రైతు బేజార్లు!

ABN , First Publish Date - 2022-07-28T05:02:24+05:30 IST

ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 రైతు బజార్లు ఉండగా ప్రస్తుత గుంటూరు పరిధిలోకి 9 రైతు బజార్లు వచ్చాయి.

రైతు బేజార్లు!
నరసరావుపేటలో రైతు బజారు నిర్వహణ కోసం నిర్మించిన షెడ్ల పరిస్థితి




సమస్యల సుడిలో రైతు మార్కెట్లు

కరోనాకు ముందు కళకళ.. నేడు వెలవెల

మౌలిక వసతులు కరువు

రైతుల స్థానే బినామీల పాగా

బయటి మార్కెట్‌ నుంచే కూరగాయలు

సాధారణం కన్నా అధికంగా ధరలు


ఉమ్మడి జిల్లాలో రైతుబజార్లు సమస్యల సుడిలో చిక్కి సతమతమవుతున్నాయి. నిన్నటి వరకూ కళకళలాడిన రైతుబజార్లు నేడు వెలవెలబోతున్నాయి. తెలుగుదేశం పాలనలో అందరికీ చేరువలో ఉండగా కరోనా, అనంతర కాలంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయాయి. సొంత నిర్మాణాలు లేక కొన్ని, అద్దె స్థలాల్లో ఇంకొన్ని, సదుపాయాలు లేక మరికొన్ని రైతుబజార్లు ప్రజలకు దూరమై పోతున్నాయి. జిల్లా కేంద్రాలు అయిన నరసరావుపేట, బాపట్లలలో మూడేళ్ల కిందట నిర్మించిన రైతుబజారు భవన నిర్మాణాలు కనీసం వినియోగంలోకి తీసుకురాకపోవడం చూస్తే పాలకుల చిత్తశుద్ధి అర్ధం అవుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 12 రైతు బజార్లలోనూ సమస్యలు తాండవిస్తున్నాయి.

 


గుంటూరు, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 రైతు బజార్లు ఉండగా ప్రస్తుత గుంటూరు పరిధిలోకి 9 రైతు బజార్లు వచ్చాయి. గుంటూరు, తెనాలి, మంగళగిరి, పొన్నూరుల్లో ఉన్న 9 రైతుబజార్లు గుంటూరు పరిధిలోకి రాగా, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లిలో ఉన్న 3 రైతుబజార్లు పల్నాడు జిల్లా పరిధిలోకి వెళ్లాయి. కరోనా కాలంలో జరిగిన మార్పుచేర్పుల కారణంగా ఇవి జనావాసాలకు దూరమయ్యాయి. వీటిలో చాలావాటికి మంచి నీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా కరువయ్యాయి. దీనికి తోడు సరైన నిర్మాణాలు లేక, కంపోస్టును సరిగా నిర్వహించని కారణంగా దుర్గంథభరితంగా మారుతున్నాయి. దీనికితోడు దళారీ వ్యవస్థ తిష్ట వేయడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో వినియోగదారులు ముఖం చాటేస్తున్నారు. 

 

బినామీల హవాతో ధరలు పైపైకి

రైతులకు గిట్టబాటు ధర కల్పించాలి.. వినియోగదారులకు సరసమైన ధరలకు కాయగూరలు అందించాలి అన్న లక్ష్యంతో దళారీ వ్యవస్థను నియంత్రించేలా 2002లో టీడీపీ ప్రభుత్వం రైతుబజార్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం, మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ లక్ష్యం పూర్తిగా దెబ్బతింది. తిరిగి మధ్య దళారీ వ్యవస్థ వచ్చి చేరింది. ప్రస్తుతం రైతుబజార్లలో రైతులకు బదులుగా బినామీలు పాగా వేశారు. స్థానిక రైతులు పండించిన పంటలు కాకుండా, హోల్‌సేల్‌ మార్కెట్లలో కాయగూరలు తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో కాయగూరల ధరలు సాధారణ మార్కెట్‌కు సమానంగా, లేదా అధికంగా ఉంటున్నాయి. 

 

 నరసరావుపేటలో మూడేళ్లుగా ఇదే దుస్థితి

జిల్లా కేంద్రం నరసరావుపేటలో మునిసిపాలిటీ రూ.10లక్షల వ్యయంతో రూరల్‌ పోలీసుస్టేషన్‌ పక్కన రైతు బజారును నిర్మించింది. ఇది మూడేళ్ల కిందటి మాట. అప్పటి నుంచి ఈ నిర్మాణాన్ని వినియోగించకుండా వదిలేసి పాడుపెట్టారు. రైతు బజార్‌ను ప్రారంభించేందుకు పాలకులు కనీస ప్రయత్నాలు చేయడంలేదు. చివరికి ఈ  ప్రాంతాన్ని మునిసిపాలిటీ కంపోస్టు యార్డుగా మార్చింది. రైతు బజారును నిర్వహించేందుకు మార్కెటింగ్‌ శాఖ చేపట్టిన చర్యలు శూన్యమేనని చెప్పాలి. 


తెనాలిలో సమస్యల వెల్లువ

 తెనాలి పట్టణంలో చిన్న, పెద్దవి కలిపి దాదాపుగా ఆరు రైతు బజార్లు ఉన్నాయి. చెంచుపేటలోని, చిట్టాంజనేయస్వామి టెంపుల్‌ రోడ్డు, మారీసుపేటరోడ్డు, గంగానమ్మపేటరోడ్‌లలో ఉన్న రైతు బజార్లలో కనీస మౌలిక వసతులు కూడాలేవు. తాగేందుకు నీరు, టాయిలెట్స్‌ వంటివి లేకపోగా వర్షం కురిస్తే చాలు మురుగునీటితో ఆయా ప్రాంతాలు చిన్నపాటి చెరువులను తలపిస్తాయి. బుర్రిపాలెం రోడ్డులోని రైతుబజారులో టాయిలెట్స్‌ అందుబాటులో ఉండగా మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ మాత్రం పనిచేయడంలేదు. వర్షం వస్తే జనం ఆ మురుగునీటిలోనుంచి వచ్చి కూరగాయలు కొనుగోలు చేయాల్సిందే. 


 నాడు 12.. నేడు 3 దుకాణాలు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి స్పీకర్‌ డాక్టర్‌కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో సత్తెనపల్లి మార్కెట్‌యార్డు ఆవరణలో రైతు బజారును ఏర్పాటు చేశారు. టీడీపీ హయాంలో మొత్తం 12 షాపులు కొనసాగేవి. కాలక్రమేణ షాపుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ముగ్గురు రైతులు మాత్రమే రైతుబజారులో కూరగాయలు విక్రయిస్తున్నారు. రైతు బజారుపక్కన మరుగుదొడ్లు ఉన్నప్పటికీ అవి ఉపయోగించుకోవటానికి పనికిరావు. పారిశుధ్యం కూడా అధ్వానంగా ఉంది.  

  

మంగళగిరిలో ఉన్నా.. లేనట్టే!

మంగళగిరిలో రైతు బజారు ఉన్నా లేనట్టే అన్న చందంగా తయారైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి దేవస్థానం ఉత్సవ గ్రౌండులో రైతు బజారును ఏర్పాటు చేశారు. ఈ రైతు బజారుకు మంచి ఆదరణ లభించిన తరుణంలో దేవస్థానం వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమనడంతో నిడమర్రు రోడ్డులోని మార్కెట్‌ యార్డు ఆవరణలోనికి తరలించారు. ఇది పట్టణ ప్రజలకు దూరం కావడంతో పాత కూరగాయల మార్కెట్‌ను ఎక్కువగా ఆశ్రయించేవారు. గత టీడీపీ హయాంలో శిథిలావస్థకు చేరిన పాత కూరగాయల మార్కెట్‌ స్థానంలో అధునాతన భవనం నిర్మించేందుకు సర్వం సిద్ధం చేశారు. కూరగాయల మార్కెట్‌ను రాజీవ్‌ గృహకల్ప రోడ్డులోనికి తరలించారు. మార్కెట్‌ నిర్మాణ పనులు మొదలైన కొద్దిరోజులకే ప్రభుత్వం మారడంతో కూరగాయల మార్కెట్‌ నిర్మాణం అర్థంతరంగా నిలిచిపోయింది. గృహకల్ప రోడ్డులోని మార్కెట్‌ యార్డు నిడమర్రు రోడ్డులోని రైతు బజారు కన్నా దూరమైంది.  మంగళగిరి రైతు బజారులో 29 దుకాణాలు ఉండగా, కేవలం 12 మాత్రమే మొక్కుబడిగా నడుస్తున్నాయి. వారిలో సగం మంది రైతులు కాగా, మిగతా వారు ప్రైవేటు వ్యాపారులే! జీవో నెం.29 ప్రకారం ప్రభుత్వ రైతు బజారుకు అర కిలోమీటరు దూరం వరకు ప్రైవేటు వ్యాపారాలకు అనుమతి లేదు. అయినప్పటికీ ఇక్కడ ప్రైవేటు వ్యాపారులు కూరగాయలను విక్రయిస్తున్నారు. రైతు బజారు లేదా కూరగాయల మార్కెట్‌ను అందుబాటులో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


దళారులదే దందా

పొన్నూరు పట్టణంలో ఏర్పాటుచేసిన రైతు బజార్‌లో దళారులదే దందాగా మారింది. సుదీర్ఘకాలం పట్టణవాసుల పోరాట ఫలితంగా రైల్వే స్టేషన్‌ రోడ్‌లో గత ప్రభుత్వ హయాంలో రైతు బజార్‌ను ఏర్పాటుచేశారు. స్థానిక కూరగాయలు పండించే రైతులకు స్టాళ్లను కేటాయించి తక్కువ ధరకే కూరగాయలు విక్రయించేవారు. అయితే మూడేళ్లకాలంగా ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. రైతుల స్థానంలో ప్రైవేటు వ్యక్తులు రైతుబజారులోని దుకాణాల్లోకి ప్రవేశించారు. దీంతో వారి ఇష్టారాజ్యంగా మారింది.



బాపట్లలో మూడేళ్లుగా మూత 

బాపట్ల పట్టణంలోని రైతుబజారు మూడేళ్లుగా మూతపెట్టి ఉంచారు. 2019వ సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ మార్కెట్‌శాఖ నిధులు సుమారు రూ.60లక్షలు వెచ్చించి అధునాతన పద్ధతిలో రైతుబజారు నిర్మించారు. ఇప్పటి వరకు దుకాణాలు ఎవరికి కేటాయించకుండా ఉంచారు. ఫలితంగా బాపట్ల పరిసరప్రాంతాలలో కూరగాయలు పండించే రైతులు తమ ఉత్పత్తులను జమ్ములపాలెం ఆర్‌వోబీ కింద రైతుబజారు ఎదురు రోడ్లపై పెట్టి విక్రయించుకుంటున్నారు. కూరగాయల మార్కెట్‌లోని వ్యాపారులు యూనియన్‌గా ఏర్పడి వీరిపై అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెడుతున్నప్పటికి అధికారులు ఏమాత్రం స్పందించటంలేదు. గత పాలకులు నిర్మించారన్న కారణంతోనే దుకాణాలు మూసి ఉంచి తమను ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు పేర్కొంటున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వ్యాపారులు నిర్ణయించిన సమయంలోనే రోడ్లపై కూరగాయలు, ఆకుకూరలు విక్రయించుకునే పరిస్థితి నుంచి తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు.  

 


Updated Date - 2022-07-28T05:02:24+05:30 IST