ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోళ్లు రేపటితో క్లోజ్‌

ABN , First Publish Date - 2022-07-06T07:01:14+05:30 IST

రైతుల నుంచి రబీ ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను నిలుపుదల చేస్తున్నారు. గురువారం నుంచి కోనసీమ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి.

ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోళ్లు రేపటితో క్లోజ్‌

  • ఇప్పటివరకు 4,39,469 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
  • సేకరించిన ధాన్యం విలువ రూ.852.57 కోట్లు
  • బకాయిలు విడుదల చేయాలని రైతుల డిమాండు

రైతుల నుంచి రబీ ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను నిలుపుదల చేస్తున్నారు. గురువారం నుంచి కోనసీమ జిల్లాలో ధాన్యం  కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. జిల్లావ్యాప్తంగా ధాన్యం సేకరణ కోసం ఏర్పాటుచేసిన ఆర్బీకేల్లో ధాన్యం సేకరణ నిలిపివేయడానికి నిర్ణయించారు. ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఏర్పడుతున్న సమస్యలను పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ తులసిని కలిసి తమ గోడు వినిపించారు. 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కోనసీమ జిల్లాలో 2021-22 రబీ సీజనకు సంబంధించి  వ్యవసాయ శాఖ అధికారుల అంచనా మేరకు 6,87,274 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా రైతుల నుంచి ధాన్యం సేకరించడానికి 390 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేశారు. 5.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే జూన 30వ తేదీ వరకు జిల్లాలో 4,39,469 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 47,759 మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. జిల్లావ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ ఆర్బీకేల ద్వారా జూన నెలాఖరు నాటికి సేకరించిన ధాన్యం విలువ రూ.852.57 కోట్లుగా అంచనా వేశారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ పూర్తయినట్టు భావించిన ప్రభుత్వం ఈ నెల 7వ తేదీ నుంచి ఆర్బీకేల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసి వేయడానికి నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరగలేదనేది రైతు సంఘాల నాయకుల ఆరోపణ. ముఖ్యంగా ఆర్బీకేల్లో  ప్రభుత్వం విధించిన సవాలక్ష నిబంధనలు కారణంగా రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకే దళారీలకు విక్రయించు కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల సేకరించిన ధాన్యం కొనుగోలులో కూడా గోల్‌మాల్‌ భారీగా జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా అమలాపురం రూరల్‌ మండలం ఎ.వేమ వరప్పాడులోని ఆర్బీకేలో ఈ-క్రాప్‌లో నమోదుకాని రైతుల పేరిట సుమారు రూ.42 లక్షలు విలువైన ధాన్యాన్ని కొనుగోలుచేసి నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపునకు కారణమాయ్యడనే ఆరోపణపై ఆర్బీకే ఉద్యోగి తులసీరావుపై ఇప్పటికే వేటు పడింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయా ధికారిణి వై.ఆనందకుమారి ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ముమ్మిడివరంలో ఉన్న పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ తులసిని రైతు నాయకులు కలిసి కోనసీమ రైతలు ఎదుర్కొంటున్న సమస్యలపై యాళ్ల బ్రహ్మానందం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయగా ఆమె సానుకూలంగా స్పందించారు. 

Updated Date - 2022-07-06T07:01:14+05:30 IST