మూడు ముక్కలతో సర్వనాశనం

ABN , First Publish Date - 2021-06-23T05:30:00+05:30 IST

పాలకుల మూడు రాజధానుల నాటకంతో ఐదు కోట్ల మంది ఆంధ్రుల జీవితాలు సర్వనాశనం చేశారని అమరావతి రైతులు వాపోయారు.

మూడు ముక్కలతో సర్వనాశనం
మోతడకలో నిరసన తెలుపుతున్న మహిళలు, రైతులు

554వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు

గుండెపోటుతో ఐనవోలులో మహిళా రైతు మృతి 


తుళ్లూరు, తాడికొండ, జూన్‌ 23: పాలకుల మూడు రాజధానుల నాటకంతో ఐదు కోట్ల మంది ఆంధ్రుల జీవితాలు సర్వనాశనం చేశారని అమరావతి రైతులు వాపోయారు.  రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తోన్న దీక్షలు బుధవారంతో 554వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమ్మకంగా గొంతు కోసే వారిని పాలకులుగా ఎన్నుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులంటూ భూములు ఇచ్చిన రైతులను నడి రోడ్డు మీద నిలబెట్టారన్నారు. కౌళ్లు జమ చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేశారని అయితే ఇంతవరకు ఒక్క రైతు ఖాతాలో కూడా నగదు పడలేదన్నారు. ఐనవోలు గ్రామానికి చెందిన వలపర్ల సమాధానమ్మ(85) అనే మహిళా రైతు బుధవారం మృతి చెందారు. ఆమె రాజధానికి ఆరెకరాలు భూమి ఇచ్చారు. అయితే అమరావతి భవిష్యత్‌పై ఆందోళనతో మనవేదనకు గురయ్యారు. మంచం పట్టిన ఆమె మానసిక  వేదనతో  గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆమె మృతికి రాజధాని దళిత జేఏసీ సభ్యులు నివాళులర్పించారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి చేసిన నమ్మక ద్రోహానికి భూములు ఇచ్చిన రైతులు బలవుతున్నారని రాజధాని దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌ ఆరోపించారు. రైతు శిబిరాల నుంచి ఆందోళనలు కొనసాగాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి అని నినాదాలు చేశారు.  రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో బుధవారం నిరసనలు కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయటంతో పాటు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రభుత్వం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా మహిళలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.  


 

Updated Date - 2021-06-23T05:30:00+05:30 IST