రాజధాని రైతులకు పోటీగా శిబిరం.. ట్రైనింగ్ ఇచ్చి మరీ..

ABN , First Publish Date - 2020-10-24T19:16:04+05:30 IST

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దంటూ

రాజధాని రైతులకు పోటీగా శిబిరం.. ట్రైనింగ్ ఇచ్చి మరీ..

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దంటూ ఆ ప్రాంత రైతులు, కూలీలు, మహిళలు గత 311 రోజులుగా దీక్షలు చేపట్టిన విషయం విదితమే. అయితే అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అవహేళనగా మాట్లాడిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్తగా తమకు వ్యతిరేకంగా పెయిడ్‌ ఉద్యమాన్ని మొదలు పెట్టించిందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. శనివారం నాడు రైతులకు పోటీగా మందడంలో శిబిరం వెలిసింది. శిబిరంలో పాల్గొన్నవారికి శిక్షణ ఇస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి వెలుగుచూసింది. 


శిక్షణ ఇచ్చి మరీ..

ఏ ఊరని ఎవరైనా అడిగితే రాజధాని ప్రాంతంలోని బేతపూడి అని చెప్పమంటూ ఓ వ్యక్తి శిబిరానికి వచ్చిన మహిళలకు శిక్షణ ఇస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారని.. ఇళ్ల స్థలాల కోసమే స్వచ్ఛందంగా వచ్చామని చెప్పాలని వారికి ట్రైనింగ్ ఇచ్చాడు. అన్యాయం జరగడం వల్లే రిలే దీక్షలో పాల్గొంటున్నామని చెప్పమని మహిళలతో చెబుతున్నట్లు వీడియోలో ఉంది. అంతేకాదు.. డబ్బులు గురించి అని ఆ పక్కనే ఉన్న మహిళలు అడగ్గా.. డబ్బులు కోసం కాదు.. కాదు ఆ మాట అస్సలు చెప్పకండి అని మరొకరు చెబుతున్నట్లు వీడియోలో రికార్ట్ అయ్యింది. మొత్తానికి చూస్తే ఇలా వీడియోతో అడ్డంగా బుక్కయ్యారన్న మాట. ఇప్పటి వరకూ రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులు అని వైసీపీ నేతలు వక్రంగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయ్.. మరి అడ్డంగా బుక్కయిన ఈ వ్యవహారంపై అధికార పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.


కాపాడుకుంటాం..!

అయితే.. అమరావతి ఉద్యమానికి మద్దతు పెరుగుతుందన్న భయం ప్రభుత్వంలో మొదలైందని అందుకే ఉద్యమాన్ని విచ్ఛన్నం చేయడానికి మూడు రాజధానుల ఉద్యమాన్ని చేయిస్తోందని మహిళా జేఏసీ నేతలు మండిపడుతున్నారు. తమకు పోటీగా ఆందోళన చేసిన వారిలో ఒక్కరైనా భూమి ఇచ్చారా? అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఎన్ని మాటలైనా పడతాం.. అమరావతిని కాపాడుకుంటాం అంటూ మహిళా రైతులు చెబుతున్నారు.

Updated Date - 2020-10-24T19:16:04+05:30 IST