ముంబై: వచ్చే నెల 5వ తేదీన అయోధ్య(Ayodhya)ను సందర్శించాలని అనుకున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (Maharashtra Navnirman Sena) అధినేత రాజ్ థాకరే (Raj Thackeray).. తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు శుక్రవారం ప్రకటించారు. వాయిదా వేయడానికి గల కారణాలను పూణెలో 22వ తేదీని నిర్వహించే ర్యాలీలో చెప్తానని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి థాకరే అయోధ్య పర్యటనపై చాలా వ్యతిరేకత వచ్చింది. ఉత్తర భారతీయులపై గతంలో రాజ్ థాకరే విరుచుకుపడ్డారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిని వ్యతిరేకిస్తూ అనేక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మహారాష్ట్ర పట్ల విధేయతను కూడా ప్రశ్నించారు. వీటన్నిటినీ గుర్తు చేస్తూ యూపీ, బిహార్‌కు చెందిన నేతలు రాజ్ థాకరే అయోధ్య పర్యటనను తీవ్రంగా వ్యతిరించారు.
ఇవి కూడా చదవండి
ఉత్తర భారతీయులకు క్షమాపణ చెప్పాకనే ఆయన అయోధ్యకు రావాలంటూ బీజేపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ మిత్ర పార్టీ జేడీయూ అయితే ఉత్తర భారతీయులకు నెంబర్ 1 శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది రాజ్ థాకరేనేనని, ఆయనను అయోధ్యలో అడుగు పెట్టనివ్వబోమని విమర్శించింది. కొద్ది రోజులుగా బీజేపీకి సన్నిహతంగా ఉంటూ వస్తోన్న రాజ్ థాకరేకు ఎన్డీయే కూటమి నుంచే ఎక్కువ వ్యతిరేకత రావడంతో పర్యటన వాయిదా వేసుకోక తప్పలేదని అంటున్నారు. అయితే ఈ విషయంపై రాజ్ థాకరే ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పూణెలో నిర్వహించే సభలో ఈ విషయమై క్లారిటీ ఇస్తానని ఆయన చెప్పడం గమనార్హం.
ఇవి కూడా చదవండి