రెంట్‌ ప్లీజ్‌!

ABN , First Publish Date - 2022-05-21T06:10:28+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్యంకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణలో సమస్యలు తలెత్తుతున్నాయి.

రెంట్‌ ప్లీజ్‌!
అద్దె చెల్లించకపోవడంతో వివాదంగా మారిన గురజాల రైతు భరోసా కేంద్రం

రైతు భరోసా కేంద్రాలకు చెల్లించని అద్దె

జిల్లాలో 293 కేంద్రాలు అద్దె భవనాల్లోనే

అద్దె బాకాయి రూ.1.17 కోట్లు పైమాటే

8 నెలలుగా అద్దె కోసం భవన యాజమానులు ఎదురుచూపు


నరసరావుపేట, మే 20: ప్రభుత్వం ప్రతిష్టాత్యంకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణలో సమస్యలు తలెత్తుతున్నాయి. నెలల తరబడి అద్దె చెల్లించడంలేదు. దీంతో భవనాల యాజమానులు అద్దె కోసం అధికారులపై వత్తిడి తెస్తున్నారు. తమ భవనాలను ఖాళీ చేయాలని కొంతమంది యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలో 293 రైతు భరోసా కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అద్దె చెల్లించకపోతే భవనాలకు తాళాలు వేస్తామని యజమానులు అధికారులను హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అద్దె చెల్లింపునకు నిధులు విడుదల చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

జిల్లాలో రైతులకు వివిధ సేవలు అందించేందుకు ప్రభుత్వం 421 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా విత్తనాలు, ఎరువుల విక్రయాలు, ధాన్యం కోనుగోలు తదితర సేవలను అందిస్తున్నారు. 293 కేంద్రాలను అద్దె భవనాలలో నిర్వహిస్తుండగా 128 కేంద్రాలను ప్రభుత్వం భవనాలలో ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో వీటిని నిర్వహిస్తున్నారు. 1000 చదరపు అడుగుల భవనానికి నెలకు అద్దె రూ.5 వేలు చెల్లించాల్సి ఉంది. 2020 మేలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెలకు సూమారు రూ.14.65 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంది. 2021 ఆగస్టు నెల వరకు ఆర్‌బీకేలకు అద్దె చెల్లించారు. 2021 సెప్టెంబరు నుంచి 2022 ఏప్రిల్‌ నెల వరకు 8 నెలలకు అద్దె చెల్లించాల్సి ఉంది. అద్దె బకాయిల నిధుల విడుదల కోసం ప్రభుత్వం వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపింది. నేటి వరకు ఈ దస్త్రంపై ప్రభుత్వం స్పందించలేదు. అద్దె బకాయిలు ఇప్పటి వరకు రూ.1.17 కోట్లు ఉన్నట్టు వ్యవసాయ శాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. నెలల తరబడి అద్దె చెల్లించకపోవడంతో భవనాలను ఖాళీ చేయాలని కొందరు యాజమానులు అధికారులపై వత్తిడి తెస్తున్నారు. గురజాలలోని ఆర్‌బీకే విషయంలో అద్దె వివాదం నెలకొనడంతో వ్యవసాయ అధికారులు ఈ కేంద్రాన్ని సందర్శించి త్వరలోనే అద్దె చెల్లిస్తామని యజమానికి చెప్పారు. అద్దె ప్రాసెస్‌లో ఉందని వారు తెలిపారు. అద్దె చెల్లింపులో ఇలానే జాప్యం జరిగితే భవనాల యజమానులు ఆర్‌బీకేలను ఖాళీ చేయించే పరిస్థితులు నెలకొనున్నాయి.  

Updated Date - 2022-05-21T06:10:28+05:30 IST