త్యాగానికి ఇదేనా ప్రతిఫలం

ABN , First Publish Date - 2021-05-07T05:58:36+05:30 IST

రాజధాని కోసం భూములిచ్చిన తమను ఈ ప్రభుత్వం రోడ్డున పడేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగానికి ఇదేనా ప్రతిఫలం అంటూ మండిపడ్డారు

త్యాగానికి ఇదేనా ప్రతిఫలం
మోతడకలో నిరసనలు వ్యక్తం చేస్తున్న మహిళలు, రైతులు

భూములిచ్చిన మమ్మల్ని రోడ్డున పడేశారు..

రాజధాని రైతుల ఆవేదన

506వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు 


తుళ్లూరు, తాడికొండ,  మే6: రాజధాని కోసం భూములిచ్చిన తమను ఈ ప్రభుత్వం రోడ్డున పడేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగానికి ఇదేనా ప్రతిఫలం అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం 506వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్ల నుంచి అమరావతి రాజధానిగా రాష్ట్ర పాలన జరుగుతుంటే కొత్తగా మూడు రాజధానులంటూ వైసీపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని పేర్కొన్నారు. మూడు ముక్కల ఆటతో రాష్ట్ర ప్రగతి కుంటు పడిందన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయకుండా అడవిగా మార్చారన్నారు. మూడు రాజధానుల ప్రకటనతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను జగన్మోహనరెడ్డి మోసం చేశారని రైతులు, మహిళలు పేర్కొన్నారు. 506 రోజులుగా రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తుంటే సీఎం స్పందించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వం భూములు కేటాయించిన 139 సంస్థలను రాకుండా చేసి యువత ఉద్యోగ అవకాశాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విదేశాల్లో ఆంధ్రులని నవ్వులపాలు చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన దానికి విలువ లేకుండా చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని మూడు రాజధానులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానుల ప్రకటనను వెనకకు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడకలో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు.\


 రాజధానిలో నిరుపేదలను పట్టించకోరా?

 రాజధానిలో నిరుపేదలకు జీవనభృతి రూ.5వేలకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చిన జగన్‌రెడ్డి దానిని నెరవేర్చలేదని  దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌, కో కన్వీనర్‌ చిలకా బసవయ్య అన్నారు. వ్యవసాయం లేదు.. పనులు లేవు ఎలా బతకాలి అని రాజధాని కూలీలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే  పెండింగ్‌ ఉన్న నాలుగు  నెలల ఫింఛన్‌ జమ చేయాలని డిమాండ్‌ చేశారు. కౌలు ఫింఛన్‌ జమచేయకపోతే సీఆర్డీయే కార్యాలయాన్ని ముట్టడించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

Updated Date - 2021-05-07T05:58:36+05:30 IST