‘దళిత బంధు’ను అడ్డుకుంటే ఉరికిచ్చి కొడుతాం

ABN , First Publish Date - 2021-07-30T05:40:18+05:30 IST

‘దళిత బంధు’ను అడ్డుకుంటే ఉరికిచ్చి కొడుతాం

‘దళిత బంధు’ను అడ్డుకుంటే ఉరికిచ్చి కొడుతాం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజయ్య

- మాదిగలను కేసీఆర్‌కు దూరం చేసిన దుర్మార్గుడు ఈటల 

- ఎమ్మార్పీఎ్‌సను గ్రూపులుగా విభజించిన నీచుడు 

- మాదిగల జోలికి వస్తే తస్మాత్‌ జాగ్రత్త

- వారంతా ఏకమైతే ఉప ఎన్నికలో డిపాజిట్‌ రాదు

- ‘పథకాన్ని’ నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు

- స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌, జూలై 29 : దళిత బంధు పథకాన్ని అడ్డుకోవాలని చూస్తే ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులను ఉరికిచ్చి కొడుతాం బిడ్డా అని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ ఉపఎన్నిక అయ్యేవరకు నిలిపి వేయాలని కోరుతూ ఈటల అనుచరులు పద్మనాభరెడ్డి, గోనె ప్రకాశ్‌రావు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి పథకాన్ని తీసుకువస్తే దళిత ద్రోహిగా అడ్డుకొంటున్నారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే దళితబంధును నిలుపుదల చేయాలనడానికి సిగ్గు ఉండాలన్నారు. దళితబంధును ప్రకటిస్తారనే భయంతో ఈటలకు, అతడి అనుచరులకు ఒంటిలో వణుకు పడుతోందన్నారు. 

ఈటల రాజేందర్‌ బావమరిది మధుసూదన్‌రెడ్డి మాదిగలు చిన్నచిన్న వాటికే ఆశపడుతారని అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మధుసూదన్‌రెడ్డిపై సుమోటగా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎ్‌సలో గ్రూపులు సృష్టించి, దళితులను కేసీఆర్‌కు దూరం చేసిన దుర్మార్గుడు ఈటల పేర్కొన్నారు. దళిత బంధుతో దళితులు అందరు ఒక్క తాటిపైకి వచ్చి, టీఆర్‌ఎ్‌సకు దగ్గర అవుతారనే భయంతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం పిరికిపందల చర్య అన్నారు. దళితులు తలుచుకుంటే హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటలకు డిపాజిట్‌ కూడ దక్కదన్నారు. దళిత బంధుకు అడ్డుపడాలని, దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయాలని చూస్తే ఈటల, అతడి అనుచరుల అంతు చూస్తామని హెచ్చరించాడు. దళిత సాధికారత పథకంపై కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రస్తావించి రూ.1000 కోట్లు కేటాయిస్తానని ప్రకటించిన సమయంలో ఈటల కేబినెట్‌లో ఉన్న విషయం మిరిచిపోయి నిస్సిగ్గుగా మాట మార్చడం సిగ్గుమాలిన తనానికి నిదర్శనమన్నారు. 

రాబోయే ఎన్నికల వరకు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పైన అనుకున్న స్థాయిలో చేయలేకపోతే ప్రజలు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉండి చేసిన అభివృద్ధిని చెప్పుకొని ఓట్లు అడుగవద్దని, బీజేపీ చేసిన పనిచెప్పి ఈటల వ్యక్తిగతంగా చేసిన అభివృద్ధిని చెప్పుకొని ప్రచారం చేసి, చిత్తశుద్ధి చాటుకోవాలని హితవుపలికారు. సీఎం కేసీఆర్‌ ఏడేళ్ల పరిపాలనలో దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అందిస్తామని చెప్పి అందించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని, దళితులను అభివృద్ధి చేయాలనే ఉన్నతమైన లక్ష్యంతో దళితబం ధును తీసుకువస్తున్నారన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టుగా 20వేల కుటుంబాలకు అమలు చేయనున్నట్లు తెలిపారు. 

కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు తాటికొండ సురే్‌షకుమార్‌, ఎంపీటీసీలు సింగపురం దయాకర్‌, బెల్లపు వెంకటస్వామి, గుర్రం రాజు, టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కనకం రమేశ్‌, గడ్డమీది వెంకటస్వామి, కందుల గట్టయ్య, నాయకులు కొలిపాక వేణు, తోట సత్యం, బొల్లు లక్ష్మి, కుంభం నరేందర్‌, గట్టు మనోహర్‌, దైద ఎలిషన్‌, మారపల్లి ప్రసాద్‌, మల్లేషం, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T05:40:18+05:30 IST