Abn logo
Aug 4 2021 @ 00:33AM

అడ్డగోలు పాలన ఇంకెన్నాళ్లు?

అనంతవరంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు , మహిళలు

594వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు

తుళ్లూరు, ఆగస్టు 3: రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన పాలకులు వ్యక్తిగత కక్షలతో అడ్డగోలుగా ఇంకెన్నాళ్లు పాలన చేస్తారని అమరావతి రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తోన్న ఉద్యమం మంగళవారంతో 594వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విరుద్ధంగా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారన్నారు. రాజధాని రైతులపై సీఎం కక్ష కట్టారన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య అమరావతికి 30 వేల ఎకరాలు ఉండాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్‌, సీఎం కాగానే రాజధానికి భూములు ఇచ్చిన రైతులను నడి రోడ్డు మీద నిలబెట్టారన్నారు. ఈ పాపం ఊరికే పోదన్నారు. జీవనోపాధి పొందే కన్న తల్లిలాంటి భూములిస్తే, మూడు రాజధానులు అంటూ అమరావతిని నాశనం చేసి పిల్లల బంగారు భవిష్యత్‌ను నాశనం చేశారన్నారు. మంచిపై చెడు గెలవడం తాత్కాలికమని, కాని చెడుపై మంచి విజయం సాధిస్తే అది శాశ్వతమని తెలిపారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా అక్కడా, ఇక్కడా రాజధానులు అంటూ కాలయాపన చేసి రాష్ట్ర ప్రగతిని కూడా అడ్డుకున్నారని పాలకులపై మండిపడ్డారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.