రైతన్నకు ఎంత కష్టం?

ABN , First Publish Date - 2022-08-08T05:43:55+05:30 IST

ఎలమంచిలి మునిసిపాలిటీలోని ఎలమంచిలి, పెదపల్లి, మంత్రిపాలెం, గొల్లలపాలెంలతో పాటు ఎస్‌.రాయవరం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు కూరగాయలను సాగుచేస్తున్నారు.

రైతన్నకు ఎంత కష్టం?
ఎలమంచిలిలో విక్రయించేందుకు తెచ్చిన బీరకాయలు

- కష్టించి పండించినా గిట్టుబాటు ధర రాని వైనం

- దళారులు ఏకమై తక్కువ ధర నిర్ణయిస్తుండడంతో నష్టాలు

- రైతుబజారు అందుబాటులో లేక ఇబ్బందులు


పంటలు బాగా పండాలి.. ప్రకృతి సహకరించాలి.. గిట్టుబాటు ధర రావాలని ఎన్నో ఆశలు పెట్టుకునే రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. కష్టించి పండించిన పంటకు మార్కెట్లో ధర పలకడం లేదు. దళారులు సిండికేట్‌గా మారి తమకు నష్టం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. రైతుబజారు ఉండి ఉంటే తమకీ కష్టాలు ఉండేవికావని ఆవేదన చెందుతున్నారు.

ఎలమంచిలి, ఆగస్టు 7: ఎలమంచిలి మునిసిపాలిటీలోని ఎలమంచిలి, పెదపల్లి, మంత్రిపాలెం, గొల్లలపాలెంలతో పాటు ఎస్‌.రాయవరం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు కూరగాయలను సాగుచేస్తున్నారు. ఈ సీజన్‌లో అధికంగా వంగ, బీర, బెండ, ఆకుకూరలను పండిస్తారు. నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలు ప్రధానంగా కూరగాయల సాగును ప్రధాన ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాయి. పురుషులు పంటల సాగులో నిమగ్నమైతే, కొందరు మహిళలు, పురుషులతో పాటు పండిన పంటను బుట్టల్లో మార్కెట్‌కు తీసుకువస్తారు. అయితే 20 కిలోల బీరకాయల బుట్టను దళారులకు రూ.300కే ఇవ్వాల్సి వస్తోంది. ఆటో చార్జీ మనిషికి రూ.20, బుట్టకు రూ.20, ఆశీలు చార్జీ రూ.20లు పోతే తమకు మిగిలేది రూ.240లేనని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్‌ కావడంతో మార్కెట్‌కు ఒక్కసారిగా సరకు ఎక్కువగా వస్తుండడంతో ఇదే అదనుగా కొందరు దళారులు తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. దళారులంతా సిండికేట్‌గా మారి ధర పలకకుండా చేయడంతో గత్యంతరం లేక అదే ధరకు ఇవ్వాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో బీరకాయలు కిలో రూ.30 పలుకుతుంటే తమకు మాత్రం కష్టానికి తగ్గ ఫలితం ఉండడం లేదని చెబుతున్నారు. 

రైతుబజారు లేకపోవడంతో..

పట్టణంలో వినియోగదారులు, రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు నిర్మించిన రైతు బజారు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. కొందరు రైతు బజారును నిర్వీర్యం చేయడంతో ఉన్న రైతు బజారు మూసివేశారు. అప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదు. రైతుబజారు అందుబాటులో ఉంటే తమకు గిట్టుబాటు ధర వచ్చేదని రైతులు, తమకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు లభించేవని వినియోగదారులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రైతుబజారును తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2022-08-08T05:43:55+05:30 IST