హోరెత్తిన పోరు

ABN , First Publish Date - 2022-07-03T07:01:07+05:30 IST

రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ జగ్గంపేటలో చేపట్టిన రైతుపోరు సభ హోరెత్తింది.

హోరెత్తిన పోరు
జగ్గంపేటలో శనివారం జరిగిన రైతు పోరు సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వేదికపై ఇతర ప్రముఖులు

జగ్గంపేటలో జరిగిన రైతుపోరు బహిరంగ సభకు హాజరైన రైతులు

జగ్గంపేటలో హోరెత్తిన అయిదు జిల్లాల టీడీపీ ‘రైతుపోరు’ 

వేలాదిగా తరలివచ్చిన రైతులు, పార్టీ అభిమానులు

జగన్‌ పాలనలో వ్యవసాయ రంగ నిర్వీర్యంపై నేతల ధ్వజం

 గోదావరి జిల్లాల్లో క్రాప్‌ హాలిడే దుస్థితిపై ఆందోళన

జిల్లాలో ప్రాజెక్టులు ఎక్కడివక్కడే జగన్‌ ప్రభుత్వం నిలిపివేయడంపై ఆగ్రహం 

జనస్పందనతో పార్టీలో ఉత్సాహం


కాకినాడ (ఆంధ్రజ్యోతి)/జగ్గంపేట/ జగ్గంపేట రూరల్‌ : రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ జగ్గంపేటలో చేపట్టిన రైతుపోరు సభ హోరెత్తింది. వేలాది మంది అన్నదాతలు, అభిమానుల రాకతో దద్దరిల్లింది. అయిదు జిల్లాల్లోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన అశేష జనవాహినితో జగ్గంపేట దద్దరిల్లింది. జగన్‌ ప్రభుత్వంలో నిర్వీర్యమైన వ్యవసాయ        రంగంపై నేతలు ఽధ్వజమెత్తారు. ఎరువుల ధరలు పెరుగుదల నుంచి ధాన్యం డబ్బులు సకాలంలో రాకపోవడం, క్రాప్‌హాలీడేలు, ఉమ్మడి జిల్లాల్లో పడకేసిన సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుపోరు సభ వైసీపీ పాలనను తూర్పారబట్టింది. రైతులను దగా చేస్తున్న జగన్‌ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చింది. ఎన్నికల ముందు రైతులకు మాయమాటలు చెప్పి ఇప్పుడు ఏడిపిస్తున్న వైసీపీని సాగనంపాలని పిలుపునిచ్చింది. తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామని హామీ ఇచ్చింది. ఊహించిన దానికంటే అధికంగా తరలివచ్చిన జనంతో జగ్గంపేటలో టీడీపీ తలపెట్టిన రైతుపోరు విజయవంతమైంది. ఇక సభావేదికను ధాన్యం,కొబ్బరి, పామాయిల్‌ గెలలు, చెరుకు, అరటి, మొక్కజొన్న         తదితర వ్యవసాయ ఉత్పత్తులతో అలంకరించడం అందరినీ ఆకర్షించింది. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేటలో శనివారం సాయంత్రం నిర్వహించిన రైతుపోరు సభకు కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి పలువురు టీడీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. స్థానిక చైతన్య స్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ సభకు వేలాది మంది రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో అన్నదాతలు పడుతున్న కష్టాలపై సభలో నేతలు ఏకరువు పెట్టారు. జగన్‌ పాలనలో విద్యుత్‌ మీటర్లు అమర్చే ప్రయత్నాలతో రైతులకు తలెత్తే ఇబ్బందులు, ధాన్యం కొనుగోలు జరిగినా ఇప్ప టికీ డబ్బులు చెల్లించకపోవడంతో ఖరీఫ్‌ సాగుకు అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై నేతలు ప్రసంగించారు. వ్యవసాయరంగంపై జగన్‌కు అవగాహన లేకపోవడంతో రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని వీరంతా ఽధ్వజమెత్తారు. ధాన్యం డబ్బులు అందక గోదావరి జిల్లాల రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేసే పరిస్థితి తలెత్తిందని మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, బండారు సత్యనారాయణ, రాజప్ప,ప్రత్తిపాటి పుల్లారావు, పితాని, జవహార్‌ తదితరులు పేర్కొన్నారు. అంతకుముందు రైతు స్టీరింగ్‌ కమిటీ సభ్యులు ధూళిపాళ నరేంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూన రవికుమార్‌, టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏలూరు జిల్లా టీడీపీ అధ్య క్షుడు గన్ని వీరాంజనేయులు, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు మాట్లాడారు. అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటానని ప్రగల్భాలు పలికిన జగన్‌ తీరా సీఎం అయ్యాక అప్పుల పాలయ్యేలా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. సీఎం అయ్యాక సహకార రంగంలో పాల డెయిరీలను ప్రోత్సహిస్తానని చెప్పిన జగన్‌ ఇప్పుడు డెయిరీలను నిర్వీర్యం చేశారన్నారు. తన సొంత స్వార్థం కోసం ప్రభుత్వం నిర్వహించే పాల డెయిరీలను పక్కకు నెట్టి గుజరాత్‌కు చెందిన అమూల్‌ పాల కంపెనీకి మూడు వేల కోట్లు సాయం చేసి ప్రోత్సహించడం చూస్తుంటే జగన్‌ గుజరాత్‌ ముఖ్యమంత్రిలా అనిపిస్తున్నాడన్నారు. గోదావరి జిల్లాల్లో ఖరీఫ్‌ సాగుకు ఇప్పటికీ నీళ్లు అంద డం లేదని మండిపడ్డారు. జ్యోతుల నెహ్రూ, నవీన్‌కుమార్‌లు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే జగన్‌ ప్రభుత్వంలో రైతులను ఏడిపిస్తోందన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ చంద్రబాబు మెట్ట ప్రాంతంలోని భూములకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని పురుషోత్తంపట్నం ఫేజ్‌1,2లకు అనుమతులు ఇస్తే జగన్‌ వచ్చి వాటిని ఆపేసి సైకోగా మారారని ధ్వజమెత్తారు. నెహ్రూ మాట్లాడుతూ ధవళేశ్వరం బ్యారేజీ మరమ్మతులకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. ఆక్వారంగంలోనూ రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కోనసీమలో క్రాప్‌ హాలిడే ప్రకటించారంటే పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మాజీ మంత్రుల యనమల, బండారు సత్యనారాయణ, రాజప్ప తదితరులు మాట్లాడుతూ విద్యుత్‌ మోటార్లకు మీటర్లు వేయకుండా రైతులు పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని గెలిపిస్తేనే రైతులకు, పాడిపంటలకు మేలు జరిగే పరిస్థితి ఉందన్నారు. తుగ్లక్‌ పరిపాలన చేస్తున్న జగన్‌ ప్రభుత్వాన్ని దింపి చంద్రబాబు పాలన కోసం రైతులు ముందుకు రావాలని రైతుపోరు సభ పిలుపునిచ్చింది. బండారు సత్యనారాయణ తన ప్రసంగంలో జిల్లాలో పోలవరం ఎడమ కాలువ విషయంలో మంత్రి రాజా దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తుని నియోజకవర్గంలో మూడుచోట్ల కాలువ క్రాసింగ్‌లు పూర్తి చేయాల్సి ఉన్నా రాజా పట్టించుకోవడం లేదన్నారు. ఆ మంత్రి ఉదయం పూట కనిపించరు.. రాత్రివేళల్లోనే బయట తిరుగుతారని ఎద్దేవా చేశారు. కార్య క్రమంలో మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యా రావు, పీతల సుజాత, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందం, దాట్ల బుచ్చిరాజు, వనమాడి కొండబాబు, చింతమనేని ప్రభాకర్‌, పెందుర్తి వెంకటేష్‌, వంతల రాజేశ్వరి, మాజీ ఎంపీ మాగంటిబాబు, ఎమ్మెల్సీ చిక్కాల, మాజీ ఎమ్మెల్సీ రెడ్డిసుబ్రహ్మణ్యం, ఆదిరెడ్డి అప్పారావు, కాకినాడ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు సుంకర పావని, వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-07-03T07:01:07+05:30 IST