అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి

ABN , First Publish Date - 2021-05-09T05:42:00+05:30 IST

రాష్ట్రాభివృద్ధి.. అమరావతితోనే ముడిపడి ఉందని రైతులు, మహిళలు పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని మహిళలు, రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం శనివారం 508వ రోజుకు చేరుకుంది

అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి
తుళ్లూరులో కొంగు చాపి అర్థిస్తున్న మహిళలు

పింఛను పెంపు హామీని నిలబెట్టుకోవాలి

కౌలు జాప్యం లేకుండా చెల్లించాలి

రాజధాని రైతులు, మహిళల డిమాండ్‌

508వ రోజుకు చేరిన ఆందోళనలు 


తుళ్ళూరు, తాడికొండ, మే 8: రాష్ట్రాభివృద్ధి.. అమరావతితోనే ముడిపడి ఉందని రైతులు, మహిళలు పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని మహిళలు, రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం శనివారం 508వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు అంటూ సీఎం జగన్‌రెడ్డి నమ్మకద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిసి కూడా స్వార్థ ప్రయోజనాల కోసం మూడు ముక్కల ఆట ఆడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా అభివృద్ది కొనసాగించాలని కోరారు.  రైతు కూలీలకు ఐదు వేలు ఫించన్‌ అమలు చేయాలన్నారు. ఇప్పటికీ రూ.2,500 ఇస్తున్నారని అమరావతి నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా సమయానికి జమ చేయటం లేదన్నారు. మాట తప్పి మడమ తిప్పి హామీని పక్కన పెట్టారని మండిపడ్డారు. రైతులకు ప్రతి ఏడాది ఇవ్వాల్సిన కౌలు జాప్యం లేకుండా జమ చేయాలన్నారు. పాలకులారా అమరావతిని నిర్వీర్యం చేసి రాష్ట్ర భవిష్యత్‌ని నాశనం చేయవద్దు అంటూ మహిళలు కొంగుచాపి అర్థించారు. కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రం పతనం అవుతుందన్నారు. కరోనా కేసులతో రాష్ట్రం విలవిల్లాడుతుంటే టీడీపీ నాయకులపై ప్రభుత్వం కేసలు పెట్టి వేధిస్తోందన్నారు. వ్యాక్సిన్‌ కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తుందన్నారు. వ్యాక్సిన్‌ కొరత తీర్చి కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలన్నారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు.  


 

Updated Date - 2021-05-09T05:42:00+05:30 IST