అమరావతి అభివృద్ధిని కొనసాగించాలి

ABN , First Publish Date - 2021-03-04T06:36:55+05:30 IST

పరిపాలనా వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేసి, సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేసి అమరావతి రాజధాని అభివృద్ధిని కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేశారు.

అమరావతి అభివృద్ధిని కొనసాగించాలి
తుళ్లూరు శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు

442వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు 


తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, మార్చి 3: పరిపాలనా వికేంద్రీకరణ చట్టాన్ని రద్దు చేసి, సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేసి అమరావతి రాజధాని అభివృద్ధిని కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని వారు చేస్తోన్న ఉద్యమం బుధవారంతో 442వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని శిబిరాల్లో రైతులు మాట్లాడుతూ అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా, ఆంధ్రులు గర్వించే విధంగా నిర్మాణం చేస్తామంటేనే భూములిచ్చామన్నారు. రాష్ట్ర నడి మధ్యన ఉన్న అమరావతిని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. బ్యాంకు గ్యారంటీతో అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధర్మంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్‌రెడ్డి ఆయన మంత్రులకు ప్రజలు తగిన శిక్షలు వేస్తారన్నారు. శిబిరాలలో న్యాయదేవతకు పూజలు చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించారు. తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాలతో పాటు తాడేపల్లి మండలం పెనుమాకలో దీక్షలు 442వరోజుకు చేరుకున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలోని రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని తిరుమలకు బయలుదేరిన మోతడక  రైతుల పాదయాత్ర ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్దకు చేరింది.  

Updated Date - 2021-03-04T06:36:55+05:30 IST