు. అమరావతి మునుగుతుందన్నారు, ఒకరు ఎడారి అన్నారు.. మరొకరు శ్మశానం అన్నారు.. ఇంకొకరు పటుత్వం లేని నేలన్నారు. ఇవ్వనన్నీ ఆలోచిస్తుంటే కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిదనే ముద్రవేయాలి అన్నట్లుగా అమరావతిపై అభాండాలు వేశారని ఇప్పుడనిపిస్తోంది. అధికారంలోకి రాగానే అక్రమ కట్టడం అని ప్రజావేదికను కూల్చారు. మిగతా అక్రమ కట్టడాలను కుల్చివేస్తారనుకున్నాం. కానీ మీ కక్ష ప్రజావేదికపైన అని తెలుసుకోలేకపోయాము. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజలు కోసం ఎన్నుకునే ప్రభుత్వాలు పాలన సాగిస్తాయంటారు. అలా మేము ఎన్నుకున్న ప్రభుత్వమే మాకు మరణ శాసనం లిఖించటం తగునా.. అయినా మేము రాజ్యాంగ స్ఫూర్తినే నమ్ముకున్నాము. ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే ఉద్యమాన్ని కొనసాగిస్తాము. అమరావతిపై కోర్టులో అక్షింతలు పడుతున్నా మీరు చేస్తోంది తప్పు అనిపించడం లేదా.. ముఖ్యమంత్రిగారూ ఒక్కసారి మీ మనసాక్షిని అడిగి అమరావతిపై కనికరం చూపించండి.   

 

రాజధానిగా అమరావ తి కాదంటే ఎలా?

649వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు 

తుళ్లూరు: రాష్ట్రానికి రాజధాని అమరావతి.. ఇప్పుడు కాదంటే ఎలా అని రాజధాని రైతులు  ప్రశ్నించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని వారు చేస్తోన్న ఆందోళనలు ఆదివారంతో 649వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కులమతాలకు అతీతంగా అందరి ఆదరాభిమానాలనతో అమరావతి అభివృద్ధి జరుగుతున్న సమయంలో సీఎం జగన్‌రెడ్డి మూడు ముక్కల ఆటతో నాశనం చేశారన్నారు. పాలకులు మారుతుంటారు.. కాని అమరావతి రాజధాని మారదన్నారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను 649 రోజులుగా నడి రోడ్డు  మీద నిలబెట్టిన ఘనత జగన్‌దన్నారు. సమాజం అనారోగ్య దిశగా వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకులదన్నారు.   రాజధాని 29 గ్రామాలతో పాటు తాడికొండ మండలంలో కూడా అమరావతి ఉద్యమం నిర్వహించారు.