ప్లాటు కొంటే రైతుబంధు!

ABN , First Publish Date - 2022-06-21T08:11:39+05:30 IST

సాధారణంగా ఒక భూమిని లేఅవుట్‌గా మార్చాలంటే.. తొలుత దానిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. దీనికోసం

ప్లాటు కొంటే రైతుబంధు!

రైతు బీమా, పీఎం కిసాన్‌ కూడా వర్తింపు..

ధరణి ఆసరాగా అక్రమ లేఅవుట్ల దందా

వ్యవసాయ భూమిలో నేరుగా ప్లాట్ల విక్రయం

ఒక్కో గుంట చొప్పున అమ్ముతూ రిజిస్ట్రేషన్‌

విస్తీర్ణంపై నియంత్రణ ఎత్తివేసిన ఫలితం

కట్టడి చేయాలంటూ పురపాలక శాఖ లేఖ 

పట్టించుకోని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ఆయన తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు


ఇంటిస్థలం కొంటే.. రైతుబంధు, రైతుబీమా! పట్టాదారు పాస్‌పుస్తకం.. పీఎం కిసాన్‌ కింద రూ.6 వేలు!! వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులకు అందే ఈ ప్రయోజనాలన్నీ ప్లాట్‌ కొనుక్కున్న వారికీ అందుతున్నాయి!!! వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్‌ చేయకుండానే లేఅవుట్‌ చేసి ప్లాట్లు విక్రయిస్తుండడమే ఇందుకు కారణం. ఇటువంటి అనుమతిలేని లేఅవుట్‌లకు ధరణిలో పూర్తి రక్షణ ఉండడం, దీనిని అడ్డుకునే అధికారం ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో హైదరాబాద్‌ నగర శివారులోని జిల్లాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. 


రియల్టర్లు ఏకంగా కరపత్రాలు ముద్రించి మరీ బహిరంగంగా అనుమతిలేని లేఅవుట్‌లు వేస్తూ ప్లాట్లు విక్రయిస్తున్నారు. ప్రభుత్వానికి నాలా కన్వర్షన్‌, డెవల్‌పమెంట్‌ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయంతో పాటు రిజిస్ట్రేషన్‌ ఫీజు/స్టాంపు డ్యూటీ పేరిట రావాల్సిన ఆదాయానికి కూడా గండి కొడుతున్నారు. 


హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా ఒక భూమిని లేఅవుట్‌గా మార్చాలంటే.. తొలుత దానిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. దీనికోసం కన్వర్షన్‌, డెవల్‌పమెంట్‌ చార్జీలు చెల్లించాలి. అంతేకాకుండా ఒక ఎకరం భూమిని (4840 గజాలు) లేవుట్‌ చేస్తే.. రోడ్లు, రీక్రియేషన్‌ జోన్‌, పార్కులు, నీళ్ల ట్యాంకు వంటి సౌకర్యాలన్నీ కల్పించాక విక్రయానికి అందుబాటులో ఉండే భూమి 2420 గజాలు మాత్రమే ఉంటుంది. దీంతో ఇవేమీ లేకుండా 4840 గజాల భూమిలో ఫామ్‌ల్యాండ్‌ పేరిట ఏకంగా 4500 గజాల భూమిని అమ్ముకునేలా రియల్టర్లు ప్లాన్‌ వేసి అమలు చేస్తున్నారు. 2020 సెప్టెంబరు నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్‌లే చేస్తుండగా.. ధరణి పోర్టల్‌ వచ్చాక రిజిస్ట్రేషన్‌కు కనీస విస్తీర్ణం ఎంత ఉండాలన్న నియంత్రణ కూడా విధించలేదు. తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే గుంట (121 గజాల) భూమికి కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. దీంతో రియల్టర్లు భూమిని గజాల చొప్పున విక్రయించి పట్టా చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసినవారికి రైతుబంధు, రైతుబీమా, పీఎం కిసాన్‌ వంటి పథకాలు వర్తిస్తున్నాయి.


నిబంధనల ప్రకారం లేఅవుట్‌ చేస్తే.. ఒక సర్వే నెంబర్‌లో 30 ఎకరాల భూమి ఉంటే.. 15 ఎకరాలు మాత్రమే విక్రయానికి మిగులుతుంది. దీంతో రియల్టర్లు నిబంధనలకు నీళ్లొదిలి వ్యవసాయ భూమి మధ్యలో అటు ఇటు రోడ్లు వేసి.. చుట్టూ గోడలు కట్టేసి, గేటెడ్‌ కమ్యూనిటీగా ప్రచారం చేసుకుంటూ అమ్ముకుంటున్నారు. రిజిస్ట్రేషన్ల బాధ్యతను తహసీల్దార్‌లకు అప్పగించక ముందు విస్తీర్ణంపై నియంత్రణ ఉండేది. ఖుష్కి అయితే కనీసం 5 గుంటలు (605 గజాలు), తరి భూమి అయితే 10 గుంటలు(1210 గజాలు) ఫామ్‌హౌస్‌ ప్లాట్‌ అయితే 20 గుంటల (2420) ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉండేది. ఇంతకన్నా తక్కువ విస్తీర్ణం ఉంటే చుట్టూ అన్ని హద్దుల్లో వ్యవసాయ భూములు పక్కాగా ఉండాలనే నిబంధన ఉండేది. కానీ, ధరణి అమల్లోకి వచ్చాకా సబ్‌ రిజిస్ట్రార్‌లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌పై అధికారాలను తొలగించడంతో ఈ నియంత్రణ లేకుండా పోయింది. దీంతో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.


ధరణి రాకముందు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లు ఏటా 6-7 లక్షల వరకు నమోదుకాగా.. 2021-22లో ధరణి రిజిస్ట్రేషన్లు ఏకంగా 8.32 లక్షల నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ధరణి కేంద్రంగా అక్రమాలు జరుగుతున్నాయని, ఒక ప్లాటు విస్తీర్ణం 2420 గజాలు తగ్గితే ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్‌ చేయకూడదంటూ స్వయం గా రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(రిజిస్ట్రేషన్ల)కి సూచిస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ 2021 జూలై 9న లేఖ రాశారు. కానీ, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(రిజిస్ట్రేషన్లు) బాధ్యత కూడా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ చేతిలోనే ఉన్నా, అర్వింద్‌కుమార్‌ నేరుగా ఆయనకే లేఖ రాసినా దందా ఆగడం లేదు. ఈ లేఖ రాసి 11 నెలలు కావస్తున్నా.. భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)గానూ వ్యవహరిస్తున్న సోమేశ్‌కుమార్‌ ఈ దందాను అడ్డుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 


పాస్‌పుస్తకాలు, ప్రొసీడింగ్స్‌లో పట్టని బై నెంబర్లు

రిజిస్ట్రేషన్లు జరిగాక తహసీల్దార్లు జారీ చేసే పట్టాదారు పాస్‌పుస్తకాలు, ప్రోసీడింగ్స్‌లో ఒక ప్లాట్‌కు 100 నుంచి 200ల దాకా బై నెంబర్లు వేయాల్సి వస్తోంది. దీంతో పాస్‌పుస్తకాల్లో 10 బై నెంబర్లకు మించి పట్టడం లేదని అంటున్నారు. ఉదాహరణకు ఒక గ్రామంలోని సర్వే నెం.3లో 5 ఎకరాల భూములను 121 గజాల చొప్పున ప్లాట్లుగా చేసుకొని 250 ప్లాట్ల దాకా అమ్మితే.. దీనికోసం సర్వేనెం. 3/1/1/1/1/1/1/1/1/1/1/1/1/ 1/1/1అంటూ 200దాకా బైనెంబర్లు వేయాల్సి ఉంటుం ది. ఇలా ఒకే సర్వేనెంబర్‌లో వందలాది బై నెంబర్లు వేస్తున్న సంఘటనలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ తర్వాత క్రమంగా ఈ భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం ఉండటంతో వ్యవసాయేతర భూమిగా   (నాలా)ను మార్చుకోవడానికి అవకాశం కూడా ఉంది.  

Updated Date - 2022-06-21T08:11:39+05:30 IST