రాజ్‌థాకరేపై పవార్ పంచ్‌లు...

ABN , First Publish Date - 2022-04-03T21:01:19+05:30 IST

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్‌థాకరేపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్..

రాజ్‌థాకరేపై పవార్ పంచ్‌లు...

ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్‌థాకరేపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ నిశిత విమర్శలు చేశారు. రాజ్‌థాకరేకు ఏ అంశంపై కూడా నిలకడైన వైఖరి ఉండదని, ఏడాదిలో మూడు, నాలుగు నెలలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఆయన ప్రత్యేకత అని అన్నారు. శరద్ పవార్ 'కుల రాజకీయాలు' నడుపుతున్నారంటూ రాజ్‌థాకరే చేసిన విమర్శలపై పవార్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.


ముంబైలోని శివాజీ పార్క్‌లో శనివారంనాడు జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌ థాకరే మాట్లాడుతూ, శరద్ పవార్ సమయం వచ్చినప్పుడల్లా కులం కార్డ్ బయటకు తీస్తారని, సమాజాన్ని విడకొడుతుంటారని విమర్శించారు. దీనిపై పవార్ ఆదివారంనాడు కొల్హాపూర్‌లో స్పందించారు. అన్ని కులాలను ఏతతాటిపైకి తీసుకువస్తున్న పార్టీ ఎన్‌సీపీ అని, తమపై వ్యాఖ్యలు చేసేముందు ఎన్‌సీపీ చరిత్ర ఏమిటో రాజ్‌థాకరే చదివితే బాగుంటుందని చురకలు వేశారు. రాజ్‌థాకరే మూడు నాలుగు నెలలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, అకస్మాత్తుగా బయటకు వచ్చి లెక్చర్లు ఇస్తుంటారని విమర్శించారు. చాలా విషయాలపై ఆయన (రాజ్‌థాకరే) మాట్లాడుతుంటారు కానీ , ఏ విషయంలోనూ ఆయనకు నిలకడ అనేది ఉండదని అన్నారు. ఛగన్ భుజ్‌బల్, మధుకర్‌రావు పిచాడ్ తదితరులు ఎన్‌సీపీ సభానేతలుగా పనిచేశారని, వారంతా ఏ కులానికి చెందిన వారో అందరికీ తెలుసునని చెప్పారు. ఎమ్మెల్యేగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాతే తన మేనల్లుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సభానేత అయ్యారని అన్నారు. ఆయన అందుకు అర్హుడని ఎన్‌సీపీలోని చాలామంది నేతలు అంగీకరించడం వచ్చే ఆ పదవిని అజిత్ అంగీకరించారని చెప్పారు.


మోదీకి దగ్గరవుతారేమో..?

రాజ్‌థాకరే గత వైఖరి ఏమిటో మహారాష్ట్ర ప్రజలకు తెలుసునని, ప్రస్తుతం ఆయన ధోరణి నరేంద్ర మోదీకి మద్దతిచ్చేలా కనిపిస్తోందని, అయితే ఆయన తదుపతి చర్య ఏమిటో తమకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా పవార్ చెప్పారు. గతంలో మోదీని పొగిడారని, ఆ తర్వాత వ్యతిరేకించారని, ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారో తెలియదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ ప్రభావం ఎలాగ ఉండొచ్చో తాను చెప్పలేనని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ఎన్నికల గణాంకాల ప్రకారం చూసినప్పుడు ఎంఎన్ఎస్ చాలా పరిమితంగానే సీట్లు సంపాదించుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-04-03T21:01:19+05:30 IST