14 ఏళ్ల కేసులో Raj Thackerayకు నాన్ బెయిలబుల్ వారెంట్

ABN , First Publish Date - 2022-05-03T22:10:44+05:30 IST

పదునాలుగు సంవత్సరాల క్రితం నాటి కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన...

14 ఏళ్ల కేసులో Raj Thackerayకు నాన్ బెయిలబుల్ వారెంట్

సాంగ్లి: పదునాలుగు సంవత్సరాల క్రితం నాటి కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాకరేకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా షిరలలోని కోర్టు ఈ వారెంటు జారీ చేసింది. 2008లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఐపీసీలో సెక్షన్ 109, 117 కింద రాజ్ థాకరేపై గతంలో కేసు నమోదైంది. ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తాజా వారెంట్లు జారీ చేస్తూ ఎంఎన్ఎస్ చీఫ్‌ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ముంబై పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.


థాకరేతో పాటు మరో ఎంఎన్ఎస్ నేత శిరీష్ పార్కర్‌కు వారెంట్లు ఇవ్వాలని ముంబై పోలీస్ కమిషనర్‌కు, ఖేర్వాలి పోలీస్ స్టేషన్‌కు న్యాయమూర్తి ఆదేశాలిచ్చిన్టటు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతి పాటిల్ తెలిపారు. జూన్ 8వ తేదీలోగా వారెంట్ అమలు చేసి, ఇద్దరు నేతలను కోర్టు ముందు హాజరు పరచాలని పోలీసులను కోర్టు ఆదేశించిందని ఆమె చెప్పారు.


ఉద్యోగాల్లో స్థానికుల ప్రాధాన్యం ఇవ్వాలని ఆందోళన చేసిన థాకరే అరెస్టుకు నిరసనగా ఎంఎన్ఎస్ కార్యకర్తలు 2008లో షిరలలో నిరసనకు దిగారు. కాగా, 2012కు ముందున్న రాజకీయ కేసులను ఉపసంహరించాలన్న గవర్నమెంట్ రూల్ ఉందని, అయితే మసీదులపై లౌడ్‌స్పీకర్ల అంశాన్ని రాజ్‌థాకరే లేవనెత్తినందున ఆయనపై కేసును తిరగదోడారని స్థానిక ఎంఎన్ఎస్ కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు.

Read more